- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు రేషన్ షాపులకు సప్లై
- కోడ్ ఉండడంతో పంపిణీ నిలిపివేత
- పోర్టబులిటీ వల్లే ఇస్తలేమంటున్న డీఎస్వో
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రేషన్ లబ్ధిదారులకు బట్ట సంచుల్లో బియ్యం ఇవ్వాలని సర్కారు నిర్ణయించి పంపిణీ చేసినా అవి ఇంకా డీలర్ల దగ్గరే మగ్గుతున్నాయి. ఆరు నెలలు దాటుతున్నా అవి ఇంకా షాపుల్లోని అటకలపైనే ఉన్నాయి. అయితే, దీనికి అధికారులు చెప్తున్న కారణం విచిత్రంగా ఉంది. సన్న బియ్యాన్ని పర్యావరణ హిత బట్ట సంచుల్లో పంపిణీ చేయాలని భావించిన కాంగ్రెస్సర్కారు గతేడాది అక్టోబర్‌లో రేషన్‌షాపులకు సంచులను సప్లై చేసింది. కొంత మందికి ఈ సంచుల్లో సరుకుల పంపిణీ కూడా చేశారు. అయితే, జూబ్లీహిల్స్ఉప ఎన్నికలు రావడంతో ఆపివేయాల్సి వచ్చింది.
అయితే, నవంబర్‌లో జూబ్లీహిల్స్ఎన్నికలు పూర్తయినా ఇప్పటివరకు ఆ సంచుల్లో బియ్యం పంపిణీ చేయడం లేదు. ఇప్పుడవన్నీ నగరంలోని 652 రేషన్‌షాపుల్లో సజ్జలపై మూలుగుతున్నాయి. కొన్ని షాపుల్లో వాటిని ఎలుకలు పాడు చేస్తుండగా, మరికొన్ని చోట్ల బూజుపట్టి చినిగిపోయే స్థితికి చేరుకున్నాయి. అధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడం వల్లే పంపిణీ ఇవ్వడం లేదని రేషన్‌డీలర్లు చెప్తుండగా, పోర్టబులిటీతో లబ్ధిదారులు వేరే వేరే షాపులకు వెళ్తుండడంతో ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు.
ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించేందుకే..
నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న ప్లాస్టిక్బ్యాగుల వినియోగాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని, అందుకే బట్ట సంచులను పంపిణీ చేస్తున్నట్టు గతంలో రేవంత్సర్కారు ప్రకటించింది. ఒకసారి ఒక లబ్ధిదారుకు ఒక సంచి పంపిణీ చేశామంటే దాన్నే కూరగాయలకు, ఇతర సరుకుల కొనుగోలుకు మల్టీ పర్పస్‌గా వినియోగించేలా రూపొందించామని చెప్పింది.
అలాగే, సంచులపై సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా డిజైన్ చేశారు. నగరంలో కాంగ్రెస్ప్రభుత్వం రాక ముందు ఉన్న 6.50 లక్షల కార్డులతో పాటు కొత్తగా జారీ చేసిన మరో 2లక్షల కార్డులకు కలిపి మొత్తం 8.50 లక్షల కార్డుదారులకు ఈ సంచులను రేషన్‌బియ్యంతో పాటు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ, కొందరికి మాత్రమే వీటి పంపిణీ జరగ్గా, ప్రస్తుతం రేషన్‌షాపుల్లోనే మూలుగుతున్నాయి.
రేషన్ పోర్టబులిటే కారణమట..
జంటనగరాల్లో రేషన్‌షాపుల్లో మల్టీ పర్పస్ బ్యాగుల పంపిణీ నిలిచిపోలేదని, రేషన్ పోర్ట బులిటీ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని డీఎస్వో శ్రీనివాస్చెప్తున్నారు. ప్రభుత్వ రూల్స్ప్రకారం ఏ రేషన్‌షాపులో కార్డులున్న వారు ఆ రేషన్ షాపుల్లోనే సంచులను తీసుకోవాలని, కానీ, 80 శాతం పోర్టబులిటీలో సరుకులు తీసుకుంటున్నారు కాబట్టి రేషన్‌షాపుల్లో సంచులు మిగిలిపోయాయంటున్నారు. మరి షాపుల్లో వృథాగా పడి ఉండి ఖరాబవుతున్నాయని, సంచులను వచ్చిన వారికి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు.
