దేశమంతా రైతులకు ఉచిత కరెంట్​ ఇస్తం

దేశమంతా రైతులకు ఉచిత కరెంట్​ ఇస్తం
  • దేశమంతా రైతులకు ఉచిత కరెంట్​ ఇస్తం: సీఎం కేసీఆర్​
  • ఎమ్మెల్యేలను బీజేపోళ్లు పశువుల లెక్క కొంటున్నరు
  • ఓపికతోని ఉండే ప్రజాస్వామ్య శక్తుల రాజ్యం రావాలె
  • జాతీయ రాజకీయాల్లోకి రావాలని నన్ను 28 రాష్ట్రాల రైతులు కోరిన్రు
  • దేశం ఆశ్చర్యపడే పద్ధతిలో రాష్ట్రం ముందుకుపోతున్నదని వ్యాఖ్య
  • నిజామాబాద్​లో టీఆర్​ఎస్​ ఆఫీసు, కొత్త కలెక్టరేట్​ ప్రారంభం

మొన్నామధ్య 28 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చిన్రు. ‘కేసీఆర్​ గారు మీ రాష్ట్రంలో మీరు బాగానే తిప్పలు పడ్డరు. దయచేసి మీరు భారతదేశం గురించి కూడా పిడికిలి బిగించాలె.. మేమంతా మీ వెంట ఉంటం.. జాతీయ రాజకీయాల్లోకి రండి’ అని అన్నరు. త్వరలోనే మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభిద్దాం. జాతీయ రాజకీయాల్లోకి పోదామా..? ఏ విధంగా తెలంగాణను బాగుచేసినమో ఆ విధంగా ముందుకుపోదాం. –సీఎం కేసీఆర్​

నిజామాబాద్​, వెలుగు: కేంద్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్​ అన్నారు. 2024లో నాన్​ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశమంతా రైతులకు ఉచిత కరెంట్​ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని  బాగుచేసుకున్నామని, దేశం ఆశ్చర్యపడే రీతిలో రాష్ట్రం ముందుకుపోతున్నదని ఆయన తెలిపారు. ‘‘2024 లోక్​సభ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో ఎగిరేది బీజేపీ లేనటువంటి, నాన్​ బీజేపీ జెండానే. ఈ దిక్కుమాలిన బీజేపీని సాగనంపుదాం. ఢిల్లీ గద్దె మీద కూడా మన ప్రభుత్వమే రాబోతున్నది” అని అన్నారు. ఈ దేశం కోసం పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం​లో టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసును, కొత్త కలెక్టరేట్​ను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. అనంతరం స్థానిక గిరిరాజ్​ డిగ్రీ కాలేజ్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను జాతీయ రాజకీయాల్లోకి పొమ్మని ఆదేశం ఇచ్చినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న” అని సభకు వచ్చినవారిని ఉద్దేశించి సీఎం కేసీఆర్​ అన్నారు.  

‘‘దేశం బాగుపడాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలె. అహంకారంతోని ప్రతిపక్షాలను చీల్చిచెండాడి, ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగ కొనే ప్రభుత్వాలు కాదు. ఓపికతోని, సహించే గుణంతోని, ప్రజాస్వామ్య బద్ధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల రాజ్యం రావాలె” అని కేసీఆర్​ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, పేదల, రైతుల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.  ‘‘మదమెక్కిన విధానాలతో ఎవరిని పడితే వాళ్లను దించేస్తమంటున్నరు. నన్ను కూడా దించేస్తరట. ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలె. బీజేపీ ముక్త్​ భారత్​ జెండా ఎగురవేయాలె” అని చెప్పారు.  

విత్తనాలు, ఎరువులు సప్లయ్​ చేస్తున్నం
తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదని కేసీఆర్​ అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన జీఎస్​డీపీ,  తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వమే విత్తనాలు, ఎరువులు సప్లయ్​ చేస్తున్నదని, ఉచిత కరెంట్​, రైతుబంధు ఇస్తున్నదని, దీంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల జేబులో నాలుగు పైసలు కనపడుతున్నాయని ఆయన తెలిపారు. ఇది ఓర్వలేని కేంద్రం పెద్ద కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘‘ఇప్పటికే విమానాలను, ఓడరేవులను, రైళ్లను, ఖార్ఖానాలను, బ్యాంకులను అమ్మిన మోడీ సర్కారు.. ఇప్పుడు రైతుల భూమి మీద పడింది. ఎవుసాన్ని నాశనం చేసి  రైతుల దగ్గర ఉన్న భూములను లాక్కొని దోస్తులకు, కార్పొరేట్​ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ కుట్ర పన్నుతున్నరు” అని కేసీఆర్​ దుయ్యబట్టారు. ‘‘నిజామాబాద్​ గడ్డ నుంచి భారతదేశ ప్రజలకు ఒక తీయని మాట చెప్తున్న. 2024లో కేంద్రంలో నాన్​ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే  తెలంగాణ లాగే దేశమంతా రైతులకు ఉచిత కరెంట్​ ఇస్తం. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం కరెంట్​లో వ్యవసాయానికి వాడుకునేది  20శాతమే. ప్రతి రైతుకు ఫ్రీ కరెంట్​ ఇస్తే ఏటా రూ.1.45 లక్షల కోట్లు మాత్రమే అవుతుంది” అని అన్నారు. మోడీ ప్రభుత్వం ఎవరినీ ఉద్దరించలేదని, కొత్తగా ఒక్క ఇరిగేషన్​ ప్రాజెక్టుగానీ, ఒక్క ఫ్యాక్టరీగాని కట్టలేదని విమర్శించారు. అందుకే  ఇందూరు నుంచి దేశ రాజకీయాల్లో ప్రస్థానం చేస్తున్నట్లు కేసీఆర్​ చెప్పారు. ‘‘మన కాల్వల్లో నీళ్లు పారాలో.. మతపిచ్చోళ్ల వల్ల రక్తం పారాలో.. మన పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలో.. మత మంటల్లో మాడిపోవాలో జనమే తేల్చాలి.  ప్రతిపక్షాలను చీలుస్తూ, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడ్తూ అహంకార పూరిత పాలన కొనసాగిస్తున్న మోడీ సర్కారును సాగనంపాల్సిన టైం వచ్చింది. మనమంతా ఏకమై ఎవరైతే బాయి కాడ మీటర్లు పెట్టమంటున్నరో వాళ్లకే  మీటర్లు పెట్టాలి” అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి, టీఆర్​ ఎస్​ జిల్లా ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.