అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలె: కేసీఆర్

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలె: కేసీఆర్
  •     రెండున్నర నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలె
  •     అధికారులకు సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశం.. ప్రగతి భవన్​లో రివ్యూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌‌‌ అభివృద్ధిని డబుల్ చేయాలని, కండ్లకు కట్టాలని అధికారులను సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. రెండు నెలల్లో తాను నిజామాబాద్‌‌‌‌కు వచ్చి ఆ పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీ రాజ్‌‌‌‌, ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ బీ, మున్సిపల్‌‌‌‌ సహా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌‌‌‌ను ఆదేశించారు. నిజామాబాద్‌‌‌‌ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదివారం ప్రగతి భవన్‌‌‌‌లో రివ్యూ చేశారు.

నిజామాబాద్‌‌‌‌ అభివృద్ధికి నిధుల కొరత లేదని, అభివృద్ధి కోసం అవసరమైన మరిన్ని నిధులు వెంటనే విడుదల చేయాలని ఫైనాన్స్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌కు ఫోన్‌‌‌‌లో సీఎం ఆదేశించారు. ఖమ్మం నగరం గతంలో గందరగోళంగా ఉండేదని, ఆ నగరాన్ని తీర్చిదిద్దినట్లే నిజామాబాద్‌‌‌‌ను తీర్చిదిద్దుకోవాలన్నారు. నగరంలో మట్టి రోడ్లను బీటీగా మార్చాలన్నారు. శ్మశానవాటికలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని ఏర్పాటు చేయాలో అంచనా వేయాలన్నారు. ‘‘ఇంటిగ్రేటెడ్‌‌‌‌ మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లు, డంప్‌‌‌‌ యార్డ్‌‌‌‌లు, వెజ్‌‌‌‌, నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ మార్కెట్లు ఇలా అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలి. ధోబీ ఘాట్లు, సెలూన్‌‌‌‌ల లెక్కతేల్చి ప్రజల అవసరాలకు అనుగుణంగా మోడ్రన్‌‌‌‌ ధోబీ ఘాట్లు, సెలూన్లు నిర్మించాలి. పబ్లిక్‌‌‌‌ గార్డెన్లు, పార్కులను మెరుగ్గా తీర్చిదిద్దాలి. నా చిన్నప్పుడు నిజామాబాద్‌‌‌‌లోని తిలక్‌‌‌‌ గార్డెన్‌‌‌‌కు వెళ్లి కూర్చునే వాడిని.

ఆ గార్డెన్‌‌‌‌ను మళ్లీ తెరిచి, మొక్కలు నాటి పచ్చదనం పంచే కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే నగరంలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూముల్లో ప్రజల అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఎన్ని అనువుగా ఉన్నాయో గుర్తించి, వాటి వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేయాలి” అని సీఎం పేర్కొన్నారు. నగర సుందరీకరణ, అలంకరణకు అవసరమైన ప్రపోజల్స్‌‌‌‌ సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌‌‌‌, వేముల ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌‌‌‌, జీవన్‌‌‌‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.