వరుస వానలకు దెబ్బతిన్న సిటీ రోడ్లు

వరుస వానలకు దెబ్బతిన్న సిటీ రోడ్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో అన్ని చోట్ల రోడ్లు వేస్తున్నామని జీహెచ్ఎంసీ గొప్పలు చెప్పుకుంటుంటే.. పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సిటీలో రోడ్లన్నీ పాడైపోయి కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీల నుంచి మెయిన్‌ రోడ్లు వరకు డ్యామేజ్ అయిపోయి, ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే కనిపిస్తున్నాయి. వానలు పడకముందే చాలా చోట్ల పాట్ హోల్స్​ ఉండగా, ఇటీవల కురిసిన వర్షాలకు మరిన్ని ఏర్పడ్డాయి. ప్రస్తుతం 20 వేలకు పైగా పాట్ హోల్స్​ఏర్పడ్డాయి. అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో వాటిపై ప్రయాణించేందుకు వీలు లేకుండా మారింది. ఇబ్బందులు ఎదురవుతుండటంతో వాహనదారులు వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు.

ఏండ్ల పాటు ఉండాల్సినవి నెలల్లోనే..

జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కి.మీ. మేర రోడ్లు ఉండగా ఇందులో 2,846 కి.మీ. బీటీ రోడ్లు, 6167 కి.మీ. పరిధిలో అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. 709 కి.మీ. మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. వానలు పడితే పాట్ హోల్స్ ఏర్పడటం కామన్ అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇండియన్ ​రోడ్ ​కాంగ్రెస్ రూల్స్ ​ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేండ్ల వరకు, అదే సీసీ రోడ్లయితే పదేండ్ల దాకా కరాబ్ కాకుండా ఉండాలి. కానీ ఇప్పుడు వేస్తున్న రోడ్లపై నెలల వ్యవధిలోనే గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతూ నాసిరకం పనులు చేస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బిల్లులు చెల్లించల్లే..
కార్వాన్, ఎస్ఆర్​నగర్, కూకట్​పల్లి, రాంగోపాల్​పేట, ముసారాంబాగ్, బాలానగర్, బహదూర్​పురా, ఎల్​బీనగర్, యాకుత్ పురా, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. రద్దీగా ఉండే  ప్రాంతాల్లో పాట్ హోల్స్ ఏర్పడ్డాయి. కాలనీ రోడ్లను అసలు పట్టించుకోవడం లేదు. ఏవో పనుల కోసం గుంతలు తవ్వి ఆ ప్రాంతాల్లో తిరిగి రోడ్లు వేయడం లేదు. డల్లాస్, ఇస్తాంబుల్ తరహాలో సిటీని డెవలప్ చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గతంలో హామీ ఇచ్చారు. కానీ రోడ్ల రిపేర్లకు జీహెచ్​ఎంసీకి ప్రభుత్వం ఫండ్స్​ఇవ్వడం లేదు. దీంతో రిపేర్లు చేపట్టక రోడ్లు మరింత దారుణంగా మారుతున్నాయి. రెగ్యులర్​గా బిల్లులు చెల్లించకపోతుండటంతో కాంట్రాక్టర్లు  కూడా ముందుకు రావడం లేదు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లిస్తే కనీసం రోడ్ల రిపేర్ పనులు జరుగుతాయని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు.

నీరు నలిచి ఎక్కడ గుంత ఉందో  తెలుస్తలే 

వానలే పడతే ఎక్కడ గుంతలు ఉన్నాయే కూడా తెలియడం లేదు అందుకే వర్షం పడినప్పుడు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంటుంది. ఆ టైంలో బిజినెస్ వద్దనుకొని ఇంట్లోనే ఉంటున్న 
గుడాడి సంతోష్ రెడ్డి, క్యాబ్ డ్రైవర్