త్వరలో పెండింగ్​ డీఏలు

త్వరలో పెండింగ్​ డీఏలు
  • పీఆర్సీ, సీపీఎస్, 317 జీవో సమస్యలూ పరిష్కరిస్తం
  • ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్​రెడ్డి హామీ
  • ఎంప్లాయీస్​ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు.. స్వేచ్ఛే మా ఏడో గ్యారంటీ
  • కేసీఆర్ ఆత్మాహుతి చేసుకుంటానన్న కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తం
  • గత ప్రభుత్వంలో 10 ఏండ్లపాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కు లేదు
  • సమస్యలపై చర్చించేందుకు కేబినెట్​ సబ్​ కమిటీని వేశామని వెల్లడి
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన సీఎం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్, 317 జీవో సమస్యలు  అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వీటిపై సోమవారం కేబినెట్​ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి కొందరు ఉద్యోగులపై వివక్ష, మిగతా వారిపై సానుకూలంగా ఉండటం లాంటివి ఏమీ ఉండవని.. ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. తమ ఏడో గ్యారంటీ స్వేచ్ఛనేనని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అడ్డుకున్నా.. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. “కేసీఆర్ అడ్డం పడ్డా, ఆయన ఆత్మాహుతి చేసుకుంటానన్నా .. గవర్నర్ తో మాట్లాడి కోదండరాంను ఎమ్మెల్సీ చేసే బాధ్యత మా కేబినెట్ తీసుకుంటుంది” అని సీఎం రేవంత్  ప్రకటించారు. కోదండరాం కౌన్సిల్​లో ఉంటే కౌన్సిల్​కే గౌరవమని చెప్పారు. వివిధ శాఖల్లో ఉన్న 1,100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్​లోని ఎంసీఆర్​హెచ్ఆర్డీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 3 గంటలపాటు సీఎం రేవంత్​రెడ్డి సమావేశమయ్యారు. ఇందులో మంత్రి శ్రీధర్ బాబు, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఐఎన్టీయూసీ నేత మాజీ ఎంపీ సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు.​ 

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం చెప్పారు. గత ప్రభుత్వంలో 10 ఏండ్లపాటు ఉద్యోగుల సమస్యలను చెప్పుకునే అవకాశం రాలేదని, ఆవేదన వినేవారు లేక వాళ్లు ఇబ్బందులు పడ్డారని అన్నారు. తాము ఒక్కో చిక్కుముడిని తొలగిస్తూ ఉద్యోగాల భర్తీపై ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇన్నాళ్లూ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది కేసీఆర్ కుటుంబం వాళ్లేనని విమర్శించారు. నిర్బంధాలతో పాలన సాగించాలని గత ప్రభుత్వం చూసిందని మండిపడ్డారు. ‘‘సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలే. ఉద్యోగులకు  విశ్వాసం కల్పించడానికే చర్చలు జరిపినం. సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినం” అని తెలిపారు. ఫస్ట్​కు జీతాలు ఇచ్చినా తాము ప్రచారం చేసుకోలేదని అన్నారు. 

తెలంగాణ బాపు అని చెప్పుకోడానికి కనీసం పోలికైనా ఉండాలి

‘‘ఈ ప్రభుత్వం మూడు నెలలు ఉంటదని, ఆరు నెలలు ఉంటదని కొందరు మాట్లాడుతున్నరు. తమాషా అనుకుంటున్నరా? మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు.. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం.. పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం” అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలని ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా అని కేసీఆర్​ను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని తామే సాధించినట్లు ఏ ఒక్క రాజకీయ పార్టీ చెప్పుకున్నా అది అసంబద్ధం. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ...తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారు. తెలంగాణ బాపు అని తనకు తానే కేసీఆర్​ చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలి” అని సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందని విమర్శించారు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తామని, ఉద్యోగులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు ఇచ్చి సీఎం, మంత్రులతో మాట్లాడాలంటే ఆయన మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని సీఎం చెప్పారు. సమావేశంలో  టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ, బీసీటీఏ, టీఆర్​టీఎఫ్, పీఆర్టీయూటీ, ఎస్​జీటీయూ, హెచ్ ఎంల సంఘం, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్,  ఆర్టీసీ, సింగరేణి , నర్సింగ్, డిప్యూటీ కలెక్టర్లు , తహశీల్దార్స్ అసోసియేషన్  తదితర సంఘాల​ ప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యలను నేరుగా సీఎం వినడం గొప్ప విషయం: కోదండరాం

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వినడం గొప్ప విషయమని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అంతా భేటీలో పాల్గొన్నారని తెలిపారు. మీటింగ్ తర్వాత కోదండరాం మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతి పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి  స్వీకరించారని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలను శాఖల వారీగా త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారని అన్నారు. 

రెవెన్యూ వ్యవ‌‌స్థను బ‌‌లోపేతం చేయండి: తహశీల్దార్ అసోసియేషన్

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవ‌‌స్థను బలోపేతం చేయాల‌‌ని తెలంగాణ డిప్యూటీ క‌‌లెక్టర్స్ అసోసియేష‌‌న్ అధ్యక్ష కార్యద‌‌ర్శులు వి.ల‌‌చ్చిరెడ్డి, కె.రామ‌‌కృష్ణ, తెలంగాణ త‌‌హ‌‌శీల్దార్స్ అసోసియేష‌‌న్ అధ్యక్ష కార్యద‌‌ర్శులు ఎస్‌‌.రాములు, ర‌‌మేశ్​ పాక‌‌  కోరారు. వీళ్లంతా సీఎం రేవంత్‌‌రెడ్డిని క‌‌లిసి రెవెన్యూ వ్యవ‌‌స్థ బ‌‌లోపేతానికి చేప‌‌ట్టాల్సిన చ‌‌ర్యలు, పూర్వ వీఆర్వో, వీఆర్ఏల పెండింగ్ స‌‌మ‌‌స్యలు, తహ‌‌శీల్దార్ల అద్దె వాహ‌‌నాల‌‌కు బిల్లుల చెల్లింపు, క్యాడ‌‌ర్ స్ట్రెంత్​ పెంపు త‌‌దిత‌‌ర అంశాల‌‌ను వివరించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథ‌‌కాలు స‌‌క్రమంగా అమ‌‌లు కావాలంటే రెవెన్యూ విభాగాన్ని బ‌‌లోపేతం చేయాల‌‌ని కోరారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చ‌‌ర్యలు చేప‌‌ట్టాల‌‌న్నారు. రూర‌‌ల్‌‌, సెమీ రూర‌‌ల్‌‌, అర్బన్​.. మూడు స్థాయిలుగా విభ‌‌జిస్తే ప్రజ‌‌ల‌‌కు సేవ‌‌లు సుల‌‌భంగా, వేగంగా అందుతాయ‌‌ని చెప్పారు. 

ఆర్టీసీ విలీన ప్రక్రియ స్టార్ట్ చేయాలి: ఆర్టీసీ టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ వెంటనే స్టార్ట్ చేయాలని సీఎంను ఆర్టీసీ టీఎంయూ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి కోరారు. మీటింగ్ లో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ అపాయింటెడ్ డేను వెంటనే ప్రకటించాలన్నారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.

సీపీఎస్​ను రద్దు చేయాలి: ఉద్యోగ సంఘాలు

ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన సీపీఎస్​ను రద్దు చేయాలని సీఎంను టీఎన్జీవో నేతలు జగదీశ్వర్, కస్తూరి వెంకటేశ్వర్లు కోరారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకు రావాలని, పీఆర్సీ లేటవుతున్నందున ఐఆర్ ఇవ్వాలన్నారు. కొత్త జిల్లాల్లో కేడర్ స్ర్టెంత్ శాంక్షన్ చేయాలని కోరారు. 

పెండింగ్ డీఏలతో పాటు ఉద్యోగుల మెడికల్ బిల్లులు విడుదల చేయాలని టీజీవో నేతలు ఏలూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ కోరారు. 
    
2023 జులై 1 నుంచి వర్తించేలా పీఆర్సీ ఇవ్వాలన్నారు. కమిషన్​ను అపాయింట్ చేసి 5 నెలలు అయిందని వెంటనే నివేదిక తెప్పించుకొని పీఆర్సీ ప్రకటించాలని సీఎంను కోరారు. ఈహెచ్ఎస్​పై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. 
    
2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి, టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని టీటీజేఏసీ చైర్మన్  శ్రీపాల్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​ను పునరుద్ధరించాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కేజీబీవీ టీచర్లకు మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
    
ఢిల్లీ, కేరళ మాదిరిగా తెలంగాణలోనూ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, సర్కారు స్కూల్ పిల్లలకు షూస్, టై, బెల్ట్ ఇవ్వాలని, స్కూళ్లలో కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి, వాటిని ప్రభుత్వమే భరించాలని జాక్టో చైర్మన్ సదానందంగౌడ్ కోరారు. ఇంగ్లిష్ మీడియం స్కూల్ టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ నిర్వహించాలన్నారు. 
    
ఉద్యోగ, ఉపాధ్యాయులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి గత ప్రభుత్వం.. నెల జీతం కోసం ఎదురుచూసేలా చేసిందని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. జీవో 317తో చెట్టుకొకరిని పుట్టకొకరిని వేశారని, దీంతోనే గత సర్కారుకు ఉద్యోగులందరం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎంప్లాయీస్ కు రావాల్సిన 4 డీఏలు ఇవ్వాలని ఆయన కోరారు. 
    
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లకు తగ్గట్టుగా డీఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేయాలని యూఎస్​పీసీ స్టీరింగ్ కమిటీ నేత అశోక్ కుమార్ అన్నారు. బడుల్లో స్కావెంజర్లను నియమించాలని కోరారు. 
    
రాష్ట్రంలో ఎస్​ఎస్​ఏ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కేజీబీవీ ఎంప్లాయీస్​కు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని కేజీబీవీ ఉద్యోగుల సంఘం నేత శ్రీలత కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించినట్లు చెప్పుకున్నా అది అసంబద్దం. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ.. తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారు. తెలంగాణ బాపు అని తనకు తానే కేసీఆర్​ చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలి.  -సీఎం రేవంత్​రెడ్డి