దుబారా ఖర్చులు, ఆడంబరాల జోలికి పోం : రేవంత్ రెడ్డి

దుబారా ఖర్చులు, ఆడంబరాల జోలికి పోం : రేవంత్ రెడ్డి
  • దుబారా ఖర్చులు, ఆడంబరాల జోలికి పోం
  • ఎంసీఆర్​హెచ్​ఆర్డీ సెంటర్​లో తక్కువ ఖర్చుతో షెడ్డు టైప్​లో సీఎం క్యాంప్​ ఆఫీస్​ 
  • ప్రజాభవన్  బిల్డింగ్​లను అవసరాలకు తగ్గట్టు వాడుకుంటం: సీఎం రేవంత్​
  • సీఎంగా కొత్త కాన్వాయ్​ని కూడా తీసుకోవాలనుకుంటలే
  • ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్​ రిలీజ్​ చేస్తం
  • ఓల్డ్​ సిటీ నుంచే ఎయిర్​పోర్ట్​కు మెట్రో..
  • దీంతో దూరం, ఖర్చూ తక్కువే మీడియాతో చిట్​చాట్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దుబారా ఖర్చులు తగ్గించాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి టైంలో ఆడంబరాలకు పోదల్చుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైమ్​ వచ్చినప్పుడు వైట్​ పేపర్​  రిలీజ్​ చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో సీఎం రేవంత్​ చిట్‌చాట్ చేశారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసీహెచ్​ఆర్డీ) సెంటర్​ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఒక ఎకర స్థలంలో తక్కువ ఖర్చుతో చిన్న ఆఫీస్​ ఏర్పాటు చేసుకుని ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైనా వస్తే అక్కడే భేటీ అయ్యేలా ప్లాన్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ సమావేశం, ఎలాంటి రివ్యూలు లేని టైమ్​లో తాను ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉంటానని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఎంసీహెచ్​ఆర్డీ సెంటర్​లో ఉన్నవాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వేరే మార్గంలో ఎంట్రీ, ఔట్​ గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని, అందుకే ఒక షెడ్డు టైప్​లో  కట్టించుకుని దాన్నే క్యాంప్ ఆఫీస్‌‌‌‌గా వాడుకుంటానని అన్నారు. అదే సమయంలో ప్రజాభవన్ లో ఉన్న సీఎం ఆఫీసు కార్యాలయాన్ని  కూడా అవసరాలకు తగ్గట్టు ఉపయోగించుకుంటామని తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని, అసెంబ్లీ భవనాలను కూడా సమర్థంగా వాడుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సీఎంగా తాను కొత్త కాన్వాయ్​ కూడా తీసుకోవాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. 

దూరం, ఖర్చు తగ్గుతుందనే ఓల్డ్​ సిటీ టు ఎయిర్​పోర్టు మెట్రో

ఓల్డ్​ సిటీ నుంచే శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు మెట్రో ఏర్పాటు చేస్తే  దూరం తగ్గడంతో పాటు నిర్మాణానికి ఖర్చు భారీగా తగ్గుతుందని, అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్​ సిటీ నుంచే మెట్రో రూట్​ ఉంటుందని సీఎం రేవంత్​ వెల్లడించారు. రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా లేదని, సగటున 12- నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నదని, మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండడం లేదని సీఎం రేవంత్​ అన్నారు. విద్యుత్‌‌పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు వచ్చాయని, వాటి పరిశీలనలో ఇది స్పష్టమైందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు జరగాలనేది బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) నిర్ణయిస్తుందన్నారు. 
 
అన్నీ అనుకూలంగా ఉండటంతోనే ఆ సెంటర్​ 

ప్రస్తుతం సీఎం రేవంత్‌‌రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసరాల్లో ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచే ఆయన సెక్రటరియెట్​, ప్రజా భవన్​తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లివస్తున్నారు. ఆ ఇంటికి... ఎంసీహెచ్​ర్డీ సెంటర్​కు చాలా తక్కువ దూరం ఉంది. దీంతో ఆ సెంటర్​లో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే హెలీప్యాడ్​ కూడా ఉన్నది. ఈ సెంటర్​ ప్రాంగణంలో ఉంటే  అందరికీ అందుబాటులో ఉన్నట్లు ఉంటుందని, పైగా సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఉన్న ఏరియా అవుతుందని సీఎంవో వర్గాలు అంటున్నాయి. 

జర్నలిస్టుల ఇండ్లపై త్వరలో నిర్ణయం

జర్నలిస్టులకు గృహ వసతి అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్నదని, గత ప్రభుత్వంలో పరిష్కారం దొరక్కుండా ఎక్కడి గొంగడి అక్కడ అన్న తరహాలోనే ఉన్నదని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ సూచనప్రాయంగా తెలిపారు. పలు జర్నలిస్టు సంఘాల నుంచి రిక్వెస్టులు వచ్చాయని, వాటిపై కొద్దిమంది సీనియర్లతో చర్చించి అందరికీ తగిన న్యాయం లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా లేదు. సగటున 12- నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది. మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండడం లేదు. విద్యుత్‌పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాం.  

ఓల్డ్​ సిటీ నుంచే శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు మెట్రో ఏర్పాటు చేస్తే  దూరం తగ్గడంతో పాటు నిర్మాణానికి ఖర్చు భారీగా తగ్గుతుంది. అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్​ సిటీ నుంచే మెట్రో రూట్​ ఉంటుంది.

- సీఎం రేవంత్ రెడ్డి