అమ్మా భవానీ.. ఆరోగ్యం ఎలా ఉంది? : కలెక్టర్ హనుమంతరావు

 అమ్మా భవానీ.. ఆరోగ్యం ఎలా ఉంది? : కలెక్టర్ హనుమంతరావు
  • గర్భిణితో కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి, వెలుగు : 'అమ్మా భవానీ.. ఆరోగ్యం ఎలా ఉంది.. సమయానికి తింటున్నావా.. మందులు వేసుకుంటున్నవా..? టెన్షన్​ పడకుండా మంచి ఆహారం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది’ అని గర్భిణితో కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. 'అమ్మకు భరోసా'లో భాగంగా మంగళవారం వలిగొండ మండలం సుంకిశాలలో గర్భిణి భవాని ఇంటికి కలెక్టర్​వెళ్లారు. ముందుగా గర్భిణి కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. ఆమె భర్త రఘుపతిని ఉద్దేశించి ఏం చేస్తున్నారు.. ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రక్తంలో హిమోగ్లోబిన్​ శాతం పెంచే ఆకుకూరలైన మెంతి, తోటకూర, పుంటికూరను పప్పుతో కలిపి వారానికి రెండుసార్లు ఆహారంగా తీసుకోవాలని సూచించారు. కొబ్బరి తిని గ్లాసు పాలు తాగాలని చెప్పారు. బెల్లంతో పల్లీలు కలుపుకొని తీసుకోవడంతోపాటు ఖర్జూర, డ్రైఫ్రూట్స్​ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. ఐరన్ టాబ్లెట్లు లేదా ఇంజక్షన్ తీసుకోవాలని సూచించారు. అనంతరం న్యూట్రిషన్​ కిట్​ను భవానికి అందజేశారు. డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని చెప్పారు.