నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నార్కట్​పల్లి, వెలుగు : నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి  అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం నార్కట్ పల్లి మండలంలో ఆమె పర్యటించారు. మండలంలోని బ్రాహ్మణ వెల్లెంలలో  ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం, రికార్డుల నిర్వహణ, ట్రాక్ షీట్లను తనిఖీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. 

విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాలను ఆరా తీశారు. పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేసి ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నార్కట్ లోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. అక్కడ డాక్టర్లు, సిబ్బంది పనితీరు, రిజిస్టర్లు, మందులు స్టాక్ ను పరిశీలించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, నార్కట్ పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అధికారులు ఉన్నారు. 

ఉద్యోగులకు అన్ని వసతులు -కల్పిస్తాం 

నల్గొండ అర్బన్, వెలుగు : కలెక్టరేట్ లో అదనపు గదులు నిర్మించి ఉద్యోగులకు అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండలోని కలెక్టరేట్ ఆవరణలో రూ.40 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ సమీకృత భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతన అదనపు బ్లాకు భవన నిర్మాణ పనులు పది నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.