పర్మిషన్లు.. క్వాలిఫైడ్​ డాక్టర్లు లేని ఆస్పత్రులపై వేటు

పర్మిషన్లు.. క్వాలిఫైడ్​ డాక్టర్లు లేని ఆస్పత్రులపై వేటు
  • ఇటీవల మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీల్లో బయటపడ్డ బాగోతాలు 
  • హాస్పిటల్స్ లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు  
  • ఆర్డీవో నేతృత్వంలో ఐఎంఏ, డీఎంహెచ్ వోల తనిఖీ
  • ఇప్పటికే జిల్లా కేంద్రంలో 55 మందికి పైగా రిజిస్ట్రేషన్ లేకుండా ట్రీట్మెంట్చేస్తున్నట్లు గుర్తింపు 
  • ఇప్పటికే పలు ఆస్పత్రులకు నోటీసులు, స్కానింగ్​సెంటర్ల సీజ్​

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఎలాంటి పర్మిషన్లు, అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రైవేట్ ఆస్పత్రుల బాగోతాలు బయటపడ్డాయి. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనకు సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో ఇష్టానుసారంగా నిర్వహించే ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ అధికారులు ముడుపులు తీసుకుంటూ మద్దతుగా నిలుస్తున్నారని, అలాంటి ఆస్పత్రులపై ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు కంప్లయింట్స్ వెళ్లాయి. దీంతో తనిఖీలు చేపట్టి 55 ప్రైవేట్ ఆస్పత్రులను ఎలాంటి అర్హతలు, పర్మిషన్లు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి.. నివేదికను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు అందించింది. వెంటనే వాటిపై చర్యలకు ఆదేశించారు. 

స్టేట్ మెడికల్ కౌన్సిల్ టీమ్, ఐఎంఏ తనిఖీలు 

కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై కంప్లయింట్లు అందడంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టీమ్ జిల్లా కేంద్రంలో సీక్రెట్ గా ఆపరేషన్ చేపట్టింది. ఆయా ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇందులో శరత్ కార్డియాక్ సెంటర్ లో డాక్టర్ లేకుండానే ఆపరేటర్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్నాడు. మరోచోట ఎలాంటి అర్హతలు లేకుండా 13 ఏండ్లుగా ఫేక్ సర్టిఫికెట్ తో రేడియాలజిస్ట్ గా చెలామణి అవుతున్నాడు.

 కాగా.. ఇటీవల డాక్టర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయకుండానే స్కానింగ్ సెంటర్ కు జిల్లా వైద్యాధికారులు రెన్యువల్ చేశారు. మరో ఆస్పత్రిలో మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ గడువు పూర్తయినా.. ఏండ్లుగా రెన్యువల్ చేయించుకో కుండా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తుండడం గమనార్హం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సంయుక్తంగా చేసిన తనిఖీల్లో 55 ఆస్పత్రుల్లో ఎలాంటి పర్మిషన్లు, అర్హతలు, డాక్టర్లు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్టు తేలింది. 

ఐఎంఏ, డీఎంహెచ్ వో లు తనిఖీలు..

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చర్యలు చేపట్టారు. డీఎంహెచ్ వో, ఐఎంఏ డాక్టర్లు మూడు టీమ్ లుగా ఏర్పడి క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద జిల్లాలోని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. అర్హత లేని డాక్టర్లను గుర్తించి నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నస్టిక్స్ సెంటర్లను తనిఖీలు చేసి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

 ఇందుకు ఆర్డీవో నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి అనుబంధంగా ఇద్దరు డాక్టర్ల టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే డాక్టర్ లేకుండా కార్డియాక్ సెంటర్ నిర్వహిస్తున్న ఆపరేటర్ పై కేసు నమోదు చేసి సెంటర్​ను
సీజ్ చేశారు. తాజాగా ఎలాంటి అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ఆపిల్ స్కానింగ్ సెంటర్ ను కూడా సీజ్ చేశారు. మరోవైపు బుధవారం రూల్స్ పాటించని 12 ఆస్పత్రులకు నోటీసులు, మరో 7 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. 2 స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు.  

అర్హతలు, పర్మిషన్లు లేకుండా నిర్వహణ.. 

సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక ప్రైవేట్ ఆస్పత్రులను ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు. వీటిలో కొన్నింటిని డాక్టర్లు సొంతంగా నిర్వహిస్తున్నారు. మరికొన్ని హైదరాబాద్ మేనేజ్ మెంట్ పేరిట నడిపిస్తున్నారు. కొన్నింటిపై వైద్యారోగ్య శాఖకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. అయితే.. అలాంటి ఆస్పత్రుల నుంచి జిల్లా వైద్యాధికారులు డబ్బులు తీసుకుంటూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయింది. కొన్ని ఆస్పత్రుల నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.