
కరాచీ: పాకిస్తాన్‌లో తరుచూ దాడులు జరుగుతుండడంతో అక్కడున్న చైనా టీచర్లు సొంత దేశానికి వెళ్లిపోతున్నారు. పలు యూనివర్సిటీల్లో మాండరిన్‌ను బోధిస్తున్న చైనా టీచర్లే లక్ష్యంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. దీంతో చైనా టీచర్లందరూ వెనక్కి రావాలంటూ చైనా పిలుపునిచ్చింది. చాలామంది వెళ్లిపోయారని కరాచీ యూనివర్సిటీ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. చైనా పౌరులే లక్ష్యంగా పాక్‌లోని కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ వద్ద నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ)కి చెందిన ఓ మహిళ ఆత్మాహుతి దాడి చేసింది. ఈ ఘటనలో డిపార్ట్‌మెంట్ హెడ్‌తో సహా ముగ్గురు చైనీస్ టీచర్లు, స్థానిక డ్రైవర్ మృతిచెందాడు. దీంతో ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న చైనా టీచర్లతో పాటు దేశంలోని మిగతా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోయారని అధికారులు పేర్కొన్నారు.