సీఎన్​జీ దొరకట్లే!

సీఎన్​జీ దొరకట్లే!

గ్యాస్​ కిట్లు పెట్టుకున్న వాహనదారులకు తిప్పలు
రోజూ గంటల తరబడి బంకుల వద్ద క్యూ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  సీఎన్​జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) దొరకడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదారు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో చాలా మంది తిరిగి డీజిల్​వెహికల్స్​ వైపు మళ్లుతున్నారు. డిమాండ్ కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతోనే సమస్య వచ్చిందని వాహనదారులు చెబుతున్నారు. బంకుల్లో లోడ్ నింపిన నాలుగైదు గంటల్లోనే గ్యాస్ అయిపోతున్నది. గ్రేటర్ పరిధిలో 72 సీఎన్ జీ స్టేషన్లు ఉన్నాయి. అన్నింటి ముందు వెహికల్స్​ బారులు తీరి కన్పిస్తున్నాయి. రాష్ట్రానికి కాకినాడ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. కొన్నాళ్లుగా సప్లయ్ లో అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల వరకు సీఎన్ జీ వాహనాలుండగా వాటిల్లో అత్యధికంగా కార్లు, ఆటోలున్నాయి. హైదరాబాద్​లోనే 90 శాతం సీఎన్​జీ బండ్లు నడుస్తున్నాయి. 

డీజిల్ తో సమానంగా రేట్లు
కిలో సీఎన్ జీ ధర కొద్దిరోజుల క్రితం వరకు రూ.70 ఉండేది. పెట్రోల్, డీజిల్ కన్నా తక్కువ ఉండటంతో చాలా మంది సీఎన్​జీ కిట్​అమర్చుకున్నారు. అప్పటిదాకా పెట్రోలు, డీజిల్​​తో నడిచిన బండ్లకు కన్వర్షన్ చేసుకున్నారు. సీఎన్ జీ కిట్ ఉన్నా ఆల్టర్నేట్​గా పెట్రోలు ట్యాంకు ఉంటుంది. అదే డీజిల్ బండ్లకు మాత్రం కన్వర్షన్ చేసుకుంటే ఇక డీజిల్ కు అవకాశం ఉండదు. ఒక్కో కిట్ కోసం వాహనదారులు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చు చేసుకున్నారు. కొంతమంది కొత్త సీఎన్​జీ బండ్లను షోరూమ్​ నుంచి కొన్నారు.  హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో సీఎన్ జీ  బంకులకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) కంపెనీయే గ్యాస్​ సరఫరా చేస్తున్నది. ఇక జిల్లాల్లో మెగా, టోరెంట్ గ్యాస్ కంపెనీలు సప్లయ్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు కంపెనీలకే సప్లయ్ హక్కులున్నాయి. మరో 10 బంకులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా బంకులు అందుబాటులోనే ఉన్నా గ్యాస్ మాత్రం దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. 

ఫుల్ చేసుకుంటే ఒక్కరోజే
ఒక్కో ఆటోలో 4 కిలోలు, కారులో 9 కిలోల వరకు సీఎన్ జీ నింపొచ్చు. కిలోకు 25 నుంచి 30 కిలోమీటర్లు లెక్కేస్తే.. ఒక్కో ఆటోకు రోజులో ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఒక్కో బంకులో 2,000 కేజీలు అమ్ముతున్నారు. వచ్చిన కాసేపటికే గ్యాస్ అయిపోతుండడంతో పొద్దున్నే బంకుల వద్ద ఆటోలు, కార్లు క్యూ కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సప్లైని మెరుగు పరచాలని ఆటో డ్రైవర్ల సమాఖ్య కోరుతోంది.

మూడు, నాలుగు గంటలు బంకుల వద్దే
డీజిల్ రేట్లతో సమానంగా సీఎన్ జీ  ఉంటోంది. గ్యాస్ దొరక్క మూడు, నాలుగు గంటలు బంకుల వద్దే ఉండాల్సి వస్తున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే  సీఎన్ జీ బండ్లు తగ్గిపోయి మళ్లీ పెట్రోలు, డీజిల్ వాహనాలు పెరుగుతాయి.  సర్కారు జోక్యం చేసుకోవాలి. 
- ఆర్ల సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధి

రేట్లతోనే గజిబిజి
ప్రస్తుతం హైదరాబాద్​లో కిలో సీఎన్ జీ ధర రూ.94. కొన్ని బంకుల్లో రూ.5 వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఇంకో రూ.10 ఖర్చు చేస్తే లీటర్​ పెట్రోలు వస్తుందన్న భావన వాహనదారుల్లో కలుగుతోంది. సీఎన్ జీతో నడిచే కార్లు సుమారు 46 వేలు, ఆటోలు 40 వేలు, ట్రక్కులు మూడు వేలు, బస్సులు  వంద వరకు ఉన్నాయి. సీఎన్​జీ ఆటోలు 2014లో రాగా కార్లు 2019 నుంచి మొదలయ్యాయి. రానున్న రోజుల్లో అన్నీ పర్యావరణ అనుకూల వాహనాలనే తీసుకురావాలన్న సర్కారు ఆలోచన బాగానే ఉన్నా.. సీఎన్ జీ కొరత, ధరలను పట్టించుకోకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈ వారంలో కిలో సీఎన్​జీపై రూ.3 వరకు తగ్గించారు. మన దగ్గర రేట్లు తగ్గంచకపోవడంపై వెహికల్స్ ఓనర్స్ ఆగ్రహంతో ఉన్నారు.