దేశంలో బ్యూరోక్రాట్లు, పోలీస్ ఆఫీసర్ల  తీరు సక్కగలేదు

దేశంలో బ్యూరోక్రాట్లు, పోలీస్ ఆఫీసర్ల  తీరు సక్కగలేదు

న్యూఢిల్లీ: దేశంలో కొందరు బ్యూరోక్రాట్లు, పోలీస్ ఆఫీసర్ల బిహేవియర్ ఏమాత్రం సక్కగ లేదని సుప్రీంకోర్టు చీఫ్​జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీ లీడర్లతో బ్యూరోక్రాట్లు, పోలీస్ ఆఫీసర్లు అంటకాగుతున్నారని, ప్రధానంగా పోలీస్ ఆఫీసర్ల పనితీరుపై తన దృష్టికి చాలా అంశాలు వచ్చాయన్నారు. బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులపై వచ్చే కంప్లయింట్లపై విచారణకు ప్రత్యేకంగా హైకోర్టు చీఫ్​జస్టిస్ ల ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీలను వేయాలని కూడా ఒక దశలో ఆలోచించానని తెలిపారు. తనపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం పెట్టిన క్రిమినల్ కేసుల్లో ప్రొటెక్షన్ కల్పించాలంటూ సస్పెన్షన్ కు గురైన ఛత్తీస్ గఢ్ అడిషనల్ డీజీపీ గుర్జిందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్ విచారించింది. అతనికి ఇంటెరిమ్ ప్రొటెక్షన్ ను పొడిగించింది. గుర్జిందర్ పై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రాజద్రోహం, అవినీతి, ఎక్స్ టార్షన్ కేసులు నమోదు చేయగా, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పోయిన నెలలో విచారణ టైంలో  రాజద్రోహం, ఎక్స్ టార్షన్ కేసుల్లో అరెస్ట్ చేయరాదంటూ ప్రొటెక్షన్ ను మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. అవినీతి కేసులో ప్రొటెక్షన్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా అవే ఉత్తర్వులను పొడిగించింది.  ప్రభుత్వాలు, నేతల అండతో పోలీస్ ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, కొత్త ప్రభుత్వం వచ్చి కేసులు పెట్టగానే కోర్టులకు వస్తున్నారని అన్నారు. ఇసొంటి ఆఫీసర్లకు చట్టపరంగా తామెందుకు రక్షణ ఇవ్వాలని ప్రశ్నించారు.