- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. పాల్వంచలోని ఓ ప్రయివేట్ గార్డెన్లో టీఎన్జీఓ, టీజీఓ, ట్రస్మా సంఘాలు, ఉద్యోగులతో ప్రగతి టు గెదర్ పేర నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులున్నాయని, వాటిని ఉపయోగించుకోవడంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మునగ, అజోల్లా, సమీకృత వ్యవసాయం, కొర్రమీను, కనుజు పిట్టల పెంపకం, బయోచార్, ఇటుకల తయారీ లాంటి వాటిల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు.
వీటిపై మరింతగా దృష్టి సారిస్తే జిల్లా రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ రాహూల్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా వినూత్న ప్రోగ్రామ్‌లు చేపడుతున్నామన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్‌కు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన మ్యూజియాన్ని ఆధునీకరించామన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, ఆర్డీవో మధు, జడ్పీ సీఈఓ బి. నాగలక్ష్మి, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.
