మూడు రాజధానులపై అసెంబ్లీలో జగన్ వివరణ

మూడు రాజధానులపై అసెంబ్లీలో  జగన్  వివరణ

మూడు రాజధానుల రద్దు బిల్లుపై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ వివరణ ఇచ్చారు. దాదాపు రెండేళ్లుగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటి  నుంచి కొంతమంది రకరకాలుగా వక్రీకరణలు చేస్తూ, అపోహలు క్రియేట్ చేస్తూ వస్తున్నారని, న్యాయ పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. అందరూ సహకరించి ఉంటే ఈ పాటికే మంచి ఫలితాలు వచ్చేవి కానీ.. అలా జరగకపోవడం వల్ల ఈ రోజు వికేంద్రీకరణ బిల్లు రద్దుపై నిర్ణయం తీసుకుంటూ తాను ప్రకటన చేయాల్సి వస్తోంది.

’1953 నుంచి 56 దాకా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత రాజధాని, హైకోర్టు.. రెండూ హైదరాబాద్ కు తరలించారు. ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని శ్రీబాగ్ ఒడంబడిక, రాయలసీమ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనేదానిపై ప్రకటనలు చేశారు. మళ్లీ రాష్ట్ర విడిపోయాక అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కేంద్ర కమిటీ నివేదికకు వ్యతిరేకంగా తీసుకున్నది. వివాదాస్పద నిర్ణయమని అందరికీ తెలిసిందే.  ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఈ ప్రాంతంపై నాకు ప్రేమ కూడా. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఇది గుంటూరు కాదు, విజయవాడ కాదు. ఈ రెంటిలో ఏ పట్నానికి పోవాలన్నా 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కనీసం లక్ష కోట్లు కావాలని చంద్రబాబు ప్రభుత్వం తేల్చింది. అది ఈ రోజు లెక్కల ప్రకారమే. అదే నిర్మాణాలు పూర్తవ్వాలంటే ఇంకా 10, 20 ఏండ్ల సమయం పడితే ఆ ఖర్చు ఆరేడు లక్షల కోట్లకు పోతుందన్నారు.

అంటే రోడ్లు, డ్రైనేజీ లాంటివి నిర్మాణం చేయడానికే ఇంత ఖర్చు చేయాల్సివస్తే ఎలా సాధ్యమని ఆలోచించాలని జగన్ అన్నారు.‘ వీటికే మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో ఉంటే రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమేనా? ఈ రకంగా ప్రజలను తప్పుదారి పట్టించడం సరైనదేనా? ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు చేసుకునేలా ఒక మంచి పెద్ద సిటీ ఎప్పటికి సాకారమవుతుంది? ఎన్నేళ్లు గడిచినా మన పిల్లలు బెంగళూరుకో, చైన్నైకో, హైదరాబాద్ కో పోవాల్సిందేనా? ఈ రకమైన వాస్తవిక పరిస్థితుల్లో నుంచే విశాఖపట్నం మన రాష్ట్రంలోనే పెద్ద సిటీ అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఇప్పటికే అన్ని రకాల మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఇక మరికొంత అభివృద్ధికీ, సుందరీకరణకు కాస్త బూస్టప్ ఇస్తే సరిపోతుందన్న భావనతో విశాఖను పాలనా రాజధానిగా, ఇక అమరావతి ప్రాంత ప్రజల మనోభావాలు, ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ శాసన రాజధానిగానూ, ఇక కర్నూలులో గతంలో రాష్ట్ర రాజధానిగా ఉన్నందున ఆ ప్రాంతంలో న్యాయ రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేసి, అందరికీ మంచి చేయాలని భావించాం’ అని అన్నారు.