పాకిస్తాన్ లో అంతర్యుద్ధం.. ఇమ్రాన్ దిగిపోవాలంటూ ఉధృతం అవుతున్న నిరసనలు

పాకిస్తాన్ లో అంతర్యుద్ధం.. ఇమ్రాన్ దిగిపోవాలంటూ ఉధృతం అవుతున్న నిరసనలు

పాకిస్తాన్.. పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ 1947లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు సగానికి పైగా టైమ్ ఆర్మీ పాలనే సాగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు కూడా ఆర్మీ చేతిలో కీలుబొమ్మల్లా నడవాల్సిందే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది పాటించాల్సిందే. కాదని ఎదురుతిరిగితే ప్రభుత్వాన్ని ఆర్మీ కూలదోసిన సందర్భాలూ ఉన్నాయి. తొలిసారిగా ఇప్పుడు పాకిస్తాన్లో విపక్షాలన్నీ ఏకమై రాజకీయ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యం ఉండకూడదంటూ పోరాడుతున్నాయి. దేశమంతా ర్యాలీలు చేస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి ముందుగా ఈ ఉద్యమం పార్టీల్లో కాదు.. ప్రజల్లోనే పుట్టింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో మొదలైన ఉద్యమాన్ని పార్టీలు హైజాక్ చేసి.. పోరాటం దశ దిశ మార్చేసి వాటి స్వార్థానికి వాడుకుంటున్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ మొత్తం వ్యవహారం వెనుక విదేశీ కుట్ర ఉందని వాదిస్తోంది.

పాకిస్తాన్ లో ఇప్పుడు అంతర్యుద్ధం లాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇమ్రాన్ ప్రభుత్వం దిగిపోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు అంతా కలిసి పోరాటం సాగిస్తున్నాయి. ప్రజలే ప్రభుత్వంపై మొదలుపెట్టిన తిరుగుబాటు ఇది. గత నెలలో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ కు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన నిరసనలే ఉద్యమం స్థాయి చేరాయి. సెప్టెంబర్ 9న లాహోర్ నేషనల్ హైవేపై కారులో వెళ్తున్న మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తుండగా ఆయిల్ అయిపోవడంతో లాహోర్ శివారుల్లో కారు ఆగిపోయింది. సాయం కోసం కారు దిగి రోడ్డుపై నిలబడి ఉన్న ఆమెను అటుగా వెళ్తున్న ఇద్దరు తుపాకీతో బెదిరించి పిల్లల ఎదురుగానే రేప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సామాన్యుల్లో ఆవేశాన్ని రగిల్చింది. బాధితురాలికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.. లాహోర్లో మహిళలు రోడ్లపైకి వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు. లాహోర్ పోలీస్ అధికారి ఉమర్ షేక్ బాధితురాలిదే తప్పన్నట్లుగా మాట్లాడారు. ‘పిల్లలతో కలిసి రాత్రి టైమ్ లో బయటకు ఎందుకొచ్చింది? వచ్చినా ఆమె ఆ రూట్ లో వెళ్లి ఉండాల్సింది కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా మహిళలు నిరసనలకు దిగారు. ముఖ్యంగా చదువుకున్న మిడిల్ క్లాస్ ఆడవాళ్లు రోడ్లపై ర్యాలీలు చేశారు. ఉమర్పై చర్యలు తీసుకోవాలని, మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. కానీ అతడిపై కనీసం సస్పెన్షన్ వేటు పడలేదు. ఈ కేసు కోసం ఉమర్ను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖానే ఏరికోరి వేశారన్న ప్రచారం జరగడంతో ప్రజల కోపం ఇమ్రాన్, అధికార పార్టీ పీటీఐపైకి మళ్లింది. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి ప్రజలను పాలించే హక్కు లేదంటూ భారీ స్థాయిలో ర్యాలీలు జరిగాయి.
ఆర్మీపై ఎటాక్
పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో న్యాయవ్యవస్థ, ఆర్మీలపై వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం నేరం. ప్రజాస్వామ్య దేశంలో మాదిరిగా ఎన్నికలు జరుగుతున్నా.. ప్రభుత్వాలపై పెత్తనం ఆర్మీదే. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ అంగీకరిస్తూ వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తిరగబడ్డాయి. పాకిస్తాన్లో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆర్మీ చీఫ్ బజ్వా కూడా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇకపై రాజకీయాల్లో ఆర్మీ జోక్యం ఉండకూడదని నిరసనలు చేపడుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఆర్మీ చేతిలో కీలుబొమ్మ అని, ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ఖ్వామర్ జావెద్ బజ్వా ప్రభుత్వం కంటే తానే సుపీరియర్ పవర్గా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఆర్మీ చీఫ్పై ఈ స్థాయి హాట్ కామెంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ లేరు.
విదేశీ శక్తులు, కరోనా పేరుతో అణచివేత ప్రయత్నం
దేశవ్యాప్తంగా ప్రజలను భారీగా కూడగట్టి ఈ ఏడాది చివరి వరకు నిరసన ర్యాలీలు, సభలు పెట్టాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకున్నాయి. ఎలాగైనా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ఆర్మీ మాత్రం ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇదంతా తన ప్రభుత్వాన్ని కూల్చడానికి విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలను బయటకు రానీయకుండా చేసేందుకు ఆర్మీ లోలోపల బెదిరింపులు కూడా స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా ఉన్న నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ ను అరెస్టు చేసేందుకు ఆర్డర్ ఇవ్వలేదని కరాచీ పోలీస్ చీఫ్ నే కిడ్నాప్ చేసి సంతకం చేపించుకుంది ఆర్మీ. దీనిపై మిగతా పార్టీలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లకుండా చేసేందుకు ఇమ్రాన్ సర్కారు కొత్తదారులు వెతుక్కుంటోంది. దేశంలో మళ్లీ కరోనా లాక్డౌన్ విధించడం ద్వారా అందరినీ కంట్రోల్ చేయొచ్చని డిసైడ్ చేసింది. కానీ, జనంలో మొదలైన ఈ తిరుగుబాటును కంట్రోల్ చేయడం ఇమ్రాన్కు, ఆర్మీకి సాధ్యమవుతుందా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

రంగంలోకి ప్రతిపక్షాలు
దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి రావడంతో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలకు మంచి చాన్స్ దొరికింది. అరకొర మెజారిటీతో అధికారంలో సాగుతున్న ఇమ్రాన్ను దించడానికి ప్రతిపక్షాలకు ధైర్యం చాలలేదు. ఆయన వెనుక ఆర్మీ ఉందన్న భయం అన్ని పార్టీల్లో ఉంది. ఇప్పుడు ప్రజల్లోనే తిరుగుబాటు రావడంతో ఆ పోరాటాన్ని వాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. విపక్షాల్లో పెద్ద పార్టీలైన నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్, భుట్టో-జర్దారీస్ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా మొత్తం 11 పార్టీలు కలిసి పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్(పీడీఎం) పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. పార్టీల మధ్య చీలిక రాకుండా ఉండేందుకు ముస్లింలతోపాటు హిందువులు, ఇతర మైనారిటీల్లోనూ మంచి పేరున్న జమాత్ ఉలేమా ఇస్లామ్ నేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ను కూటమి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ పార్టీల నేతలంతా కలిసి దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా ప్రజలను కూడగట్టి సభలు నిర్వహిస్తున్నాయి. అయితే పోరాటం రాజకీయ పార్టీల చేతిలోకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే మహిళల రక్షణ అన్న ఇష్యూ పక్కకి వెళ్లిపోయింది. దేశంలో ధరల పెరుగుదల, కరెంటు కోతలు, ఆర్థిక సంక్షోభం లాంటి వాటిపైనే నడుస్తోంది.