రాజప్రాసాదాలు అవసరమా!

రాజప్రాసాదాలు అవసరమా!

కలెక్టర్లకు, ఎస్పీలకు చాలా పెద్ద బంగళాలు ఉంటాయి. వాటిని బంగళాలు అనే బదులు రాజప్రాసాదాలు అంటే బాగుంటుంది. ఇంత పెద్ద బంగ్లాలు అవసరమా? అన్న ప్రశ్న మామూలు ప్రజలు అడుగుతుంటారు. ఆ బంగళాల్లోకి పోకముందే ఆ అధికారుల ఆధిపత్యం మనకు కనిపిస్తోంది. అందులోకి వెళ్తే ప్రజలకు తాము చాలా తక్కువ వాళ్లమనే ఫీలింగ్​ కలుగుతుంది. ఇలా పెద్ద బంగళాలు ఉండటం అనేది బ్రిటిష్​ కాలం నుంచి వచ్చింది. అప్పుడు ఉన్నతాధికారులుగా ఎక్కువగా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు.  వారు తమ ఆధిపత్యం చూపించుకోవడానికి ఇలా పెద్ద పెద్ద బంగళాలను తమ ఉన్నతాధికారుల కోసం ఏర్పాటు చేశారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది.  ఈ రాజప్రాసాదాల ఏర్పాటును సమర్థించడం కోసం.. అధికార సమావేశాలు ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా పెద్దవాళ్లు వస్తారు కాబట్టి  రాజప్రాసాదాలు అవసరం అనే వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే, ఎన్ని అధికారిక సమావేశాలు ఆ రాజప్రాసాదాల్లో జరిగాయి?. ఎంతమంది పెద్దవాళ్లు ఆ అధికారులను కలువడానికి వచ్చారు?.  ఇవన్నీ ప్రశ్నలే. ఇంతకన్నా తక్కువ స్థలంలో ఈ సమావేశాలని, అధికారిక కార్యక్రమాలను నిర్వహించలేమా?  రోజురోజుకూ జనాభా పెరుగుతున్నది. కానీ, భూమి పెరిగే అవకాశం లేదు. ఉన్న భూమినే జాగ్రత్తగా ప్రజావసరాలకు తగినట్లు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్​ సంస్థలు తమ స్థలాలని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటాయో.. ఆ విధంగా ప్రభుత్వం కూడా తమ స్థలాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతుందో అంతర్మథనం చేసుకోవాలి.

ముంబై, ఢిల్లీ, కోల్​కతా లాంటి మహానగరాల్లో భూ సమస్య వివరీతంగా ఉంది. అక్కడ మంత్రులకు, అధికారులకు బంగళాలను కేటాయించడం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ పరిస్థితిని గమనించి కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆ మధ్యన ఓ సూచన చేశారు. మంత్రులకి, పార్లమెంటు సభ్యులకు బంగళాలను వెతకడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి బహుళ అంతస్తుల ఫ్లాట్లను కడితే బాగుంటుందని ఆయన సూచించారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నదని గడ్కరీ చెప్పారు. ఆరువేల నుంచి ఎనిమిదివేల చదరపు అడుగుల ఫ్లాట్లను నిర్మించి మంత్రులకు అధికారులకి ఇస్తే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చారు. పెద్ద పెద్ద బంగళాలను మెయింటెయిన్​ చేయడం కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు. కానీ, కేంద్ర మంత్రి గడ్కరీ సూచన అమలవకపోగా సూచనగానే మిగిలిపోయింది. 

అధికారుల హంగామా

అధికారుల బంగళాల విషయాన్ని గమనిస్తే చాలా విషయాలు మనదేశంలో కన్పిస్తాయి. రాజేశ్​ యాదవ్​ అనే అధికారి తనకు తాను 30వేల చదరపు అడుగుల భవనాన్ని అలాట్ చేసుకున్నాడు. అతను మీరట్​డెవలప్​మెంట్​అథారిటీ వైస్​ చైర్మన్​గా పనిచేశారు. ఆ విశాల భవనంలో స్విమ్మింగ్​పూల్, జిమ్, స్నూకర్,  టేబుల్​ టెన్నిస్​లాంటివి ఎన్నో ఉన్నాయి. పెద్దవాళ్ల అధికారిక జీవితం గురించే కాకుండా వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారు మంత్రులు, ముఖ్యమంత్రులే కావాల్సిన అవసరం లేదు. ఐఏఎస్, ఐపీఎస్​అధికారులు కూడా కావచ్చు. అలాంటి రాజప్రాసాదం ఒకటి ఆ మధ్య ప్రజల దృష్టిని ఆకర్షించింది. అది ఓ ఐపీఎస్​ ఆఫీసర్​ అధికారిక నివాస గృహం. ఆయన చత్తీస్​గఢ్​లోని దంతేవాడ జిల్లాకి ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉంటున్న రాజప్రాసాదం చాలా విశాలమైనది. దానికి ఓ మహాద్వారం. పెద్ద పార్క్, చెట్లపైన కూడా ఓ చిన్న ఇల్లు. ఇలా చాలా హంగులు ఉన్నాయి. ఆ రాజప్రాసాదం వీడియో ఆ మధ్య సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇలా ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల అధికార నివాసాల గురించి చెప్పుకుంటూపోతే దానికి అంతం ఉండదు. 

ప్రగతిభవన్ ఇకనుంచి ప్రజాభవన్​

ప్రగతిభవన్​ ఇకనుంచి ప్రజాభవన్​గా మారుతుందని కాబోయే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి డిసెంబర్​3న ప్రకటించారు. దానికి అంబేద్కర్​ ప్రజాభవన్​ అని నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 3న వచ్చాయి. అంటే  శ్రీకాంతాచారి అమరుడు అయిన రోజు.  ప్రగతి భవన్​కు ఆయన పేరు పెట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. కానీ, ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రజాభవన్​ దగ్గరనో, ట్యాంక్ బండ్​ దగ్గరలో నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ప్రగతిభవన్​ను ప్రజాభవన్​గా మార్చినంత మాత్రాన ప్రజలు సంతోషించరు. అది నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల కోసమే ఉండాలి. ముఖ్యమంత్రి ఆ భవనాన్ని తన అధికారిక నివాస భవనంగా ఉపయోగిస్తారా లేదా అనేది తెలియదు. దాన్ని అధికారిక నివాసంగా స్వీకరిస్తే  ప్రజలు అందులోకి సులువుగా వెళ్లగలిగే పరిస్థితి ఉండాలి. ఒకవేళ దాన్ని అధికారిక నివాసంగా స్వీకరించకపోతే విద్యార్థుల చదువు కోసమో, కళాకారుల కోసమో, ప్రజావైద్యావసరాల కోసమో ఉపయోగించాలి. ఇంకా ఏదైనా గొప్ప ఆలోచన వస్తే ఆ భవనాన్ని ఆ విధంగా సద్వినియోగం చేయాలి. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి విశాలమైన స్థలం అవసరమే. కాదని అనలేం. అయితే తొమ్మిది ఎకరాల స్థలం మాత్రం అవసరం లేదు. అది అధికార దర్పం చూపించడమే తప్ప మరోటి కాదు. ఇప్పుడు రాజులు లేరు. ప్రజలే అధినేతలు. ఇక రాజప్రాసాదాలు అవసరమా?.

9 ఎకరాల్లో ప్రగతిభవన్​

ప్రగతిభవన్​ విషయానికొస్తే దాని విస్తీర్ణం 9 ఎకరాలు. నిర్మించిన స్థల విస్తీర్ణం లక్ష చదరపు అడుగులు. ఈ భవనం నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయలకుపైగా ప్రజాధనాన్ని వెచ్చించారు. హైదరాబాద్​లోని ప్రముఖమైన స్థలంలో దీన్ని నిర్మించారు. దీన్ని నిర్మించేందుకు.. ఐఏఎస్​ అధికారుల కోసం నిర్మించిన 10 గృహ సముదాయాలు, 24 మంది సబార్డినేట్ అధికారుల గృహాలను కూల్చివేశారు. ఈ భవనంలో ముఖ్యమంత్రి నివాసం, సీఎం క్యాంప్​ కార్యాలయం, మీటింగ్​హాలు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంప్​ కార్యాలయం కూడా ఉంది. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రులు కూడా ఇందులో ఉన్నారు. కానీ, అప్పుడు ఇంత విస్తీర్ణాన్ని ఆక్రమించలేదు. ఇంతగా నిర్మించిన భవన సముదాయం కూడా అప్పుడు లేదు. చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత విస్తీర్ణం ఉన్న భవన సముదాయం అవసరం ఏర్పడింది. ఈ భవనంలో ఎన్ని అధికారిక సమావేశాలు జరిగాయో ఆ పెరుమాళ్లకే ఎరుక. ఎంతకాలం ముఖ్యమంత్రి ఈ భవనంలో నివసించినారో అక్కడ ఉన్న అధికారులకే తెలుసు. ఈ స్థలంతోపాటు ప్రగతి భవన్​లోకి వెళ్లడానికి బేగంపేట రోడ్డులో బారికేడ్లను నిర్మించారు. దానివల్ల బాగా సందడిగా ఉండే బేగంపేట రోడ్డు ఇరుకుగా మారిపోయింది. ఇప్పుడు ఆ బారికేడ్లను తొలగిస్తారని అంటున్నారు. 

- మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్​)