
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పదేండ్ల పాలనలో బీఆర్ఎస్లోకి జరిగిన ఫిరాయింపులపై సీఎల్పీ లిస్టును విడుదల చేసింది. 2014 నుంచి పదేండ్లలో టీడీపీ, కాంగ్రెస్, వైసీసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరెవరిని చేర్చుకున్నారనే వివరాలు అందులో వివరించింది. ‘‘2014 అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న సీట్లు 63. కానీ, ప్రభుత్వం రద్దయ్యే నాటికి ఈ సంఖ్య 90 దాటింది. ఇంత సంఖ్య ఉండటం ఫిరాయింపుల ఫలితమే. 2018 లో కూడా ఫిరాయింపులను బీఆర్ఎస్ కొనసాగించింది. అప్పుడు 88సీట్లతో మంచి మెజారిటీ వచ్చినా కేసీఆర్ కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది” అని తెలిపింది.
2014 లో కాంగ్రెస్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో ఏడుగురిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీరిలో కాలే యాదయ్య ( చేవెళ్ల ), రెడ్యా నాయక్ ( మహబూబాబాద్ ), పువ్వాడ అజయ్ ( ఖమ్మం ), చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( మక్తల్ ), నల్లమోతు భాస్కర్ రావు ( మిర్యాలగూడ ), విఠల్ రెడ్డి( ముథోల్ ), 7. కోరం కనకయ్య( ఇల్లెందు ) ఉన్నారు.
2014 లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ( పాలకుర్తి ), ప్రకాష్ గౌడ్ ( రాజేంద్రనగర్ ), అరికెపూడి గాంధీ ( శేరిలింగంపల్లి ), మాధవరం కృష్ణారావు ( కూకట్ పల్లి ), మాగంటి గోపినాథ్ ( జూబ్లీహిల్స్ ), కేపీ వివేకానంద ( కుత్బుల్లాపూర్ ), రాజేందర్ రెడ్డి ( నారాయణపూర్ ), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం ), తీగల కృష్ణారెడ్డి ( మహేశ్వరం ), చల్లా ధర్మారెడ్డి ( పరకాల ), తలసాని శ్రీనివాస్ యాదవ్ ( సనత్ నగర్ ), సాయన్న ( కంటోన్మెంట్ ) ఉన్నారు.
2014 లో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు మదన్ లాల్ ( వైరా), పాయం వెంకటేశ్వర్లు ( పినపాక ), తాటి వెంకటేశ్వర్లు ( అశ్వారావుపేట)తోపాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
2014 లో బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వారిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇందులో బీఎస్పీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. మరో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ( సిర్పూర్ కాగజ్ నగర్ ) ఉన్నారు. సీపీఐ నుంచి గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ ను కూడా బీఆర్ఎస్ చేర్చుకుంది. ఎంపీల విషయానికి వస్తే.. కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డిని, టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన చామకూర మల్లారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకొని మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసిన బీఆర్ఎస్. వీరిలో కె.ఆర్ అమోస్, జగదీశ్ రెడ్డి, భాను ప్రసాద్, రాజలింగం, భూపాల్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, యాదవరెడ్డి, వెంకట్రావు, రాజేశ్వర్ రావు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, సలీంతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ చేర్చుకుంది.
2018లో బీఆర్ఎస్కు 88 సీట్లతో మంచి మెజారిటీ వచ్చినా కేసీఆర్ ఫిరాయింపులు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే 12 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారిలో ఆత్రం సక్కు ( ఆసిఫాబాద్ ), సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూరు ), బీరం హర్షవర్ధన్ రెడ్డి ( కొల్లాపూర్), చిరుమర్తి లింగయ్య ( నకిరేకల్), గండ్ర వెంకటరమణారెడ్డి ( భూపాలపల్లి ), రేగా కాంతారావు ( పినపాక ), హరిప్రియ ( ఇల్లెందు), కందాల ఉపేందర్ రెడ్డి ( పాలేరు ), వనమా వెంకటేశ్వర్ రావు ( కొత్తగూడెం), జాజల సురేందర్ ( ఎల్లారెడ్డి) ఉన్నారు.
2018 లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే వారిద్దరినీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీరిలో సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు ( అశ్వారావుపేట ) ఉన్నారు.