సింగరేణిలో మరో గని క్లోజ్ .. రవీంద్రఖని–6 యూజీ మైన్ మూసివేతకు సన్నాహాలు

సింగరేణిలో మరో గని క్లోజ్ .. రవీంద్రఖని–6 యూజీ మైన్  మూసివేతకు సన్నాహాలు
  • మరో 2 నెలలకే బొగ్గు నిల్వలు
  • ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని కార్మికుల ఆందోళన
  • ఉత్పత్తి, రక్షణలో రికార్డుల గనిగా అవార్డులు 

కోల్​బెల్ట్/నస్పూర్,వెలుగు: మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్​ ఏరియాలోని రవీంద్రఖని–-6 అండర్  గ్రౌండ్  బొగ్గుగని మూసివేసే దశకు చేరుకుంది. గనిలో బొగ్గు నిక్షేపాలు అడుగంటాయి. జూన్, జులైలోగా బొగ్గు వెలికితీత పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గని మూసివేస్తే తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్కే–-6 గనిలో 50 ఏండ్ల నుంచి బొగ్గు ఉత్పత్తి సాగుతుండగా, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణలో గని సింగరేణికే ఆదర్శంగా నిలిచింది. ఉత్పత్తి, రక్షణ విషయంలో రికార్డుల గనిగా ఎన్నో అవార్డులు దక్కించుకుంది. మూడు తరాల కార్మికులు గనిలో విధులు నిర్వహించడం విశేషం.

50 ఏండ్లుగా బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్  ఏరియాలోని రవీంద్రఖని–6 బొగ్గు గని 1975లో ప్రారంభమైంది. సింగరేణిలోని పురాతన గనుల్లో ఈ గని ఒకటి. గనిలో  29.60 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించగా.. గడిచిన 50 ఏండ్లలో 14.48 మిలియన్​ టన్నుల బొగ్గును వెలికితీశారు. మరో 13.95 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. యావరేజ్​గా గనిలో జీ9, జీ12 గ్రేడ్​ బొగ్గును ఉత్పత్తి చేశారు. 1 ఇన్​ 4 గ్రేడియంట్​ గనిలో ఉంది. సుమారు 305 మీటర్ల లోతు వరకు బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ 128 మీటర్ల వరకు వెలికితీత పనులు సాగాయి. 306 హెక్టార్ల విస్తీర్ణంలో మైనింగ్​ కార్యకలాపాలు సాగాయి. డీ ఫిల్లరింగ్  విత్​ కేవింగ్​ పద్ధతిలో ఎస్డీఎల్  యంత్రాల సహకారంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. 

60 రోజులకే బొగ్గు నిక్షేపాలు..

ఆర్కే–-6 అండర్​ గ్రౌండ్​ గనిలో కేవలం 60 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటిని పూర్తిగా వెలికితీసి గనిని మూసివేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. గనిలో 4ఎన్​13/4సీమ్,5ఎన్​13/5సీమ్​ ప్యానన్స్​లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం 243 మీటర్ల లోతులోని పని స్థలాల్లో ఆరు ఎస్డీఎల్​ యంత్రాల ద్వారా రోజుకు 577 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. గనిలోని బొగ్గు నిల్వలు 60 రోజుల్లో వెలికి తీసి ఉత్పత్తి నిలిపివేస్తారు.

 కార్మికులను బదిలీ చేసిన అనంతరం గనిలో ఉన్న యంత్రాలు, పరికరాలు, భారీ పంపులు, ఇతర సామగ్రిని బయటకు తీసి అక్టోబర్​ నాటికి పూర్తి స్థాయిలో మైన్​ మూసివేస్తారు. అనంతరం ఆర్కే–-6 గనితో పాటు ఇప్పటికే మూసివేసిన ఆర్కే–8, భవిష్యత్​లో మూసివేయనున్న ఆర్కే–5 గనిలోని మిగిలిన బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు మెగా ఓపెన్​కాస్ట్​గా మార్చేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది.

బొగ్గు ఉత్పత్తిలో ఆదర్శం..

బెల్లంపల్లి రీజియన్​ పరిధిలో ఆర్కే–-6 భూగర్భగని పాత గనిగా చెప్పవచ్చు. శ్రీరాంపూర్  ఏరియాలో అత్యధిక కార్మికులు ఈ గనిలో పని చేశారు. గతంలో వేలాది కార్మికులు పని చేసినప్పటికీ ప్రస్తుతం 680 మంది కొనసాగుతున్నారు. ఆర్కే–-6 గని ఒకప్పుడు రామకృష్ణాపూర్​ ఏరియాలో కొనసాగగా.. ఏరియాను తొలగించిన తర్వాత గనిని శ్రీరాంపూర్​ ఏరియాలో విలీనం చేశారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. మెజార్టీ కార్మికులు శ్రీరాంపూర్, నస్పూర్​ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గనిలో ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు రెండు నెలల్లో పూర్తిగా అడుగంటిపోతే తమకు బదిలీ తప్పదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

 ప్రధానంగా ఒకటి, రెండేండ్లలో రిటైర్​ అయ్యే సీనియర్​ కార్మికులు తమను ఎక్కడికి బదిలీ చేస్తారోనని భయపడుతున్నారు. సింగరేణి ఆఫీసర్లు మాత్రం గనిని మూసి వేస్తే కార్మికులను శ్రీరాంపూర్​ ఏరియా పరిధిలోని గనుల్లో  సర్దుబాటు చేస్తామని, ఇతర ఏరియాలకు పంపించమని చెబుతున్నారు. గనిలో కార్మికులు, ఆఫీసర్లు కలిసి 692 మంది పని చేస్తున్నారు. వారు గనిలోకి వెళ్లి వచ్చేందుకు 2006లో మ్యాన్​ రైడింగ్​ సిస్టం ఏర్పాటు చేశారు. గనిలో ఇప్పటి వరకు 17 మంది మేనేజర్లు పని చేశారు. ఈ ఏడాది జనవరిలో గని ఏర్పడి 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు జరుపుకున్నారు.

రికార్డులు, అవార్డులు 

సింగరేణి పరిధిలోని 22 భూగర్భగనుల్లో 2019-–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్డీఎల్(మెషీన్)​ సెక్షన్  అత్యధిక బొగ్గు సాధించిన గనిగా రికార్డు సాధించింది. ప్రతి ఏడాది తన రికార్డును తానే తిరగరాస్తూ ఇతర గనులకు ఆదర్శంగా నిలిచింది. గనిలో సగటున ఒక్కో ఎస్డీఎల్​ మెషీన్​ రోజుకు 110 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు సార్లు ఎస్డీఎల్​ సెక్షన్​లో బెస్ట్​ పర్ఫార్మెన్స్​​అవార్డు దక్కించుకుంది.

  • 2019లో 52వ యానువల్​ సేఫ్టీ వారోత్సవాల్లో గ్రూప్–1 అండర్​ గ్రౌండ్​ మైన్​ విభాగంలో మొదటి స్థానం సాధించింది
  • 2021లో 53వ యానువల్​ సేఫ్టీ వారోత్సవాల్లో గ్రూప్–​-3 అంశంలో మొదటి స్థానం
  • 2022లో 54వ యానువల్​ సేఫ్టీ వారోత్సవాల్లో గ్రూప్–​-2 అంశంలో రెండో స్థానం 
  • 2023–-24 ఆర్థిక సంవత్సరం బెస్ట్​ ఎస్డీఎల్​ టెక్నాలజీ ఇన్​ ఎక్స్​ట్రా లోహైట్​ ట్రోఫీ
  • 2023–-24లో జాతీయ స్థాయిలో పలు అంశాలతో కూడిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన బొగ్గు గనులకు ఇచ్చే ఫైవ్​ స్టార్​ రేటింగ్​సాధించింది.
  • 2024–-25లో ప్రమాదరహిత గనిగా సింగరేణిలో గుర్తింపు