పేదలకు 26 వేల ఇండ్లు ఇచ్చినం.. మేడ్చల్ ​సభలో సీఎం కేసీఆర్​

పేదలకు 26 వేల ఇండ్లు ఇచ్చినం.. మేడ్చల్ ​సభలో సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: రూపాయి ఖర్చు లేకుండా రూ.50 లక్షల విలువ చేసే 26 వేల ఇండ్లను పేదలకు ఉచితంగా ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కుతుందని సీఎం కేసీఆర్ ​అన్నారు. హైదరాబాద్​లోని పేదలకు మరో లక్ష ఇండ్లను కట్టిస్తామని తెలిపారు. బుధవారం మేడ్చల్​లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ మాట్లాడారు. పదేండ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, ఇది  ఇట్లాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్​ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాలు అంటే మినీ ఇండియా అని.. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ పెడుతామని హామీ ఇచ్చారు. 

మనల్ని రాచిరంపాన పెట్టారు.. 

20 ఏండ్ల క్రితం తాను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అందరూ నవ్వులాటగా తీసుకున్నారని, అవహేళన చేశారని కేసీఆర్ ​గుర్తుచేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 50 ఏండ్లు మనల్ని రాచిరంపాన పెట్టిందెవరో యాదిజేసుకోవాలని ప్రజలను కోరారు.  ‘‘మనం తిరుగుబాటు చేసిన్నాడు తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందెవరో ఆలోచన చెయ్యాలె. మళ్లీ కాంగ్రెసోళ్ల చేతుల్లో పడితే కరెంట్ బాధలతో రాష్ట్రంలో పరిశ్రమలు బంద్ అయితయ్’’ అని అన్నారు. భూదాన్ పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు చేనేత కార్మికులు సూసైడ్​ చేసుకుంటే తాను బాధపడి, ఆనాటి సీఎంను జోలెపట్టి అడిగినా ఒక్క రూపాయి సాయం చేయలేదన్నారు. దుర్మార్గమైన పాలనలో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురయ్యారన్నారు. ఈ సభలో ఉప్పల్ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్​లో చేరారు.