
సూర్యాపేట, వెలుగు : జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అమరవీరుల స్తూపాన్ని, సభాస్థలి వేదికను పూలతో అందంగా అలంకరించాలన్నారు. పోలీసుల గౌరవ వందనంతోపాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్డీవో అప్పారావు, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ శ్రీనివాస్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.