
- ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు
- సీఎంగా ప్రమాణం అనంతరం రేవంత్‌రెడ్డి
- రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ఎల్బీ స్టేడియంలో భారీ జనసందోహం మధ్య కార్యక్రమం
- మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించిన గవర్నర్
- హాజరైన సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్, ప్రియాంక
- అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్, వెలుగు : తాము పాలకులం కాదని, ప్రజలందరికీ సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సేవ చేయడానికి తమకిచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ జనసందోహం నడుమ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘‘సీఎంగా ఈ వేదిక మీది నుంచి ప్రజలకు మాటిస్తున్న. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను బద్దలు కొట్టినం.
అది ఇక నుంచి జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్. రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా అక్కడికి వచ్చి తమ ఆలోచనలు, అభిప్రాయాలు, ఆకాంక్షలను పంచుకోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మీ రేవంతన్నగా ఇచ్చిన మాట నిలుపుకుంట. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావుఫూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తం’’ అని చెప్పారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ఇకపై ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తారని సీఎం రేవంత్ అన్నారు.
డిప్యూటీ సీఎంగా భట్టి..
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ప్రజా ప్రభుత్వం’ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా 11 మందితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలతోపాటు సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ తదితరులు పాల్గొన్నారు.
గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించారు. ఇందులో డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
సీఎం రేవంత్ సహా పది మంది మంత్రులు తెలుగులోనే ప్రమాణం చేయగా.. దామోదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ‘దైవసాక్షిగా’ బదులు ‘పవిత్ర ఆత్మ సాక్షి’గా ప్రమాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా వాళ్లంతా ‘దైవసాక్షిగా’ అని ప్రమాణం చేశారు.
హోరెత్తిన స్టేడియం
రేవంత్ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు స్టేడియమంతా హోరెత్తిపోయింది. ఆయన ప్రమాణం చేసేటప్పుడు కార్యకర్తలు, నేతలు నినాదాలు చేశారు. కేరింతలు కొట్టారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దంపతులు సోనియా గాంధీ కాళ్లు మొక్కి ఆశీస్సులను తీసుకున్నారు. సీతక్క ప్రమాణం చేసే సందర్భంలో జనం కేరింతలు, నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు.
వారిని చూసి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. ఓ నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు. ప్రమాణం చేయాలని గవర్నర్ చెప్పడంతో తేరుకుని ప్రమాణం చేశారు. అనంతరం సోనియా కాళ్లను సీతక్క మొక్కబోగా వద్దని వారించి ఆలింగనం చేసుకున్నారు. కొండా సురేఖ కూడా ప్రమాణం అనంతరం సోనియా గాంధీని ఆలింగనం చేసుకున్నారు. ఎల్బీ స్టేడియానికి భారీగా జనం తరలివచ్చారు.
30 వేల మందికి ఏర్పాట్లు చేయగా.. దాదాపు 50 వేల మంది దాకా హాజరయ్యారు. ఇటు స్టేడియం లోపలికి వెళ్లే ఆస్కారం లేకపోవడంతో బయట కూడా దాదాపు 30 వేల మంది దాకా ఉండిపోయారు. కొందరు స్టేడియం రూఫ్‌పైకి ఎక్కి ప్రమాణ స్వీకారాన్ని చూశారు. మరికొందరు పక్కన బిల్డింగులపై నుంచి కార్యక్రమాన్ని తిలకించారు.
ట్రాఫిక్ వల్ల ప్రమాణం లేట్
అనుకున్న టైం కన్నా ప్రమాణ స్వీకారం లేట్‌గా జరిగింది. మధ్యాహ్నం 1.04 గంటలకే సీఎంగా రేవంత్ ప్రమాణం చేయాల్సి ఉన్నా.. ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైంది. జనం ఊహించిన దానికన్న ఎక్కువగా రావడంతో ఎల్బీ స్టేడియం పరిసరాలన్నీ రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఒకానొక సందర్భంలో సోనియా, రాహుల్, రేవంత్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది.
దీంతో వారు ఎల్బీ స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నారు. ఇటు గవర్నర్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఆమె స్టేడియానికి పావుగంట ఆలస్యంగా చేరుకున్నారు. గవర్నర్‌ను రేవంత్, భట్టి విక్రమార్క తదితరులు స్టేజీ మీదికి సాదరంగా స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం, ప్రమాణం ఆలస్యం కావడంతో.. ఎల్బీ స్టేడియంలో సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి
ఓపెన్ టాప్ జీప్‌లో వెళ్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేశారు.
ఆహ్వానం పంపినా రాలే..!
కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఆహ్వానం పంపినా అటు వైపు నుంచి ఎవరూ హాజరు కాలేదు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇన్విటేషన్ వెళ్లింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్లి మరీ ఆహ్వానం అందించినా వారు హాజరు కాలేదు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఆహ్వానం అందినా రాలేదు. ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలెవరూ హాజరు కాలేదు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వంటి వాళ్లకూ ఆహ్వానం పంపినా వారు హాజరుకాలేదు.
సోనియాకు రేవంత్ ఘన స్వాగతం
ప్రమాణ స్వీకారానికి ముందు బుధవారం ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏఐసీసీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఆయన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఒకే కారులో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి బయల్దేరారు. వారి వెనుకే ఎమ్మెల్యేలు కూడా బస్సుల్లో స్టేడియానికి చేరుకున్నారు. మరోవైపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు హోటల్ తాజ్‌కృష్ణలో భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఖర్గేతో కలిసి ఒకే కారులో స్టేడియానికి చేరుకున్నారు.
వేదికపై ప్రముఖులు
ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై సీఎం రేవంత్, మంత్రులు సహా 64 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు. తొలి వరుసలో గవర్నర్ తమిళిసై.. పక్కన సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. వారితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య,
ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డి, కూతురు నైమిష, అల్లుడు సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానా రెడ్డి, టి. సుబ్బరామిరెడ్డితో పాటు ప్రమాణం చేసే మంత్రులు ఆసీనులయ్యారు. ఇక, రెండో వరుస నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు.
11 మంది మంత్రులు వీరే
భట్టి విక్రమార్క (డిప్యూటీ సీఎం), ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.