ఏపీలో జియో జోరు... - ఒకేసారి వంద టవర్లు ఓపెనింగ్

ఏపీలో జియో జోరు... - ఒకేసారి వంద టవర్లు ఓపెనింగ్

భారతదేశం 5జీ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ఇంకా దేశంలో సరైన నెట్‌వర్క్ లేని ప్రాంతాలు ఎన్నో వున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. గురువారం ( జూన్ 15)  తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ జియో టవర్ల ద్వారా ఏపీలోని 209 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85, మన్యం జిల్లాలో 10 , అన్నమయ్య జిల్లాలో 3, కడప జిల్లాలో 2 టవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ టవర్ల ద్వారా 4జీ సేవలు అందిస్తుండగా.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్ చేయాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

సెల్ టవర్స్ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,704 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దీని కింద 2,363 చోట్ల స్థలాలను జియోకు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. 

 భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా.. అవి సిటీలు, పట్టణాలకే పరిమితం అయ్యాయి.. అయితే, మారుమూల ప్రాంతాలు 2జీకే పరిమితం అయ్యాయి.. కొన్ని ప్రాంతాల్లో ఆ సేవలు కూడా లేవు.. ఇప్పుడు రిలయన్స్‌ జియో సహకారంతో మారుమూల ప్రాంతాల్లో సైతం 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వంద జియో టవర్లను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వైఎస్ జగన్.. రిలయన్స్ జియో ప్రతినిధులను అభినందించారు.