సుప్రీంకోర్టు జడ్జ్ కి చిన్నారి లేఖ

సుప్రీంకోర్టు జడ్జ్ కి చిన్నారి లేఖ

ఓ చిన్నారి సీజేఐకు రాసిన లేఖతో గ్రామానికి బస్సు వచ్చింది. ఆ ఊరి పెద్దలు చేయలేని పనిని.. చిన్నారి చేసి చూపించింది. కరోన తర్వాత తమ ఊరికి బస్సు రావడంలేదని.. దాంతో తాము స్కూల్‎కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీజేఐ దృష్టికి తీసుకెళ్లింది. సీజేఐ ఆదేశాలతో ఆర్టీసీ యంత్రాంగం కదిలివచ్చింది. దాంతో చిన్నారి గ్రామానికి బస్సోచ్చింది.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడ్ గ్రామానికి చెందిన పొట్లూరి మంజుల కుమార్తె వైష్ణవి.. యాచారం మండలం గున్‎గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చిన్నారి తన గ్రామం నుంచి స్కూల్‎కు వెళ్లడానికి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులో 16 కిలోమీటర్లు ప్రయాణించేది. ‎అయితే కరోనా మొదటి దశ నుంచి ఆ ఊరికి బస్సులు రాకపోవడంతో స్కూల్‎కు వెళ్లడానికి ఆటోలే దిక్కయ్యాయి. వైష్ణవితో పాటు ఆమె అన్న, అక్క కలిసి ఆటోలో స్కూల్‎కు వెళ్లిరావడానికి ప్రతిరోజూ రూ. 150 ఖర్చు అయ్యేవి. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు తమ బాధను తెలియజేస్తూ వైష్ణవి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణకు సెప్టెంబర్ 9వ తేదీన ఉత్తరం రాసింది.

తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో స్కూల్ కు వెళ్లే తనలాంటి విద్యార్థులెందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైష్ణవి లేఖలో పేర్కొంది. కరోన సమయంలో తన తండ్రి గుండెనొప్పితో చనిపోయాడని.. చిన్న ఉద్యోగం చేస్తూ తన తల్లి తమను చదివిస్తోందని చిన్నారి తెలిపింది. గ్రామానికి బస్సులు వేయాలని ఆర్టీసీకి గ్రామ సర్పంచ్ ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినా బస్సు రావడంలేదని ఉత్తరంలో రాసింది. విద్యార్థులతో పాటు గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ విషయంలో మీరు మాకు సాయం చేయాలని కోరింది.

ఉత్తరం చూసిన వెంటనే సీజేఐ స్పందించారు. చిన్నారి గ్రామానికి బస్సును పునరుద్ధరించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్‎ను ఆదేశించారు. సీజేఐ చెప్పడంతో ఆర్టీసీ కూడా హుటాహుటిన బస్సు సౌకర్యాన్ని తిరిగి ప్రారంభించింది. చిన్నారి ఉత్తరంతో ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు, తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము చేయలేని పని.. వైష్ణవి చేసిందంటూ సర్పంచ్, ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు.

For More News..

అంతర్జాతీయ క్రికెట్‎కు వీడ్కోలు ప్రకటించిన బ్రావో

గుండెపోటుతో బెంగాల్ మంత్రి మృతి