ఔను.. నేను మేస్త్రీనే.. బీఆర్​ఎస్​కు గోరీ కట్టే మేస్త్రీని : సీఎం రేవంత్​రెడ్డి

ఔను.. నేను మేస్త్రీనే.. బీఆర్​ఎస్​కు గోరీ కట్టే మేస్త్రీని :  సీఎం రేవంత్​రెడ్డి
  • కేసీఆర్​ కాస్కో.. సీఎం రేవంత్​రెడ్డి సవాల్​
  • ఫిబ్రవరి చివరి కల్లా రైతు భరోసా పెట్టుబడి సాయం అందజేస్తం
  • బిల్లా, రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నరు
  • చార్లెస్​ శోభరాజ్​ చద్దర్​ కప్పుకొని పండుకున్నడు
  • పులి లెక్క బయటకొస్తడట.. రమ్మను బోనులో వేసి బొందపెడ్తం
  • ఇది జస్ట్​ ఇంటర్వెల్​.. ఇంద్రవెల్లి నుంచి అసలు ఆట షురూ
  • కేసీఆర్​ మారుబేరగాడు.. ఒక్క సీటు గెలిచినా ఢిల్లీలో అమ్ముకుంటడు
  • విధ్వంసం పాలైన తెలంగాణను పునర్నిర్మిస్తామని ప్రకటన
  • ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్​ బూత్​ లెవెల్​ కన్వీనర్లకు శిక్షణ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ నేతలు ఏది పడితే అది ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని, బీఆర్​ఎస్ పార్టీ పీక పిస్కి, బొందపెడ్తామని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘నన్ను మాటిమాటికి మేస్త్రీ అంటూ విమర్శిస్తున్నరు. ఔను బిడ్డా.. నేను మేస్త్రీనే. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని. మీరు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన్రు కదా.. అందుకే 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. బిడ్డా.. కాస్కో..! మీ పార్టీని వంద మీటర్ల గోతిలో పాతి పెట్టి, మీకు గోరీ కట్టే మేస్త్రిని కూడా నేనే. త్వరలో ఇంద్రవెల్లి నుంచి వస్తున్న..  కాస్కోండి’’ అని సవాల్​ చేశారు. 

గురువారం హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్​ పార్టీ బూత్​ లెవెల్​ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్​ మున్షి, సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో బూత్​ లెవెల్​ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా యాభై రోజులైనా కాలేదని, అప్పుడే బిల్లా, రంగాలు తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్​, హరీశ్​రావుపై మండిపడ్డారు. ‘‘దేశంలో ప్రధాని మోదీతో యుద్ధం చేస్తుంటే.. సందట్లో సడేమియాలలెక్క బిల్లా రంగాలు వీధుల్లో తిరుగుతూ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నరు. వాళ్లు మాట్లాడుతుంటే చార్లెస్​ శోభరాజ్​ దుప్పటి కప్పుకుని పండుకున్నడు. పులి బయటకు వస్తుందని అంటున్నరు. రమ్మనండి.. మేం కూడా బోను పట్టుకుని రెడీగా ఉన్నం. పులిని బోనులో వేసి.. బొందపెడ్తం. బోను సిద్ధం.. రమ్మను మీ పులిని. ఏడున్నదో” అని ఆయన హెచ్చరించారు.  

అది జస్ట్​ ఇంటర్వెల్​

మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు జస్ట్​ ఇంటర్వెల్​ మాత్రమేనని, అసలైన సినిమా మొదలవుతుందని సీఎం రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​ నేతలకు హెచ్చరించారు. ఇంటర్వెల్​ తర్వాతి చాప్టర్​ను ఇంద్రవెల్లి నుంచే ప్రారంభిస్తానని, దమ్ముంటే కాస్కోండి అని సవాల్​ విసిరారు. ‘‘కేటీఆర్​,హరీశ్​రావు ఏది పడితే అది మాట్లాడుతున్నరు. ఇక నేను మాట్లాడకపోతే పని నడిచేటట్లు లేదు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​కు సవాల్​ విసురుతున్న. కేసీఆర్​.. ఇక కాస్కో. అసలు ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉన్న నీ పార్టీ పీక పిస్కే బాధ్యత, నీ పార్టీని బొంద పెట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటున్నది” అని హెచ్చరించారు.  బీఆర్​ఎస్​కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనని అన్నారు.  లోక్​సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని రేవంత్​ ప్రకటించారు. ‘‘ఒక రోజు పాలన చేస్తూ.. మరో రోజు పీసీసీ చీఫ్​గా పార్లమెంట్​ స్థానాల్లో తిరిగి పార్టీ నేతలు, జనాలతో మమేకం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. ఆయన ఆదేశాలను శిరసావహిస్తాను. ఇకపై అన్ని ఎంపీ స్థానాల్లో సభలు పెడతాను. వారంలో మూడు రోజులు మీ రేవంతన్నగా పార్టీ నేతలకు కేటాయిస్తాను. ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. అందులో బూత్​ లెవెల్​ కమిటీ సభ్యులూ ఉంటారు’’ అని రేవంత్​ తెలిపారు. 

కాంగ్రెస్​ పార్టీ దయతోనే తాను సీఎం అయ్యానని, ఓ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత పదవిని పొందానని చెప్పారు. కష్టపడినోళ్లకు కాంగ్రెస్​ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు.  ‘‘విద్యార్థి నేతగా పోరాడిన బల్మూరి వెంకట్​ను ఎమ్మెల్సీగా చేశాం. ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ కటిక పేదరికం అనుభవించి పార్టీ కోసం పనిచేసిన వెడ్మ బొజ్జును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాం. జేబులో రూ. 50 వేలు కూడా లేని మందుల సామేలు 52 వేల మెజారిటీతో గెలిచేలా అవకాశం ఇచ్చాం. ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్​ స్థాయికి ఎదిగారు. చదువుకుంటూనే రాజకీయాల్లో ఆయన తిరిగారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, ఒకసారి రాజ్యసభకు ఆయన వెళ్లారు.  ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పార్టీలో కష్టపడి పనిచేసి కిందిస్థాయి నుంచి వచ్చిన నేతలకు పార్టీ ఎప్పుడూ మంచి అవకాశాలను ఇస్తుంది” అని రేవంత్​ చెప్పారు. బీఆర్​ఎస్​ ఎవరికి పదవులను ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.  ‘‘దోచుకున్నోళ్లకు కేసీఆర్​ పదవులిచ్చారు. కేసీఆర్​ ఎవరిని రాజ్యసభకు పంపించావ్​? కరోనా సమయంలో ఎమర్జెన్సీ మందులపై దోచుకున్న పార్థసారథి రెడ్డిని, గ్రానైట్​ వ్యాపారి అయిన వద్దిరాజు రవిచంద్ర వంటి వాళ్లను రాజ్యసభకు పంపించారు’’ అని మండిపడ్డారు. 

త్యాగం అంటే గాంధీ కుటుంబానిదే

దేశంలో త్యాగం అంటే గాంధీ కుటుంబానిదేనని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘దేశ సమగ్రతను కాపాడేందుకు గాంధీ కుటుంబం ప్రాణాలను సైతం అర్పించింది. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్​ పార్టీది కీలకపాత్ర. అఖండ భారత్​ అని అంటున్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ.. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర ఏంటో చెప్పాలి. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు మోదీజీ? ఉండడానికి సొంత ఇల్లు లేని గాంధీ కుటుంబానికి అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. ఈడీ, సీబీఐ కేసులతో వేధిస్తున్నరు. గాంధీ కుటుంబాన్ని అవమానించిన బీజేపీని ఓడించాలి. తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీని పార్లమెంట్​ ఎన్నికల్లో గెలిపించాలి. ఇక్కడ గెలిపించి గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాం. ఇప్పుడు ఇక్కడా 14 సీట్లు గెలిపించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాహుల్​ గాంధీని ప్రధానిని చేయాలి’’ అని చెప్పారు. రాహుల్​ గాంధీ జోడో యాత్రతో కర్నాటక, హిమాచల్​ ప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ వరకు యాత్ర చేసి రాహుల్​ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఇప్పుడు న్యాయ్​ యాత్రలో భాగంగా మణిపూర్​ నుంచి యాత్ర చేపట్టారని, కానీ, యాత్రకు అస్సాంలో ఆ రాష్ట్ర సీఎం అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారని రేవంత్​
మండిపడ్డారు. 

కేసీఆర్​.. మారుబేరగాడు

మోదీ, కేసీఆర్​ ఇద్దరూ ఒక్కటేనని, నాణేనికి చెరో వైపు అని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ‘‘కేసీఆర్​ ఇక్కడ ఒకట్రెండు సీట్లు కూడా గెల్వడు. ఆ సీట్లను కూడా మోదీకి తాకట్టు పెట్టేస్తడు. కేసీఆర్​ మారుబేరగాడు.. ఇక్కడ ఒక రూపంలో జమచేస్తడు.. ఢిల్లీకి పోయి వేరే రూపంలో అమ్ముకుంటడు” అని అన్నారు. ‘‘మన పోరాటం గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదు. ఢిల్లీలో ఉన్న మోదీతోనే మన యుద్ధం. జనాలు బీఆర్​ఎస్​ను ఊరికే ఓడగొట్టలేదు. జనాలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టే పొలిమేరల దాకా తరిమారు. ఇక వారిని పార్లమెంట్​ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమేదాకా మనం పోరాటం చేయాలి” అని కాంగ్రెస్​ కార్యకర్తలకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. 

వచ్చే నెల మొదటివారంలో మరో రెండు స్కీములు

ఫిబ్రవరి మొదటివారంలో ఇంకో రెండు పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘నిరుడు మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు (బీఆర్​ఎస్​ హయాంలో) రైతులకు పెట్టుబడి సాయం వేయలేదు. మేం వచ్చి యాభై రోజులన్నా కాకముందే ఆ పార్టీ నేతలు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తం” అని చెప్పారు. ‘‘ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీతో పదిన్నర కోట్ల జీరో టికెట్లను ఇష్యూ చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. 3,650 రోజులు పాలించిన బీఆర్​ఎస్​ నేతలు.. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఆ దద్దమ్మలా మమ్మల్ని ప్రశ్నించేది? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అయినా సరే మేం స్కీము​లను ఆపలేదు” అని ఆయన అన్నారు.