ఎలక్షన్లు వస్తున్నయ్​..పిచ్చోళ్ల మాటలకు ఆగం కావొద్దు: కేసీఆర్​

 ఎలక్షన్లు వస్తున్నయ్​..పిచ్చోళ్ల మాటలకు ఆగం కావొద్దు: కేసీఆర్​

మహబూబ్​నగర్/నాగర్​కర్నూల్​, వెలుగు : పాలమూరు ముఖచిత్రం మారిపోయిందని, ఒకప్పుడు ఇక్కడి కూలీలు పనులు లేక వలసపోయేవాళ్లని, ఇప్పుడు పాలమూరుకే ఇతర ప్రాంతాల కూలీలు వలస వస్తున్నారని సీఎం కేసీఆర్​ అన్నారు. చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని, తాను పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించిన విషయం ఒక చరిత్ర అని చెప్పారు. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లోని నార్లాపూర్​లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంపును శనివారం సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. అనంతరం సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 

Also Raed:  సీడబ్ల్యూసీ సమావేశాలకు పోచంపల్లి ఇక్కత్ ​చీరలో సోనియాగాంధీ

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 20 లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండాలని, వాటికి నీళ్లు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు పనులు మూడేండ్లలో పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇదే జిల్లాకు చెందిన కొందరు గత్తర బిత్తిరి రాజకీయ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. ‘‘ఇంటి దొంగలే ఈ స్కీంకు ప్రాణగండమైన్రు. ఈ జిల్లా లీడర్లు దద్దమ్మలు, సన్నాసులు. ఆనాడు సీఎంలను చూస్తేనే వీళ్లకు లాగులు తడిసేవి. నీళ్లు కిందకున్నాయి.. మనం గడ్డ మీద ఉన్నం.. నీళ్లు ఏట్లొస్తయ్ అనెటోళ్లు. ఆనాడు ఇట్ల మాట్లాడినోళ్లు ఇంకా బతికే ఉన్నరు. ఇక్కడి దద్దమ్మ రాజకీయ లీడర్లు తెలంగాణకు శత్రువులు’’ అని ఆయన  ఫైర్ అయ్యారు.

మూడు ప్రాజెక్టులతో వజ్రపు తునక

‘‘తెలంగాణ ఉద్యమ టైంలో పాలమూరులో పర్యటించినప్పుడు స్వరాష్ట్రం వస్తేనే సకల దరిద్రాలు పోతాయని నమ్మిన. తెలంగాణ వచ్చాక మన ముఖలు కొంచెం తెల్లబడ్డయ్​. తెలంగాణ వచ్చాక మూడు ప్రాజెక్టులు కట్టాలని లెక్కలు వేసుకున్న. అందులో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు స్కీంలు ఉన్నయ్​. ఈ మూడు స్కీములతో తెలంగాణ వజ్రపు తునకగా మారుతుందని, ఇక్కడి రైతులు తలెత్తుకొని జీవిస్తారని చకచక పనులు చేయించినం” అని కేసీఆర్​ తెలిపారు. కొందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాళేశ్వరాన్ని పూర్తి చేశామని ఆయన అన్నారు. సీతారామ పనులు స్పీడుగా జరుగుతున్నాయని తెలిపారు. 

ఊదితే ఎగిరిపోతరు

‘‘బీజేపీ జెండా పట్టుకొని కొందరు నా బస్సుకు అడ్డం వస్తున్నరు. నేనేం మోసం చేసిన. ఈ జిల్లా బీజేపీ బిడ్డలకు సిగ్గు, షరం ఉందా?  పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను ప్రధాని మోదీ ఎందుకు తేలుస్తలే? మీకు సిగ్గు ఉంటే పోయి ఢిల్లీలో కృష్ణ ట్రిబ్యునల్​కు లెటర్ రాయాలని మీ ప్రధానికి చెప్పండి” అని సీఎం కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘నా వెంట లక్ష మంది ఉన్నరు. వాళ్లందరూ ఊదితే మీరంతా ఎగిరిపోతరు. మాకు సంస్కారం ఉంది. మేం అట్ల చేయం’’ అని అన్నారు. ‘‘కరెంటు మీద విజయం సాధించినం. మనకు కరెంటు కొరత రానేరాదు. మిషన్ భగీరథకు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుంటున్నం. గోండు, కోయ గూడాలకు ఫిల్టర్ నీళ్లు ఇస్తున్నం. 

చావు నోట్ల తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించుకున్నం. తలమాసినోడు.. నెత్తిమాసినోడు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. ఎలక్షన్లు రాంగనే ఈ స్కీంలన్నీ తామే చేసినమని ముందుకొస్తరు” అని విమర్శించారు. ‘‘తెలంగాణను ఉద్దరిస్తా, పాలమూరును దత్తత తీసుకుంటానన్నా చంద్రబాబునాయుడు మనంకేమన్న సాయం చేసిండా? మనం ఏడ్చిననాడు.. వలసపోయిన నాడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా బాగు పడుతున్నం. ఎలక్షన్లు వస్తున్నయ్​.. ఆగం కావొద్దు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు.. పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే ఆగమైతం. వైంకుఠ ఆటలో పెద్ద పామూ మింగినట్లయితది” అని కేసీఆర్​ అన్నారు.