సీఎంఆర్ వడ్లు బుక్కిన్రు

సీఎంఆర్ వడ్లు బుక్కిన్రు
  • సీఎంఆర్ వడ్లు బుక్కిన్రు
  • రైస్ మిల్లులను లీజుకు తీసుకొని రూ.20 కోట్లు కాజేసిన అక్రమార్కులు
  • వడ్లను పక్కదారి పట్టించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు
  • రికవరీపై దృష్టి పెట్టని ఆఫీసర్లు
  • డీటీలు రిపోర్టు ఇవ్వకపోవడంపై అనుమానాలు

గద్వాల, వెలుగు: రైస్ మిల్లులను లీజుకి తీసుకొని పక్కా ప్లాన్ తో సీఎంఆర్  వడ్లను అమ్ముకొని రూ.20 కోట్ల కుంభకోణానికి జోగులాంబ గద్వాల జిల్లాలో తెరలేపారు. రూల్స్ లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకున్న కొందరు రైస్ మిల్లర్లు, ఆఫీసర్లు అందినకాడికి దండుకొని రైస్  మిల్లులు లేకున్నా లీజు డాక్యుమెంట్లు పెట్టుకొని కోట్ల రూపాయల సీఎంఆర్ వడ్లకు పర్మిషన్  ఇచ్చారనే ఆరోపణలున్నాయి. బియ్యం లెవీ పెట్టకుండా వడ్లను అమ్ముకొని రైస్  మిల్లులను లీజుకు తీసుకున్న వ్యక్తులు ఆ సొమ్మంతా రియల్  ఎస్టేట్  బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారనే ప్రచారం ఉంది. జిల్లాలోని 8 రైస్ మిల్లులు ఏకంగా రూ.20 కోట్ల బియ్యం బాకీ పడ్డాయి. గడువు తీరినా ఇప్పటివరకు 30 శాతం బియ్యం రావాల్సి ఉంది. అందులో నాలుగు రైస్ మిల్లులు రూ.11 కోట్ల బియ్యం పెట్టాల్సి ఉంది.

41 రైస్  మిల్లులకు సీఎంఆర్  వడ్లు..

జిల్లాలో 36 రా రైస్  మిల్లులు, 5 బాయిల్డ్  రైస్  మిల్లులకు సివిల్  సప్లై ఆఫీసర్లు సీఎంఆర్  వడ్లు ఇచ్చారు. 2021–22 రబీలో 41 రైస్ మిల్లులకు 85,602 మెట్రిక్  టన్నుల వడ్లు ఇచ్చారు. గత నెల 30 వరకు 57,671 మెట్రిక్  టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 39,137 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. 

పక్కా ప్లాన్ ప్రకారం..

సీఎంఆర్  వడ్లను పక్కదారి పట్టించాలనే పక్కా ప్లాన్ తో కొందరు రైస్ మిల్లర్లు, ఆఫీసర్లతో సంబంధం ఉన్న వాళ్లు, రైస్  మిల్లుల్లో పని చేసేవారు, కొందరు రైస్  మిల్లుల బినామీలు కలిసి 8 రైస్  మిల్లులను లీజుకి తీసుకొని సీఎంఆర్  వడ్లను కేటాయించుకున్నారనే  ఆరోపణలున్నాయి. లీజుదారులకు సీఎంఆర్  వడ్లకు సరిపడా షూరిటీ ఉంటేనే ఇవ్వాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా లీజుదారులకు అగ్రిమెంట్ ఆధారంగా వడ్లు కేటాయించారు. 12 మంది రైస్  మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లులను లీజుకు తీసుకున్న వారిలో ఆరుగురు రూ.15 కోట్ల లెవీ బియ్యం ఇవ్వాల్సి ఉంది. సీఎంఆర్  వడ్లను బయట అమ్ముకొని రియల్  ఎస్టేట్  వ్యాపారం చేసినట్లు వారు బహిరంగంగానే చెబుతున్నారు. మరికొందరు ఖరీఫ్  వడ్లను కొనుగోలు చేసి లెవీ బియ్యం పెట్టి మేనేజ్​ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో లారీపై రూ.2 లక్షల వరకు లాభం పొందినట్లు చెబుతున్నారు.

Also Read:ట్విట్టర్ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టిన లిండా యక్కరినో

కేసులు సరే రికవరీ ఎట్లా?

సీఎంఆర్  వడ్ల కుంభకోణంపై ఆలస్యంగా మేల్కొన్న సివిల్  సప్లై ఆఫీసర్లు 3 రైస్ మిల్లులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఐజలోని అన్నపూర్ణ రైస్ మిల్ 60 ఏసీకే(ఒక ఏసీకే అంటే 290 క్వింటాళ్ల బియ్యం)లకు గాను 2 ఏసీకేలు, గద్వాల మండలం కాకులారంలోని శ్రీకృష్ణ రైస్ మిల్ 29 ఏసీకేలకు గాను 2 ఏసీకేలు, శాంతినగర్ లోని సూర్య రైస్ మిల్ 37 ఏసీకేలకు గాను 12 ఏసీకేలు, వెంకటేశ్వర బాయిల్డ్  రైస్ మిల్లు రైస్ మిల్ 115  ఏసీకేలకు గాను 25 ఏసీకేలు మాత్రమే పెట్టారని డీఎం ప్రసాద్ రావు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో కంప్లైంట్ చేశారు.

అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆఫీసర్లు, రికవరీ ఎట్లాగనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. రైస్ మిల్లులను సీజ్ చేద్దామన్న ఓనర్లు వేరే వారు కావడం, లీజ్ గడువు తీరిపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తమ బినామీలను ముందు పెట్టి అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతీ రైస్​మిల్లుకు ఇన్​చార్జీలుగా ఉన్న డీటీలు ఏం చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. అక్రమాలపై రిపోర్టు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారంలో డీటీల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

రికవరీకి టైం పడుతుంది..

లెవీ బియ్యం పెట్టని వారిపై క్రిమినల్  చర్యల కోసం కంప్లైంట్ చేశాం. రికవరీకి కొంత టైం పడుతుంది. కొందరు మిల్లర్లు లెవీ పెట్టేందుకు కొంత టైం అడిగారు. రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- ప్రసాదరావు, డీఎం సివిల్ సప్లై