వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
  • కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్​(నారాయణ పేట), వెలుగు : పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుకు వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లో కొనసాగుతున్న ప్రస్తుత అభివృద్ధి పనులు, పథకాల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక కంటే ముందుగా జిల్లాలో ప్రస్తుత స్థితిని నిర్ధారించడానికి ఒక బేస్‌‌‌‌ లైన్ సర్వే చేపట్టాలన్నారు. ఇందులో 9 అంశాలు ఉంటాయన్నారు. 

ఐదేండ్లపాటు వార్షిక లక్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​ సంచిత్​గంగ్వార్, నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీవో మొగులప్ప,  డీఏవో జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, నాబార్డ్ జిల్లా మేనేజర్ షణ్ముకాచారి, ఎల్ డీఎం విజయ్ కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి 

కోస్గి, వెలుగు : టీయూఎఫ్ఐడీసీ నుంచి మంజూరైన రూ.350 కోట్ల నిధులతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కోస్గి పట్టణంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రజారోగ్యశాఖ, మున్సిపల్, రెవెన్యూశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

పట్టణంలో నిర్మించే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తుఫాను నీటి కాల్వలు, ప్రధాన లింకురోడ్లు, అంతర్గత సీసీరోడ్లు, నీటి సరఫరా పైప్ లైన్ల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. సమావేశంలో తహసీల్దార్ బి.శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఇంజినీర్ జ్ఞానేశ్వర్, వర్క్ ఇన్ స్పెక్టర్ బలరాం తదితరులు పాల్గొన్నారు.