ఆరేళ్లుగా బొగ్గు ఉత్పత్తిలో.. సింగరేణి వెనుకంజ

ఆరేళ్లుగా బొగ్గు ఉత్పత్తిలో.. సింగరేణి వెనుకంజ
  • కనీసం 70మిలియన్ ​టన్నుల లక్ష్యం అందుకోలేని దుస్థితి
  • గతేడాది మరీ దారుణం
  • వందశాతం బొగ్గు తవ్వలేకపోతోన్న యాజమాన్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఆరేళ్లుగా కోల్ ప్రొడక్షన్ టార్గెట్​రీచ్​కావడంలేదు. వందశాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో యాజమాన్యం ఫెయిల్ అవుతూన ఉంది. ప్రణాళిక లేకుండా లక్ష్యాలను నిర్దేశించుకోవడం మూలంగానే ఉత్పత్తి లక్ష్యాల సాధనలో సింగరేణి వెనుకబడుతోందనే విమర్శలున్నాయి. 2022–23ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని యాజమాన్యం నిర్దేశించుకుంది. అయితే కనీసం70 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలనుకున్నా 67 మిలియన్​టన్నుల కోల్ ప్రొడక్షన్​కే పరిమితమైంది. గత ఐదేండ్లుగా70 మిలియన్​టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని యాజమాన్యం నిర్దేశించుకుంటున్నా సాధించడంలో మాత్రం తడబడతూనే ఉంది. 

ప్రణాళికా లోపమే కంపెనీకి శాపమా..

సింగరేణి కాలరీస్ కంపెనీకి ప్రణాళికా లోపం శాపంగా మారింది. వరుసగా వందశాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. సాధారణంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని ముందస్తుగానే యాజమాన్యం నిర్దేశిస్తుంటుంది. సింగరేణి వ్యాప్తంగా గల అన్ని ఏరియాల్లో యాజమాన్యం ఏర్పాటు చేసిన కమిటీ తిరిగి నిర్ణయిస్తుంది. ఒక్కో ఏరియాలో కోల్​ప్రొడక్షన్స్, మిషనరీ, కార్మికుల సంఖ్య.. ఇలా అన్ని రకాలుగా కమిటీ పెద్దలు ఏరియా ఆఫీసర్లతో సమీక్షించాకే ఓ నిర్ణయానికి వస్తారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై ప్రతి నెల మొదటి వారంలో కంపెనీ డైరెక్టర్లు, ప్రాజెక్ట్​ప్లానింగ్​ఆఫీసర్లు, ఏరియాల జీఎంలు, ఏజెంట్లతో సీఎండీ మీటింగ్ లు నిర్వహిస్తారు. కోల్​ప్రొడక్షన్​లో జరుగుతున్న లోపాలపై సమీక్షిస్తారు. ఇంత చేశాక కూడా లక్ష్యాల సాధనలో వెనుకబాటుకు కారణాలేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రతి నెల ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను12 ఏరియాలకు కేవలం నాలుగైదు ఏరియాలే సాధిస్తున్నాయి. ప్రధానంగా అండర్​గ్రౌండ్​మైన్స్​లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన మందకొండిగా సాగుతోంది. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5ఇంక్లైన్​మైన్ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 50శాతం కూడా అందుకోలేకపోయింది. అండర్ గ్రౌండ్​మైన్స్​ల్లో కార్మికులు అధికార గుర్తింపు సంఘం నాయకుల పైరవీలతో డిప్యూటేషన్ పేర సర్ఫేస్​కు ఎక్కువ పరిమితమవుతున్నారు. ఓపెన్​కాస్ట్ మైన్స్​ల్లో కీలకమైన ఓవర్ బర్డెన్ తొలగింపులో కాంట్రాక్టర్లు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా యాజమాన్యం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఇవే కాకుండా కొత్త మైన్స్​కు ఇన్ టైంలో పర్మిషన్​తీసుకురావడంలో యాజమాన్యానికి సరైన ప్రణాళిక లేదనే విమర్శలున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్​తీయడంలో జరుగుతున్న జాప్యం మూలంగానే కోల్ ప్రొడక్షన్​లో ఎక్కువగా ఆటంకాలు ఎదురవుతున్నాయి.