ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే : రేవంత్​రెడ్డి

ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే : రేవంత్​రెడ్డి
  • ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే పాతరేస్తరు
  • కేసీఆర్​కు సీఎం రేవంత్ ​రెడ్డి హెచ్చరిక
  • లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం.. మూడేండ్లకే ఎట్ల కూలే?
  • కేసీఆర్​ ఫామ్​హౌస్​ల కట్టుకున్న ఇల్లు అట్ల ఎందుకు కూలలే?
  • బండారం బయటపడ్తదన్న భయంతోనే మేడిగడ్డకు రిపేర్లు చెయ్యాలంటున్నడు
  • ధర్నాచౌక్​ ఎత్తేసినోళ్లే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నరు
  • వచ్చే ఎన్నికల్లో  మోదీని కూడా ప్రజలు బండకేసి కొడ్తరు
  • ఎన్డీయే అతుకులబొంతగా మారిందని విమర్శ
  • హైదరాబాద్​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్​ చీడ, పీడ విరుగడ కోసమే ప్రజలు కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేసి గెలిపించారని, తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే ప్రజలే పాతిపెడ్తారని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. దోచుకున్న సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనాలని ఎవరు చూసినా వాళ్లకు జనం చేతిలో సామాజిక బహిష్కరణ తప్పదని వార్నింగ్​ ఇచ్చారు. ‘‘రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కడుపు కాలుతున్నదా? కండ్లు మండుతున్నయా? వాడొకడు వీడొకడు మోపై ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుందంటున్నరు. 

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడెవడైనా ఉన్నడా?’’ అంటూ బీఆర్​ఎస్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే ఫామ్​హౌస్​ గోడలే కాదు..​ ఇటుక పెల్లలు కూడా మిగలవు.. మా కార్యకర్తలే గొయ్యితీసి పాతిపెడ్తరు” అని చెప్పారు. తాము అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని, ప్రజల మద్దతుతో, కార్యకర్తల పోరాటంతో వచ్చామని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్​లోని బైరామల్​గూడ, నల్లచె రువు, కండ్లకోయ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మేడ్చల్​లో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో మాట్లాడారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కరించి, అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో గత పదేండ్లలో రాష్ట్రాభివృద్ధి ఆగిపోయిందని, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. 

కవిత..! మీ నాన్నను అసెంబ్లీకి పంపు, లెక్కలు చెప్తం

ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తలేరంటూ ​ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారని, తాము భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాల్లో 43శాతం ఆడబిడ్డలకే ఇచ్చామని రేవంత్​రెడ్డి తెలిపారు. లెక్కలు, పేర్లతో సహా చెప్తా మన్నా  రు. ‘‘చేతనైతే మీ అయ్యను అసెంబ్లీకి పంపించు.. లెక్క లు చెప్తం’’ అని కవితకు సవాల్​ చేశారు. అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్​కు ధైర్యం లేదని, పదేండ్ల పాటు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టి నిరుద్యోగుల ఉసురు తీశారని మండిపడ్డారు. 

ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ఎంతో మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. ‘‘ధర్నాచౌక్ వద్దన్న వాళ్లు ఇవాళ అక్కడ ధర్నా చేస్తున్నరు. ప్రజా ప్రభుత్వం, ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది కాబట్టే వాళ్లకు ధర్నా చేసుకునే అవకాశం దక్కింది. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోతే అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నరు’’ అని కవితను ఉద్దేశించి విమర్శించారు.  

పదేండ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను కూడా గత బీఆర్​ఎస్​ సర్కార్​ పరిష్కరించలేకపోయిందని మండిపడ్డారు. ‘‘బీఆర్​ఎస్​ హయాంలో కోకాపేట, హైటెక్​సిటీ ప్రాంతాలే అభివృద్ధి చెందినయ్​. కానీ మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి.. భూముల విలువలు పెరగాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంట’’ అని జనాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్​ అన్నారు. 

బండారం బయటపడ్తదనే రిపేర్లు అంటున్నరు

లక్ష కోట్లు పెట్టి కేసీఆర్​ కాళేశ్వరం కడితే.. మూడేండ్లకే కూలిపోవుడేందని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్​ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్​​ వంటి బ్యారేజీలు ఇన్నేండ్లయినా చెక్కుచెదరలేవని చెప్పారు. కేవలం ప్రజల సొమ్మును దోచుకోవడానికే కేసీఆర్​ కాళేశ్వరం పేరెత్తుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘లక్ష కోట్లు పెట్టి కడితే.. మూడేండ్లకే ఎట్ల కూలిపోయింది? నువ్వు ఫామ్​హౌస్​లో ఇల్లు కట్టుకున్నవ్​ కదా.. అదెందుకు కూలిపోలే? ప్రజల సొమ్ము కాబట్టి.. దోచుకొని దాచుకోవాలనే ఇష్టమున్నట్టు కాళేశ్వరం బ్యారేజీలు కట్టిన్రు” అని మండిపడ్డారు. 

మేడిగడ్డ పిల్లర్లను మళ్లీ కట్టుండ్రని కేసీఆర్​ తొందరపడుతున్నారని, బండారం బయట పడుతదనేనా అని ప్ర శ్నించారు. ‘‘కేసీఆర్​.. ఎందుకు తొందర? మీరు కట్టిన మేడిగడ్డ కాస్త మేడిపండైందనేనా?! మళ్ల వానొస్తే మొత్తం కుప్పకూల్తదనేనా? మీరు కట్టింది కుంగింది.. అన్నారం పగిలింది కాబట్టి.. అర్జెంట్​గా పూతపుయ్యాలంటున్నవా? అట్ల పూతపూస్తే కాం గ్రెస్​ ప్రభుత్వం మీద నెపం నెట్టాలనుకుంటున్నవా? రిపే ర్​ చేయడానికి అది పనికిరావాలే కదా! అది అక్కరకు వస్తదో రాదో.. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు చెప్తరు... ఎందుకంత తొందర కేసీఆర్​?” అని నిలదీశారు. 

ఈటల..! ఏ ముఖంతో ఓట్లడుగుతవ్​?

ఎన్నడూ మల్కాజ్​గిరి ప్రాంతానికి రాని ఈటల రాజేంద ర్​ లోక్​సభ ఎన్నికల్లో  ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈటలను హుజూరాబాద్ లో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడికి వచ్చి ఎట్ల గెలుస్తడు? పదేండ్లు కేసీఆర్​తోనూ, రెండేండ్లుగా మోదీని మోస్తున్న ఈటల సిగ్గులేకుండా మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నడు’’ అని దుయ్యబట్టారు. మేడ్చల్ కు మెట్రో  రావాలన్నా.. ఐటీ పరిశ్రమలు రావాలన్నా.. మల్కాజ్​గిరి ఎంపీ సీటును కాంగ్రెస్ గెలవాలని ఆయన అన్నారు.  

పాతబస్తీ మెట్రోరైలును అడ్డుకుంటే నగర బహిష్కరణ

మెట్రో రైలును హైదరాబాద్​ నలువైపులా విస్తరిస్తామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. పాతబస్తీలో ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఓ పెద్దమనిషి కేంద్రంతో కలిసి ప్రయత్నిస్తున్నారని, పాతబస్తీ అభివృద్ధికి తాము పునాది వేస్తుంటే ఆయన కాలు అడ్డం వేస్తున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో మెట్రోను అడ్డుకునే వాళ్లను నగర బహిష్కరణ తప్పదని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్​నగరాన్ని ఒక గొడుగుకిందికి తీసుకు వచ్చి నగరం నలుమూలలా అభివృద్ధి చేస్తామని అన్నారు. 

రాష్ట్రాభివృద్ధితోపాటు హైదరాబాద్​పై ప్రత్యేక దృష్టిపెడతామని  చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, సీవేజ్​ ట్రిట్​మెంట్​ ప్లాంట్ల(ఎస్టీపీలు) ప్రారంభోత్సవం అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లోనూ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించి ఔటర్​రింగ్​రోడ్​వరకు అర్బన్​ తెలంగాణ, ఔటర్​ నుంచి రీజినల్​ రింగ్​వరకు రీజినల్​ తెలంగాణ, ఆతర్వాత రూరల్​ తెలంగాణ పేరుతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

తెలంగాణ నలు వైపుల అభివృద్ధి చేసి వైబ్రెంట్​ తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ లో రాబోయే 25 ఏండ్ల అభివృద్దికి మెగా మాస్టర్​ప్లాన్​–2050 లక్ష్యంతో పని చేస్తామని చెప్పారు. మూసీనదిని అంతర్జాతీయ స్థాయిలో థేమ్స్​నది మాదిరిగా ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని అన్నారు. నాగోల్​ నుంచి ఓల్డ్​సిటీ.. మియాపూర్​ నుంచి బీహెచ్​ఈఎల్​.. గచ్చిబౌలి నుంచి యూఎస్​ కాన్సులేట్.. ఎల్బీనగర్​ నుంచి హయాత్​నగర్​ వరకు మెట్రోను విస్తారిస్తామని ఆయన ప్రకటించారు.

ఎన్​డీఏ అతుకుల బొంతగా మారింది

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ చెప్పుకుంటున్నారని, రాష్ట్రాల్లో పార్టీలతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. ‘‘ఎన్​డీఏను అతుకుల బొంతగా ఎందుకు మారుస్తుండు? మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది. మోదీని కూడా బండకేసి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు’’ అని అన్నారు. ఈసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ 14 సీట్లు గెలవాలని అన్నారు. ‘‘కాంగ్రెస్​ కార్యకర్తలు ఎవరికీ భయపడవద్దు. మనతో పెట్టుకుంటే చింతపండే’’ అని ఆయన తెలిపారు. పదేండ్ల మోదీ, కేసీఆర్​ పాలనలో ప్రజలపై ధరల భారం మోపారని, రూ. 500 ఉండే సిలిండర్ల ధర రూ. 1,200  చేర్చిన ఘనత వారిదేనని ఫైర్​ అయ్యారు.