యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి : రాజర్షి షా

యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి :  రాజర్షి షా

మెదక్​, వెలుగు: యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని మెదక్​ కలెక్టర్​రాజర్షి షా అన్నారు. పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీలుగా, యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో  మంగళవారం జిల్లా స్థాయి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ 2024 కార్యక్రమాన్ని పట్టణంలోని వైస్రాయ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. 

కార్యక్రమానికి హాజరైన కలెక్టర్​ మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని దేశ నిర్మాణానికి సహకరించేలా ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రా స్థాయి యువ పార్లమెంట్ ఫెస్టివల్ లో తెలంగాణ నుంచి ద్వితీయ స్థానం గెలిచిన కుమారి నివేదితను కలెక్టర్ ప్రశంసించి సన్మానించారు. 

కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి,  డీఆర్డీవో శ్రీనివాస్ రావు, పోస్టల్​ సూపరింటెండెంట్​ శ్రీహరి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నాగరాజు, జిల్లా మహిళ,  శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యక్రమ అధికారి  కిరణ్ కుమార్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్​ కే హుస్సేన్ పాల్గొన్నారు. 

ఆర్థిక అక్షరాస్యత ర్యాలీ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచన మేరకు లీడ్​ బ్యాంక్​ ఆధ్వర్యంలో మంగళవారం మెదక్​ పట్టణంలో ఆర్థిక అక్షరాస్యత ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్​ రాజర్షి షా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రజలందరూ బ్యాంకు సేవలను వినియోగించుకోవడం, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ఉద్దేశమన్నారు.  లీడ్ బ్యాంకు మేనేజరు నరసింహ మూర్తి పాల్గొన్నారు.