
న్యూఢిల్లీ : కోట్ల డాలర్లు క్షణాల్లో అక్రమంగా సంపాదించడానికి వీలు కల్పించిన ఎన్‌ఎస్‌ఈ కో–లొకేషన్ స్కామ్ కచ్చితంగా సూపర్ వైట్‌కాలర్ క్రైమ్ అని ఎన్‌ఎస్‌ఈఎల్ సహా పలు ఎక్స్చేంజ్‌లు నెలకొల్పిన వ్యాపారవేత్త జిగ్నేష్ షా. అలాంటి అవకాశం కల్పించడంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదరంబరంతోపాటు, ఇతరుల పాత్ర మీదా దర్యాప్తు జరగాలని సూచించారు. నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) వంటి మొత్తం 14 ఎక్స్చేంజ్‌లను ఆరు ఖండాలలో ఏర్పాటు చేసిన జిగ్నేష్ షా ఇండియా ఎక్స్చేంజ్ మ్యాన్‌గా పేరొందారు. కొంత మంది ఎంపిక చేసిన బ్రోకర్లకు ముందస్తుగా సమాచారం అందేలా కో–లొకేషన్ సర్వర్ స్కామ్ జరిగిందని, యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఇది కొనసాగిందని షా ఆరోపించారు.
ఎంతో నష్టం చేశారు..
ఫైనాన్షియల్ టెక్నాలజీస్ లిమిటెడ్ పేరిట కంపెనీ పెట్టి, దాని కింద పలు ఎక్స్చేంజ్‌లను షా నెలకొల్పారు. రూ. 5,600 కోట్ల చెల్లింపులు జరపడంలో ఆయన నేతృత్వంలోని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) విఫలమవడంతో అన్ని ఎక్స్చేంజ్‌లలోనూ అధికారిక హోదాల నుంచి షా తప్పుకోవాల్సి వచ్చింది. తాను, తన వ్యాపార సంస్థలు ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటికీ కారణం మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరమేనని తీవ్ర ఆరోపణలు గుప్పించారు జిగ్నేష్ షా. తన వ్యాపారానికి అక్రమ మార్గాలలో అవరోధాలు కల్పించి ఉండకపోయినట్లైతే ప్రపంచపు ఫైనాన్షియల్ మార్కెట్లలో ఇండియా ప్రైస్ సెట్టర్‌గా అవతరించి ఉండేదని పేర్కొన్నారు. తద్వారా ఒక పెద్ద అవకాశాన్నే దేశం పోగొట్టుకుందని అభిప్రాయపడ్డారు. తాము నెలకొల్పిన అన్ని ఎక్స్చేంజ్‌లూ అద్భుతంగా పనిచేస్తుండేవని, ఇతర దేశాలలోనూ ఇదే విజయాన్ని తీసుకు రావాలని అప్పట్లో టార్గెట్‌గా పెట్టుకున్నామని వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగించి, విజయం సాధించాలంటే కష్టమని, ఆనాటి పరిస్థితులన్నీ మారిపోయాయని వ్యాఖ్యానించారు.
ఎన్‌ఎస్‌ఈను కాపాడటానికి వేధించారు
తనకిష్టమైన ఒక ఎక్స్చేంజ్‌ను కాపాడేందుకే మాజీ ఆర్థిక మంత్రి చిదరంబరం తనను టార్గెట్ చేసుకున్నారని కూడా జిగ్నేష్ షా విమర్శించారు. తన ఆధ్వర్యంలోని ఎంసీఎక్స్ గట్టి పోటీ ఇవ్వడమే దీనికి కారణమని చెప్పారు. పూర్తి స్థాయి స్టాక్ ఎక్స్చేంజ్ మొదలు పెట్టేందుకు ఎంసీఎక్స్‌కు అనుమతులు వచ్చిన సమయంలోనే తమకు వ్యతిరేకంగా చర్యలు మొదలైనట్లు వెల్లడించారు. కో–లొకేషన్ స్కామ్‌లో తమపై వచ్చిన ఆరోపణలను ఎన్‌ఎస్‌ఈ ఉన్నతాధికారులు తిరస్కరించారని, ఎన్‌ఎస్‌ఈఎల్ వైఫల్యంలోనూ తమ పాత్రేమీ లేదన్నారని షా తెలిపారు. కో–లొకేషన్ సర్వర్ స్కామ్‌లో ఎన్‌ఎస్‌ఈ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయంలో కొంత మంది ఉన్నతాధికారులు తమ పదవులు కూడా కోల్పోయారు. సెబీ ఇటీవలే కొంతమంది ఉన్నతాధికారులను నిర్దోషులుగా తేల్చగా, మరి కొంత మంది మీద చర్యలు తీసుకోవల్సిందిగా ఎన్‌ఎస్‌ఈని ఇటీవల కోరింది. కొంత మంది ఎంపిక చేసిన బ్రోకర్లకు ముందస్తుగా సమాచారం అందేలా ఎన్‌ఎస్‌ఈ వ్యవహరించిందని ఆరోపణ. సాంకేతికంగా కొన్ని క్షణాలు ముందుగా వచ్చే ఆ సమాచారం ఉపయోగించుకుని షేర్ ధరలు, ట్రేడ్ సంబంధ డేటాలో ప్రయోజనం పొందే అవకాశం ఆ కొంత మంది బ్రోకర్లకు లభించిందనే విమర్శలు వచ్చాయి. కొంత మంది శక్తివంతులైన వ్యక్తుల సంపాదనకు, మనీలాండరింగ్‌కు అడ్డుపడుతున్నాననే భావనతోనే తాను టార్గెట్ అయ్యానని వివరించారు జిగ్నేష్ షా.
ఉద్యోగి మోసాన్ని రాజకీయం చేశారు….
కమోడిటీస్ ట్రేడింగ్, ఎలక్ట్రిసిటీ, కరెన్సీ, బాండ్స్‌లో తాము నెంబర్ 1 పొజిషన్‌కు చేరుకున్నామని, ఎన్‌ఎస్‌ఈకి ధీటుగా పూర్తి స్థాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు అనుమతి కూడా వచ్చిందని షా తెలిపారు. ఎన్‌ఎస్‌ఈఎల్‌లో ఒక ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడని, డిఫాల్టైన బ్రోకర్లతో ఆ ఉద్యోగి కుమ్మక్కయ్యాడని షా వెల్లడించారు. ఐతే, దీనిని ప్రత్యర్ధులు అవకాశంగా మలుచుకున్నారని, రాజకీయ రంగూ పులిమారని వాపోయారు. ఎన్‌ఎస్‌ఈకి ప్రయోజనం కలిగేలా చూసేందుకే తమను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటి వెనకాల ఉన్నది చిదరంబరమేనని అన్నారు. వారి అభిమాన ఎక్స్చేంజ్‌కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలబడగల సత్తా ఉండటంతోనే తమకు (ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌కు) వ్యతిరేకంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. ఎన్‌ఎస్‌ఈ కో–లొకేషన్ స్కామ్‌లో చిదంబరం, సన్నిహితుల పాత్ర వెలికితీయాలని, ఇందుకోసం లోతైన దర్యాప్తు అవసరమని ఆయన పేర్కొన్నారు. జిగ్నేష్ షా వ్యాపారాలకు హోల్డింగ్ కంపెనీగా ఉన్న 63 మూన్స్ (గతంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్) రూ. 10 వేల కోట్ల పరిహారం కోరుతూ బాంబే హైకోర్టులో చిదంబరం సహా ఇద్దరు ప్రభుత్వాధికారుల మీద పరువు నష్టం కేసును దాఖలు చేసింది. ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపుల వైఫల్యం కావాలని సృష్టించి, తమను నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నారని చిదంబరం, ప్రభుత్వ అధికారులపై జిగ్నేష్ షా ఆరోపించారు. ఈ కేసులో చిదంబరంకు హైకోర్టు సమన్లు జారీ చేసింది.
న్యాయ వ్యవస్థపై నమ్మకంతోనే తిరిగొచ్చా..
2014–2016 మధ్య కాలంలో జిగ్నేష్ షా మూడు సార్లు అరెస్టయ్యారు. మొదటిసారి ముంబై పోలీసుల ఎకనమిక్ అఫెన్సెస్ విభాగం, మరోసారి ఈడీ, సీబీఐలు షాను అరెస్టు చేశాయి. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందని, ఈ కేసులలో తాను గెలుస్తాననే ధీమాను షా వ్యక్తం చేస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న కోర్టు తీర్పులు తమ వైఖరి సరైనదని స్పష్టం చేస్తున్నాయని షా పేర్కొన్నారు. తాను లేదా తన గ్రూప్ కంపెనీలేవీ అక్రమంగా లాభపడినట్లు ఏ దర్యాప్తులోనూ తేలలేదని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపుల వైఫల్యంలో 24 గంటల లోపే తాము 24 మంది డిఫాల్టర్లపై పోలీసులకు, నియంత్రణా సంస్థలకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు షా. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆటాచ్‌మెంట్, రికవరీ జరగకుండా నియంత్రణా సంస్థలు చూశాయని, దాంతో తానే దోషి నిల్చోవలసి వచ్చిందని వాపోయారు. భవిష్యత్‌లో కేసుల నుంచి బైటపడగలమనే నమ్మకం ఉందని లండన్ నుంచి ఇటీవలే తిరిగి ఇండియాకు వచ్చిన జిగ్నేష్ షా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.