ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల స్కీం ప్రారంభం

ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల స్కీం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భద్రాచలంలో ప్రారంభించనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అందించనున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దశలవారీగా రాష్ట్రంలో ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకే లబ్ధి జరిగేలా ముందుకు వెళ్తున్నారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. 

 సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లు తయారీ చేశారు. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి డిజైన్ లు ఉన్నాయి. అలాగే లోక్​సభ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మరిన్ని గ్యారంటీలను పట్టాలు ఎక్కించాలని రాష్ట్ర సర్కార్ చూస్తున్నది. వీటిలో ప్రధానంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు రూ.2,500 సాయం, రైతులకు రుణమాఫీ ఉన్నాయి. ఈ రెండు గ్యారంటీలను అమలు చేయడమే మెయిన్ టాస్క్​గా ప్రభుత్వం భావిస్తున్నది. 

రేపు కేబినెట్ భేటీ.. 

మహాలక్ష్మి కింద ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి 92.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు మహిళలు కూడా అప్లై చేసుకున్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఇంకా గైడ్ లైన్స్ తయారు చేయలేదు. దీనిపై మంగళవారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అదేవిధంగా రుణమాఫీపై కూడా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఏకంగా రూ.25 వేల కోట్ల పైగా ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కత్తిమీద సాములా మారింది. దీనికి నిధుల సమీకరణ ఎలా అనేదానిపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు అని ప్రకటించడం, ఇప్పటికే మూడు నెలలు అంటే 90 రోజులు గడవడంతో అన్ని గ్యారంటీల అమలుపై ప్రకటనలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.