జడ్చర్లను పరిశ్రమల కేంద్రంగా మార్చుతా : కేసీఆర్

జడ్చర్లను పరిశ్రమల కేంద్రంగా మార్చుతా : కేసీఆర్
  • ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి నిఖార్సైన లీడర్​

మహబూబ్​నగర్​/జడ్చర్ల, వెలుగు : 'హైదరాబాద్​కు దగ్గరగా జడ్చర్ల ఉంది. శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ఇక్కడికి 45 నిమిషాల్లో రావ్వొచ్చు. ఇప్పటికే పోలేపల్లి సెజ్​ ఉంది. జడ్చర్లను బ్రహ్మాండమైన పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్​గా తీర్చిదిద్దుతా' అని సీఎం కేసీఆర్​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'కు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. పాలమూరు నా గుండెల్లో ఉంటదని అన్నారు. మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వం వచ్చాక లక్ష్మారెడ్డి తన కెబినెట్​లో హెల్త్​ మినిస్టర్​గా పని చేశారని గుర్తు చేశారు.

ఆ సమయంలోనే పాలమూరులో డయగ్నాస్టిక్, డయాలసిస్​ సెంటర్లు మంజూరు చేయించుకున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రాంతాల్లో పర్యటనలు చేసినప్పుడు జయశంకర్​ సార్​ 'పాలమూరులో దరిద్రం పోవాలంటే ఇక్కడి నుంచి నువ్వు ఎంపీగా పోటీ చేయాలి'అని తనకు చెప్పారన్నారు. ఆయన చెప్పిన విధంగా 2009లో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశానని, లక్ష్మారెడ్డి తన గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకొని నన్ను గెలిపించాలన్నారు. పాలమూరు ఎంపీగానే తాను తెలంగాణను సాధించానని, ఈ కీర్తి చరిత్రలో ఉంటదన్నారు. తెలంగాణ రాక ముందు దుందుభీ నది దుమ్ముకొట్టుకుపోయుండేదన్నారు. రాష్ర్టం వచ్చాక ఇప్పుడు చెక్​ డ్యామ్​లతో కళకళలాడుతోందన్నారు. ఈ దృశ్యాలను చూసి   ఆనందం కలుగుతోందన్నారు. 'పాలమూరు' స్కీం పూర్తయితే ఈ జిల్లా రూపురేఖలు మారుతాయని సీఎం అన్నారు. 

జడ్చర్లకు వరాలు..

సభలో ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి జడ్చర్ల పట్టణం రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. పట్టణ జనాభా లక్ష వరకు ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు బైపాస్ రోడ్డును కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన సీఎం ఎన్నికలు ముగిసిన తక్షణమే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉదండాపూర్​​లో భూములు ఇచ్చిన వారికి త్వరలో నష్టపరిహారం అందజేస్తామన్నారు. లక్ష్మారెడ్డి పట్టుదల ఉన్న నాయకుడని, తాను రాజీనామా చేసిన నాడు గెలుపోటములకు భయపడని నిఖార్సైన లీడర్​ అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని  గెలిపించాలని, ఇంత మంది ప్రజలు వచ్చారంటే ఆయన గెలుపు ఖాయమనిపిస్తోందన్నారు.  

పని చేసే వారికి పట్టం కట్టండి

ప్రజలు పని చేసే వారికి పట్టం కట్టాలని జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్​ వల్లే జడ్చర్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. బంగారు తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. ఏ గ్రామంలో చూసినా బోనాలు, బోడ్రాయి, కోటమైసమ్మ పండగలతో ప్రతి ఇల్లుకళకళలాడుతోందన్నారు. ఒకప్పుడు కరువు వల్ల ప్రజలు పండగలు కూడా మరిచిపోయే పరిస్ధితి ఉండేదన్నారు. కేసీఆర్​ హయాంలో ప్రజలు ఆర్థికంగా ఎదిగి పండగ చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మళ్లీ సీఎంగా కేసీఆర్​ కావాలనే ప్రజలందరూ రెట్టింపు ఉత్సాహంతో సభకు వచ్చారన్నారు. వచ్చే ఐదేళ్లలో జడ్చర్ల నియోకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.