మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ : సీఎం రేవంత్​రెడ్డి

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ : సీఎం రేవంత్​రెడ్డి
  • బ్యారేజీలు దెబ్బతినడానికి, లీక్​ అవడానికి కారణాలు బయటకు తీస్తం.. 
  • అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తం
  • మండలిలో సీఎం రేవంత్​రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడం, లీకేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగంపై  శనివారం శాసనమండలిలో ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనను తీసుకువెళ్తామని చెప్పారు. 

బ్యారేజీ ఎందుకు కుంగిపోయింది? ఎందుకు పనికి రాకుండా పోయింది? అనే  విషయాలన్నీ విచారణలో బయటకు వస్తాయని అన్నారు. ‘‘బ్యారేజీల కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర ఏమిటి? అనే విషయాలన్నీ  విచారణలో బయటకు వస్తాయి” అని సీఎం చెప్పారు. 

గత పదేండ్ల వైఫల్యాలను సరిదిద్దాలి: జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

గత పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలన వైఫల్యాలను సరిదిద్దాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు ప్రస్తుత సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అప్పగించారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మండలిలో శనివారం ఆయన గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే అంశంపై టీచర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు మధుసూధనాచారి, దేశపతి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, గోరటి వెంకన్న, బీజేపీ సభ్యుడు ఏవీఎన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. 

గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగాన్ని ఉద్దేశించి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని మండిపడ్డారు. కమీషన్ల  కోసమే కాళేశ్వరం, మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అవసరాలకు తగ్గట్టుగా కాకుండా అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని గత బీఆర్​ఎస్ సర్కార్​ తీరును ఎండగట్టారు. 

సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమన్నారు.  ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. 

నిర్మాణ లోపానికి కారకులైన దోషులను శిక్షించాలన్నారు. బిశ్వాల్‌‌‌‌‌‌‌‌ కమిటీ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయడానికి గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ప్రయోజనం కలుగుతున్నదని, అయితే ఆటో కార్మికులను ఏటా రూ.12వేలతో పాటు వారిని ఆదుకునేందుకు ప్రభుత్వమే కేర్‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌గా పీఎఫ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రసంగానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు పలుసందర్భాల్లో అడ్డుతగిలారు.

గత ప్రభుత్వంలో వివక్షను ఎదుర్కొన్న :  అలుగుబెల్లి నర్సిరెడ్డి

పదేండ్ల కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలనలో సామాన్యుడిని కలిసే పరిస్థితే ఉండేది కాదని టీచర్​ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ప్రయత్నించినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి గురయ్యానని చెప్పారు. 

కానీ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో కలిశానని, పది రోజుల్లో నాలుగు సార్లు కలిసే అవకాశం దక్కిందన్నారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి సీఎం అయ్యారని, వచ్చే ఐదేండ్ల కాలంలో ఇదే తరహాలో ప్రజాపాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు నిర్బంధం నుంచి  స్వేచ్ఛవాయువులు పీల్చుకున్నట్లు ఫీలవుతున్నారని చెప్పారు. 

నిందలకే ప్రాధాన్యంఇచ్చారు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు

గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ్యులు మధుసుధనాచారి, దేశపతి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రసంగంలో పలు అంశాల్లో గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే ప్రాధాన్యం ఇచ్చారని వారు విమర్శించారు. పర నింద, ఆత్మస్తుతి అన్నట్లుందని దుయ్యబట్టారు. రాష్ట్రం దివాలా తీసిందన్నట్లు పేర్కొనడం సరికాదని అన్నారు.

90 లక్షల టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు :  మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90లక్షల టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. ‘‘ఈ ధాన్యం ఉందా? లేదా? మిల్లర్లు అమ్ముకున్నరా.. ఉంటే ఎక్కడుంది? అనే గందరగోళం నెలకొంది. దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించాం. పదేండ్లలో ఈ శాఖ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రస్తుతం రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డుపై ఒక్కో వ్యక్తికి 6కిలోల బియ్యం ఇస్తుండగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 5 కిలోలని, మిగతా కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది” అని మండలిలో ఆయన తెలిపారు. రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామని చెప్పారు.