చైనా రాకెట్ శకలాలు పసిఫిక్​లో పడ్డయ్

చైనా రాకెట్ శకలాలు పసిఫిక్​లో పడ్డయ్
  • యూఎస్ స్పేస్ కమాండ్ ప్రకటన
  • కొద్దిరోజుల ఉత్కంఠకు తెర 


కొలరాడో (యునైటెడ్ స్టేట్స్): చైనా రాకెట్ శకలాలకు సంబంధించి కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పోయిన నెల 31న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ కు చెందిన 23 టన్నుల శకలాలు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు (లోకల్ టైం ప్రకారం) దక్షిణ మధ్య పసిఫిక్ ప్రాంతంలో కూలిపోయాయని యూఎస్ స్పేస్ కమాండ్ ప్రకటించింది. రాకెట్ కోర్ స్టేజీకి సంబంధించిన 10 అంతస్తుల సైజులో ఉన్న ఖాళీ బూస్టర్ వాతావరణంలోకి ఎంటరవగానే మండిపోయిందని, ఇతర పెద్ద శకలాలు మాత్రం కిందకు పడ్డాయని వెల్లడించింది. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ కు చెందిన బూస్టర్, శకలాలు అమెరికా, పసిఫిక్, ఆఫ్రికా, ఇండియన్ ఓషియన్, ఆస్ట్రేలియా ప్రాంతంలో ఎక్కడైనా పడొచ్చన్న అంచనాలతో కొద్దిరోజులుగా ఉత్కంఠ ఏర్పడింది.

అయితే, అవి దక్షిణ మధ్య పసిఫిక్ లో పడ్డాయని, సరిగ్గా ఏ లొకేషన్ లో పడ్డాయన్నది తర్వాత వెల్లడిస్తామని యూఎస్ స్పేస్ కమాండ్ తెలిపింది. కాగా, అంతరిక్షంలో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తున్న చైనా, దానికి మూడోది, చివరిదైన మాడ్యూల్ ను లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా పంపింది. చైనా రాకెట్ శకలాలు పసిఫిక్ ఓషియన్​లో పడటం గడిచిన రెండేండ్లలో ఇది నాలుగో సారి.