ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ టౌన్, వెలుగు: మోపాల్ మండలం కంజర ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, మోపాల్‌‌లోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కంజర రెసిడెన్షియల్ స్కూల్‌‌లో అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్ స్టూడెంట్లతో ఆయన మాట్లాడారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా.. అని ఆరా తీశారు. మోపాల్ బీసీ బాలుర గురుకులంలో లోపాలు కనిపించడంతో కలెక్టర్ సంబంధిత అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి గర్భిణులకు సూచించారు. మోపాల్ వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసి తిరుగు ప్రయాణం అవుతుండగా గర్భిణులను ఉచితంగా ఆరోగ్య పరీక్షలు 102 అంబులెన్సులో తీసుకెళ్లడం గమనించారు. ఆశావర్కర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

నిజామాబాద్, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పీడీఎస్‌‌యూ జిల్లా మాజీ కార్యదర్శి కొంగర శ్రీనివాస్‌‌రావు పిలుపునిచ్చారు. పీడీఎస్‌‌యూ నగర జనరల్ బాడీ మీటింగ్‌‌ కోటగల్లి ఎన్ఆర్ భవన్‌‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌‌రావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ నిధులలేమితో కొట్టుమిట్టాడుతోందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్య కాషాయీకరణకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్‌‌యూ జిల్లా ప్రెసిడెంట్ కల్పన, కార్యదర్శి నరేందర్,  టీయూ కన్వీనర్ గణేశ్‌‌, జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, నాయకులు మహిపాల్, నవీన్, అఖిల, నాయకులు గమ్య, తిరుమలేశ్‌‌, తరుణ్, మనీషా, కావేరి, జ్యోతి, చరణ్, సాకేత్, గంగాప్రసాద్, నవీన్, అజయ్ పాల్గొన్నారు.

సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే కీలకం

కామారెడ్డి, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలే కీలక పాత్ర పోషించాయని సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చారు. ముందుగా మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉన్న సాయుధ పోరాట యోధుడు పణిహారం రంగాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టులు పోరాటం చేశారని, ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆనాడు పోరాటంలో లేని పార్టీలు ఇప్పుడు సాయుధ పోరాటం గురించి, కమ్యూనిస్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట బీజేపీ, టీఆర్​ఎస్ నాటకాలు అడుతున్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో లేని పార్టీలు ఇకనైనా తమ ప్రచారాన్ని మానుకోవాలన్నారు. నాటి పోరాటంలో అసువులుబాసిన కామారెడ్డికి చెందిన పణిహారం రంగాచారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పాలని డిమాండ్‌‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు   పశు పద్మ, ఎన్. బాలమల్లేశ్‌‌,  జిల్లా సీనియర్​ లీడర్ వి.ఎల్ నర్సింహ్మారెడ్డి, జిల్లా సెక్రటరీ ఎల్.దశరథ్,  సహాయ కార్యదర్శి పి.బాలరాజు పాల్గొన్నారు.  

టీయూ వీసీని తొలగించండి

 ఉమ్మడి జిల్లాలో ఆందోళన

పలు చోట్ల దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడుతూ గర్ల్స్ పట్ల అనుచితంగా వ్యవహారిస్తున్న వీసీ రవీందర్‌‌‌‌ గుప్తాను తక్షణమే తొలగించాలని కాంగ్రెస్, ఎన్ఎస్‌‌యూఐ డిమాండ్ చేసింది. ఇందూరులోని ఏన్టీఆర్ చౌరస్తాలో మంగళవారం ఎన్ఎస్‌‌యుఐ , మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వీసీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య మాట్లాడుతూ గణపతి నిమజ్జన యాత్రలో  వీసీ డ్యాన్సులు చేస్తూ డబ్బులు విసిరి న్యూసెన్స్ చేశారని మండిపడ్డారు. ఇది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే, వర్సిటీల్లో విద్యార్థినులపై ఒత్తిడి పెరుగుతుంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎన్ఎస్‌‌యూ జిల్లా ప్రెసిడెంట్ వేణు రాజు, అర్బన్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మఠం రేవతి,  మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశ మహేశ్‌‌, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పొలా ఉషా,  చంద్రకళ, కార్యదర్శులు  విజయలక్ష్మి,  సుజాత తదితరులు పాల్గొన్నారు. 

టీయూలో ఆందోళన..

డిచ్‌‌పల్లి, వెలుగు: టీయూ వీసీ వీసీ రవీందర్ గుప్తా ను సస్పెండ్ చేయాలని వర్సిటీ ఎన్ఎస్‌‌యూఐ లీడర్ సింగం వెంకటేశ్‌‌ డిమాండ్​ చేశారు. మంగళవారం క్యాంపస్‌‌లో వీసీ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీసీ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇష్టానుసారం రిజిస్ట్రార్లు మార్చడంపై ప్రశ్నించిన స్టూడెంట్ లీడర్లను కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి అండతోనే వీసీ రెచ్చిపోతున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో అనిల్, భరత్, రమేశ్‌‌, శ్రీనివాస్, అశ్విన్ పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు గవర్నర్ సన్మానం

పిట్లం, వెలుగు: టీబీ ముక్త్​భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ రోగులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన పిట్లం యాదగిరి ఫార్మసీ యజమాని యాదగిరి, జితేందర్‌‌‌‌ను గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ సన్మానించారు. మంగళవారం హైదరబాద్​ రాజ్‌‌భవన్‌‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇద్దరిని సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ 2025 లోగా టీబీ ముక్త్ భారత్ చేయాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఆ లోపే తెలంగాణలో టీబీ నుంచి అందరిని విముక్తం చేయాలని గవర్నర్​ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారన్నారు. తమను గవర్నర్​సన్మానించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఏకకాలంలో రుణమాఫీ  చేయాలి

పిట్లం, వెలుగు: రైతులందరికీ ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని చిన్నకొడప్‌‌గల్‌‌ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం చిన్నకొడప్‌‌గల్‌‌ సొసైటీ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన మహాజన సభలో ఏకకాల రుణ మాఫీపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తొలుత గత ఏడాది జమ, ఖర్చులను విండో సీఈవో హన్మాండ్లు చదివి వినిపించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ కొత్తగా వ్యవసాయ భూమి కొన్న రైతులకు నెల లోపు కొత్త రుణాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. సంఘం పరిధిలోని బుర్నాపూర్, పారడ్‌‌పల్లిలో కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రుణాల వన్ టైంసెటిల్‌‌మెంట్​ అయిన రైతులు సకాలంలో చెల్లించాలని కోరారు. చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌‌రెడ్డి, శివాజీరావు, రైతులు పాల్గొన్నారు.