నాగర్​ కర్నూల్​ జిల్లాలో పోలింగ్‌‌కు ఏర్పాట్లు పూర్తి

నాగర్​ కర్నూల్​ జిల్లాలో పోలింగ్‌‌కు ఏర్పాట్లు పూర్తి
  •  నాగర్​ కర్నూల్​ కలెక్టర్ ఉదయ్ కుమార్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్​ కర్నూల్​ జిల్లాలో  పోలింగ్‌‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌ ఉదయ్ కుమార్ తెలిపారు.  మంగళవారం కలెక్టరేట్‌‌ లో  విలేకరుల సమావేశంలో ఎస్పీ వైభవ్ రఘునాథ్ తో కలిసి మాట్లాడారు. అభ్యర్థులు,  పార్టీలు  ప్రచారం నిర్వహించకూడదని స్పష్టం చేశారు. 30న ఉదయం 5 గంటల్లోగా ఏజెంట్లు పోలింగ్‌‌ కేంద్రాలకు చేరుకోవాలని, 7 గంటలకు పోలింగ్‌‌ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. వదంతులు సృష్టించవద్దని, అనుమానాలు ఉంటే అధికారులను కలిసి నివృత్తి చేసుకోవాలన్నారు.

నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు  అధికారులు  పోస్టల్‌‌ బ్యాలెట్‌‌ అందజేసేందుకు 29 వరకు అవకాశం ఉందన్నారు.  జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 7 లక్షల 90 వేల 76 మంది ఓటర్లు ఉన్నారన్నారు.ఇందులో పురుష ఓటర్లు 3,57,226 మంది, మహిళా ఓటర్లు3,51,838 మంది ఓటర్లు, 9,139 సీనియర్ సిటిజన్ ఓటర్లు, 5,138 మంది దివ్యాంగ ఓటర్లు  ఉన్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 98 శాతం ఓటర్ స్లిప్స్​ పంపిణీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 802 పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు.

మూడు నియోజకవర్గాల పరిధిలో 87 సెక్టార్లకు అధికారులను నియమించామన్నారు.  నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులకు ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి                       

వనపర్తి , వెలుగు : 30న జరిగే  ఎన్నికల్లో ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని  కలెక్టర్, ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ పిలుపునిచ్చారు.  మంగళవారం  ఐడీఓసీలో ఎస్పీ రక్షిత కృష్ణమూర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు.  నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఓటరు  స్లిప్స్​ పంపిణీ చేశామన్నారు.

పోలింగ్​ కేంద్రంలోకి సెల్ ఫోన్  అనుమతించబోమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎక్కడైనా డబ్బు, మద్యం వంటి ప్రలోభాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1950 లేదా సి విజిల్ యాప్ లేదా ఎన్నికల పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.

మూడో విడత  ర్యాండమైజేషన్ కంప్లీట్  

గద్వాల, వెలుగు: ఈనెల 30న జరిగే  ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది మూడో విడత  రాండమైజేషన్   పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎన్నికల పరిశీలకులు వసంత కుమార్, అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహన్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో  రాండమైజేషన్  నిర్వహించారు. గద్వాల నియోజకవర్గంలో 303 పోలింగ్ స్టేషన్లకు 303 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 67 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు 71 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు.

అలంపూర్ నియోజకవర్గంలో 290 పోలింగ్ స్టేషనులకు 290 టీంలను ఏర్పాటు చేసి 226 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.  68  సమస్యాత్మక  పోలింగ్ స్టేషన్లుకు 73 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల రోజు మైక్రో అబ్జర్వర్లు  ఉదయం ఐదున్నర గంటలకే మోడల్​ పోలింగ్ నిర్వహించాలన్నారు. 50 ఓట్లు వేశారో లేదో చూడాలని ఓటింగ్ తర్వాత క్లియర్ బటన్ వచ్చిందో లేదో పరిశీలించాలని ఆదేశించారు.