అక్రమ అరెస్ట్ లకు భయపడం

అక్రమ అరెస్ట్ లకు భయపడం

భద్రాద్రిజిల్లా : భద్రాచలంలో ముంపునకు గురైన ప్రాంతాలను, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తుండగా తమను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటి వరకు అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించలేదని, కనీసం బాధితులకు సహాయం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు నష్టాన్ని కూడా అంచనా వేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల పెట్టి నిర్మించిన ప్రాజెక్టులు భారీ వర్షాలు, వరదలతో నీటి మునిగిపోయాయని అన్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకుని తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఇల్లందు గెస్టహౌస్ లో వదిలి వెళ్లారని అన్నారు. గెస్ట్ హౌస్ కు తాళాలు లేక.. 2గంటల పాటు బయటే నిలబెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మొదలుపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తామన్నారు. ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భట్టి విక్రమార్క ఈ కామెంట్స్ చేశారు. 

గోదావరి వరద ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల సందర్శన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడెం వీరయ్య బృందం రెండవ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి ములుగు, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో మునిగిపోయిన గోదావరి ఘాట్లను పరిశీలించనున్నారు. మంచిర్యాల, చెన్నూరు, మంథని నియోజకవర్గాల్లో గోదావరి బ్యాక్ వాటర్ తో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. గోదావరి వరదతో మునిగిపోయిన కాళేశ్వరం, పాడైపోయిన ప్రాజెక్టు బాహుబలి మోటార్లు, కడెం, కొమురం భీం ప్రాజెక్టు లను సందర్శించనున్నారు.