హరీశ్​రావు.. మరో ఔరంగజేబు.. పదేండ్లు దోచుకొని.. ఇప్పుడు మళ్లా సీఎం కుర్చీ కావాల్నట: సీఎం రేవంత్​

హరీశ్​రావు.. మరో ఔరంగజేబు.. పదేండ్లు దోచుకొని.. ఇప్పుడు మళ్లా సీఎం కుర్చీ కావాల్నట: సీఎం రేవంత్​
  • అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకుకేసీఆర్​ వేలాడినా జనం సానుభూతి చూపరు
  • అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పైంది.. కట్టె చేతికొచ్చింది
  • నల్గొండ సభకు పోయి మాత్రంనోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు
  • గురుకులాలన్నీ ఇక ఒకే క్యాంపస్​లోకి..ప్రతి సెగ్మెంట్​లో 20 ఎకరాల్లో ఏర్పాటు
  • త్వరలో గ్రూప్​ 1, మెగా డీఎస్సీ ఉంటుందని ప్రకటన
  • గురుకుల టీచర్లు, పీడీలు, లైబ్రేరియన్లకునియామక పత్రాలు అందజేత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే.. మామా అల్లుడు, తండ్రీ కొడుకు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్​, హరీశ్​రావు, కేటీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘నువ్వు సీఎంగా దిగిపో.. నేను సీఎం అయ్యి మేడిగడ్డకు రిపేర్​ చేసి చూపిస్త అని హరీశ్​ అంటున్నడు. ఆయనకు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే” అని అన్నారు.

ప్రజాధనంతో కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే చిన్న విషయంలా తీసిపారేస్తున్నారని, ఇప్పుడు పాలన చేతికిస్తే రిపేర్లు చేసి చూపిస్తామంటున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘పదేండ్లు అధికారం ఇస్తే, రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది దాచుకోవడమే పనిగా పెట్టుకున్నరు. పదేండ్లు మీ మామ సీఎంగా, నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసిన్రు.. పండ్లిగిలిచ్చుకుంట గాలికి తిరిగిన్రా? మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడలా కూలిపోతే అది చిన్నవిషయమా?” అని హరీశ్​రావును నిలదీశారు. 

గురుకుల విద్యాసంస్థలకు ఎంపికైన 2వేల మంది పీజీ టీలు, ఫిజికల్​ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు గురువారం హైదరాబాద్​ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్​రెడ్డి అపా యింట్​మెంట్​ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ‘‘హరీశ్​రావును చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నడు.  300 ఏండ్ల కింద ఔరంగజేబు ఉంటుండె.

ఆ ఔరంగజేబుకు రాజు కావాలని, రాజ్యమేలాలని కోరికుంటుండె. ఆ అవకాశం తండ్రి, అన్న ఇవ్వకపోతే.. తండ్రిని జైల్లో పెట్టిండు, అన్నను ఉరే సి చంపిండు. వెన్నుపోటుకు మారుపేరు ఔరంగజేబు అని చరిత్రలో ఉంది. అధికారం రావాలంటే హరీశ్​  కూడా మరో ఔరంగజేబు అవతారమెత్తాలి. పదేండ్లు బీఆర్​ఎస్​ అధికారంలో ఉంది. హరీశ్​ ఇరిగేషన్​ మంత్రి గా కూడా పనిచేసిండు..మరి, ఇన్నేండ్లు ఆయన ఏం చేసిండు.. పండ్లు ఇగిలించుకుంటూ గాలికి తిరిగిన్రా’’ అని ఫైర్​ అయ్యారు. 

మేడిగడ్డకు రమ్మంటే తప్పించుకున్నరు

కేసీఆర్​ అరిచి గీ పెట్టినా.. కాళ్లు చేతులు ఇరగ్గొట్టుకున్నా.. అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లు కట్టుకుని వేలా డినా ప్రజలు సానుభూతి చూపించరని సీఎం రేవంత్​ అన్నారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, దోచుకున్నది దాచుకున్నారని మండిపడ్డారు. ‘‘కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రావాలని పిలిస్తే.. కేసీఆర్​కు కాలు సక్కగలేదని, కట్టెపట్టుకుని నడుస్తున్నడని చెప్తున్నరు. ఆయనకు అసెంబ్లీకి రావాలంటే కాలు నొప్పొచ్చింది.. కట్టె చేతికొచ్చింది. కానీ, నల్గొండలో సభ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయి సానుభూతి పొందేందుకు వీల్​చైర్​ ఏసుకుని కూసొని నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు’’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును  లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా లక్ష ఎకరాలకూ నీళ్లివ్వలేదని విమర్శించారు.

‘‘మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా నల్గొండకు పోయి సభ పెట్టుకున్నడు. మేడిగడ్డ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోతే.. నిజాలు బయటకు రాకుండా పోలీసు పహారా పెట్టి ఎవరినీ అక్కడికి పోనియ్యలేదు. అందుకే గత పాలకుల పాపాలను ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతోనే మేడిగడ్డకు వెళ్దా మని, నిజాయితీ నిరూపించుకోండని బీఆర్​ఎస్​ వాళ్లకు చెప్తే తప్పించుకున్నరు” అని మండిపడ్డారు. సలహాలు అడిగితే ఇస్తానంటూ కేసీఆర్​ చెప్తున్నారని, అదేదో  అసెంబ్లీకి వచ్చి చెప్పమంటే తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి రావాలని సూచించారు. 

కొడుకు సీఎం కాలేదని కేసీఆర్​కు అక్కసు

నల్గొండ సభలో కేసీఆర్​ ఎంత అక్కసు వెళ్లగక్కారో అందరూ చూశారని, కొడుకు సీఎం కాలేదనే ఆయనకు అక్కసు అని సీఎం అన్నారు. ‘‘ఆయన బాధంతా ఒక్క టే. నల్లమల ప్రాంతానికి చెందిన ఓ పేదింటి రైతు బిడ్డ వచ్చి సీఎం చైర్​లో కూర్చుంటే ఓర్చుకోలేకపోతున్నడు.   కొడుకు సీఎం కుర్చీలో కూర్చుంటడని వాస్తు మార్చి సెక్రటేరియెట్​ కట్టిండు. కానీ, వాస్తు మార్చి కట్టిన సెక్రటే రియెట్​లో వేరే వాళ్లు కూర్చునేసరికి తెగ బాధపడ్తున్న డు. ఆయన నమ్మిన వాస్తు మనందరికీ అక్కరకొచ్చింది. దశ బాగుంటే దిశతో పనిలేదు. ప్రజలకు బీఆర్​ఎస్​ చేసిన ద్రోహం ఏందో కేసీఆర్​ ఇప్పటికైనా తెలుసుకోవాలి’’ అని హితవు పలికారు. ఉద్యోగ నియామకాల విషయంలో పదేండ్లు బీఆర్​ఎస్​ నిర్లక్ష్యం చేసిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నదని మండిపడ్డారు. కేసీఆర్​ కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తున్నాయని అన్నారు. ‘‘యువత ఉద్యోగాల కోసం కొట్లాడారు. వాటి కోసం అమరులయ్యారు. బీఆర్​ఎస్​ పార్టీ  పదేండ్లు అధికారంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ల హయాంలో ఎగ్జామ్​ పేపర్లు లీకయ్యాయి. జిరాక్స్​ సెంటర్లలో పల్లీబఠానీల్లాగా పేపర్లను అమ్ముకున్నరు. కొన్ని పరీక్షలు ఆగిపోయిన్​.

కానీ, మేము అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో పటిష్ఠంగా టీఎస్​పీఎస్సీని తీర్చిదిద్దుతున్నాం. నియామకాలను చేపడుతున్నం. త్వరలోనే గ్రూప్​1 పరీక్షను నిర్వహించబోతున్నం. మెగా డీఎస్సీ వేస్తం’’ అని సీఎం చెప్పారు. తాము ఇలా అధికారంలోకి వచ్చామో లేదో తమపై బీఆర్​ఎస్​ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘‘ఇవాళ మేం వచ్చినమో లేదో.. సర్దుకున్నమో లేదో.. ఎక్కడ కుండ ఉందో.. ఎక్కడ గిన్నె ఉందో.. ఎక్కడ పొయ్యి ఉందో చూసుకుని వంట వండుదామనే లోపునే మాపై విమర్శలు చేస్తున్నరు. మీరు వంట వండలేదు.. ఉపవాసం పండబెట్టి ఇప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నరు. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టినం. ఇది మీ కండ్లకు కనిపిస్తలేదా?” అని బీఆర్​ఎస్​ నేతలను సీఎం నిలదీశారు. 

గురుకులాలకు 20 ఎకరాల్లో క్యాంపస్​​

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు పెట్టినట్లు గత పాలకులు గొప్పలు చెప్పుకున్నరు. కానీ, వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలు కట్టి నిలబడా ల్సిన పరిస్థితి. అవస్థలు చెప్పుకోలేని పరిస్థితి. మన బిడ్డ లు.. చెల్లెళ్లకు ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకుంటమా? వారికి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అందుకే సకల సౌకర్యాలతో అన్ని గురుకులా లనూ ఒకే క్యాంపస్​లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నం.

కొడంగల్​లో పైలట్​ ప్రాజెక్టుగా చేపడుతున్నం. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తం. ఓ యూనివర్సిటీలాగా నిర్మించి వసతులు కల్పి స్తం. అన్నింటినీ ఒకే క్యాంపస్​లో పెట్టడం ద్వారా విద్యార్థులు అన్నాదమ్ముల్లాగా కలిసి ఉంటారు..  అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి క్యాంపస్​ల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్నా. విద్యకు ఖర్చు చేస్తే అది భవిష్యత్​ నిర్మాణానికి పెట్టుబడి అవుతుంది. దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది’’ అని సీఎం పేర్కొన్నారు.

కేసీఆర్​.. నీకు కొంచెమైనా బాధ అనిపించలేదా!

బీఆర్​ఎస్​ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లోని 6,453 సింగిల్​ టీచర్​ స్కూళ్లను మూసే శారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. రేషనలైజేషన్​ పేరిట స్కూళ్లను మూసి పేదలకు విద్యను దూరం చేశారని అన్నారు. ‘‘పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాల లను మూసేసింది. నాలుగైదేండ్ల పిల్లలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లకు పోతరా? నిరుపేదలు వారిని దూరంలోని స్కూళ్లకు పంపగలరా? కుట్రపూరితంగానే వాళ్లకు చదువును దూరం చేయాలని బీఆర్​ఎస్​ పాలకులు అనుకున్నరు. మూసేసిన ఆ స్కూళ్లను మేం తెరిపిస్తం. అందుకు త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతాం. పేదలకూ విద్య అందించేలా చర్యలు తీసుకుంటం. ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇయ్యకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పేద తల్లిదండ్రులను డబ్బులు అడగలేక విద్యార్థులు మనోవేదన అనుభవిస్తున్నరు. వనపర్తిలో ఓ అమ్మాయి ఫీజు చెల్లించలేక కాలేజీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన చూసి కొంచెమైనా కేసీఆర్​కు బాధ అనిపించలేదా.. మానవత్వం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. 

Also read :  కాళేశ్వరం లోపాల పుట్ట.. నివేదికలో కడిగిపారేసిన కాగ్ .. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్

గ్రీన్​ చానెల్​ ద్వారామెస్​చార్జీలు: పొన్నం

పీవీ నర్సింహారావు 1971లో సర్వేల్​లో గురుకు లాలను ప్రారంభించారని, ఆ స్ఫూర్తితో నవోద య విద్యాలయాలు ప్రారంభమయ్యాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. 2004 నుంచి 2014 వరకు మెస్​ చార్జీలకు గ్రీన్​చానెల్​ ద్వారా పేమెంట్​ జరిగే వని, కానీ, 2014 తర్వాత మెస్​చార్జీలు రాక నాణ్యత కొరవడిందని అన్నారు. జీతాలు రాక, బంగ్లా కిరాయిలు రాక ఇబ్బందులు పడే పరి స్థితి  బీఆర్​ఎస్​ పాలనలో నడిచిందని తెలిపా రు. కానీ, సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో మెస్ ​చార్జీలను గ్రీన్​చానెల్​ ద్వారా చెల్లించేం దుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేస్తున్నామని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. వచ్చి 70 రోజులే అవుతున్నా తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని, పదేండ్లు పాలించి నోళ్లు ఏమీ చేయకున్నా ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారని తెలిపారు. 2 వేల టీచర్లకు అపాయింట్​మెంట్​ ఆర్డర్లిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ అన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు.