వచ్చే నెల 8 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడి

వచ్చే నెల 8 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడి

బీజింగ్: జీరో కొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొన్న చైనా సర్కారు.. వచ్చే నెల 8 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు తప్పనిసరి క్వారంటైన్ ను రద్దు చేయనుంది. అలాగే సరిహద్దులను కూడా తిరిగి తెరవనుంది. దాదాపు మూడేండ్ల తర్వాత ఇంటర్నేషనల్  ఐసొలేషన్  నుంచి బయటకు రానుంది. ఈ విషయాన్ని నేషనల్  హెల్త్  కమిషన్(ఎన్​హెచ్​సీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా మేనేజ్ మెంట్ ను క్లాస్ ఏ నుంచి క్లాస్ బీకి తగ్గిస్తామని ఎన్​హెచ్ సీ తెలిపింది. అలాగే డెంగీ లాంటి జ్వరాలను తక్కువ తీవ్రత ఉన్న రోగాల జాబితాలోకి మారుస్తామని పేర్కొంది.

కాగా, ఇప్పటిదాకా చైనాకు వెళ్లిన అంతర్జాతీయ ప్రయాణికులు.. రెండు వారాలపైనే ప్రభుత్వం కల్పించిన క్వారంటైన్  కేంద్రాల్లో గడిపారు. ఆ తర్వాత క్వారంటైన్ ను ఐదు రోజులకు తగ్గించారు. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న టైంలో క్వారంటైన్ ను రద్దు చేయడం గమనార్హం. కాగా, ఒమిక్రాన్  వేరియంట్.. డెల్టా స్ట్రెయిన్  అంత ప్రాణాంతకంకాదని, అందువల్లే ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు క్వారంటైన్ ను రద్దు చేశామని చైనా అధికారులు తెలిపారు.