మార్స్ పై  చైనా రోవర్ జర్నీ షురూ

మార్స్ పై  చైనా రోవర్ జర్నీ షురూ

బీజింగ్: అంగారకుడిపై చైనా ఫస్ట్ రోవర్ ‘ఝురోంగ్’ తన జర్నీ షురూ చేసింది. శనివారం ల్యాండర్ నుంచి రోవర్ సేఫ్​గా కిందకు దిగిందని చైనా సైంటిస్టులు ప్రకటించారు. మార్స్ మట్టిపై చక్రాలు మోపిన ఝురోంగ్ రోవర్.. వెంటనే ల్యాండర్ ఫొటోను కూడా పంపిందని వెల్లడించారు. తియాన్వెన్–1 మిషన్ లో భాగంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) నిరుడు జులై 23న  ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ను లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపింది. తియాన్వెన్–1 స్పేస్ క్రాఫ్ట్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న మార్స్ కక్ష్యలోకి చేరింది. రోవర్ తో కూడిన ల్యాండర్ మే 15న అంగారకుడిపై ఉత్తర భాగంలోని ఉటోపియా ప్లానీషియా అనే ప్రాంతంలో సేఫ్ గా దిగింది. ‘మార్స్ నేలపై ఝురోంగ్ రోవర్ 3 నెలలపాటు తిరగనుంది. అక్కడి పరిసరాలను హైరెసొల్యూషన్ తో 3డీ ఫొటోలు తీసి పంపిస్తుంది. మార్స్ వాతావరణంలో మార్పులను కూడా రికార్డ్ చేస్తూ మొత్తం డేటాను భూమికి పంపనుంది’ అని చైనా సైంటిస్టులు తెలిపారు.