సెప్టెంబర్ 30న లక్ష మందితో సిరిసిల్లలో సీఎం సభ

సెప్టెంబర్ 30న లక్ష మందితో సిరిసిల్లలో సీఎం సభ
  • రూ.340 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
     
  • విప్​బల్మూరి వెంకట్, కలెక్టర్, ఎస్పీతో కలిసి ఏర్పాట్ల పరిశీలన

సిరిసిల్ల టౌన్, వెలుగు: ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ తెలిపారు. సిరిసిల్ల పట్టణం నడిబొడ్డు నుంచి రగుడు జంక్షన్ ​వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ విప్​బల్మూరి వెంకట్, కలెక్టర్​గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్​బి.గితే, కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర, ఐఏస్​డబ్ల్యూఎన్సీ ఎస్పీ మాధవరావుతో కలిసి సభా ప్రాంగణాన్ని, హెలీప్యాడ్​నిర్మాణ పనులను సోమవారం ఆది శ్రీనివాస్​పరిశీలించారు.

సభా వేదిక, పార్కింగ్, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్​నుంచి సభా ప్రాంగణం వరకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్​నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.

రూ.340 కోట్లతో అభివృద్ధి పనులు
సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆది శ్రీనివాస్​తెలిపారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రాన్ని అన్ని రంగాల్లో రూ.340 కోట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సీఎం సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.

సిరిసిల్లలో గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలను సీఎం ప్రస్తావిస్తారనే ఉద్దేశంతోనే కేటీఆర్​సీఎంకు లేఖ రాశారని ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో కేటీఆర్​సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్, పలు విభాగాల అధికారులతో రివ్యూ నిర్వహించారు. హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.