రేషన్ డీలర్ ను తొలగించాలని కలెక్టరేట్ ముట్టడి

రేషన్  డీలర్ ను తొలగించాలని కలెక్టరేట్  ముట్టడి
  •     గద్వాల, కర్నూల్  రోడ్డుపై రాస్తారోకో
  •     ఆందోళనకారులపై కేసు నమోదు

గద్వాల, వెలుగు :  రేషన్  డీలర్ ను తొలగించాలని డిమాండ్​ చేస్తూ ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామస్తులు బుధవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. గద్వాల, కర్నూల్  రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రేషన్  డీలర్  బ్రహ్మేశ్వరనాయుడు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నాడన్నారు.

డీలర్  ఫ్యామిలీతో పాటు బోయ బీచుపల్లి నాయుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు కంప్లైంట్  చేసినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రేషన్  డీలర్​ను తొలగించి, కబ్జా చేసిన స్థలాన్ని కాపాడాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు గ్రామస్తులు కంప్లైంట్  చేశారు.

గ్రామస్తులపై కేసు

పర్మిషన్  లేకుండా రాస్తారోకో చేసిన ధర్మవరం గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు గద్వాల టౌన్  ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కలెక్టరేట్ గేట్  ముందు ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించి వెహికల్స్, ప్రజలను అడ్డగించినట్లు విధుల్లో ఉన్న పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్  మధు నాయుడుతో పాటు గ్రామానికి చెందిన 47 మంది పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.