19న టీఆర్ఎస్ సభ.. షా మీటింగ్ కంటే 2 రోజులు ముందే!

19న టీఆర్ఎస్ సభ..  షా మీటింగ్ కంటే 2 రోజులు ముందే!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. తాజాగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌పై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తో సీఎం కేసీఆర్ చర్చించారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. 

గెలిచి తీరాలని పార్టీ నేతలకు ఆదేశం

గ్రౌండ్ లెవల్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపై సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో ఆరా తీశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు..? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి..? అనే వివరాలపైనా ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని, తప్పనిసరిగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని నాయకులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు కేబినెట్ భేటీకి ముందు మునుగోడు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ

మరోవైపు ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 19వ తేదీన సభ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసమే పార్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. 

అసమ్మతి నేతలతో జగదీష్ రెడ్డి చర్చలు

నిన్న రాత్రే ఉమ్మడి నల్గొండ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. అయితే.. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు టిక్కెట్టు ఇవ్వొద్దని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నేతలు డిమాండ్ చేశారు. దీంతో అసమ్మతి నేతలను హైదరాబాద్ కు పిలిపించి నిన్న దాదాపు 3గంటలపాటు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి చర్చించారు. ఆ తర్వాత వారిని ప్రగతిభవన్ కు తీసుకెళ్లారు. కానీ, సీఎం కేసీఆర్ తర్వాత కలుద్దామని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు.

మరోవైపు నిన్న రాత్రి మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌తో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఆ స‌మావేశం ముగిసిన అనంత‌రం జ‌గ‌దీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తులు లేరు అని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెల‌వబోతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో  హుజురాబాద్ తరహా ఫలితమే పునరావృతమైతే రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావం పడే చాన్స్ ఉందనే ఆందోళనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హడావుడి చేయకుండా సైలంట్ గా ప్రచారం చేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.