
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయంతో చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2023 లో వచ్చిన 24 అడుగుల వరద అతి పెద్దది అనుకుంటే 2024లో 40 అడుగుల వరద వచ్చిందని, ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో చాలా మేరకు తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తుచేశారు.
అప్పుడు జిల్లాలో వరద ఉధృతి అధికంగా ఉండటం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగా లేకపోవడం, ప్రజలు ముందుగా వరద ఉధృతి ఊహించకపోవడం లాంటి అనేక కారణాల వల్ల ఇబ్బందులకు గురయ్యామన్నారు. అందులో భాగంగా ఈసారి జిల్లాలో వరద పరిస్థితులపై అలర్ట్గా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసే వర్షం వివరాలను కూడా ట్రాక్ చేస్తూ, మున్నేరు, ఇతర నదుల ప్రవాహాల వివరాలను వాట్సప్ గ్రూపుల ద్వారా జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని తెలిపారు.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 1077 నెంబర్ కూడా ఏర్పాటు చేశామన్నారు. గ్రామ స్థాయిలో ఆపద మిత్రలు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్, నీటి పారుదల శాఖ, ఆశా కార్యకర్త, అంగన్వాడీ టీచర్లతో డిజాస్టర్ టీమ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో కొత్తగూడెం 6వ బెటాలియన్ అధికారి డి. శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ, ఎస్డీఆర్ఎఫ్ బృందం అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాస్ రావు, ఆర్ఎస్సైలు శ్రీవాస్తవ్, శ్రీకాంత్, సురేశ్, ఆర్ఐ జానయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి అర్జీలను స్వీకరించి బాధితులకు భరోసా కల్పించారు. డీఆర్వో ఏ. పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ పాల్గొన్నారు.