
నల్గొండ, యాదాద్రి, వెలుగు : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ, సూర్యాపేట కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నల్గొండ జిల్లాలో 97 మంది ఫిర్యాదులు రాగా, అందులో జిల్లా అధికారులకు సంబంధించి 44, రెవెన్యూ అంశాలకు సంబంధించి 53 ఫిర్యాదులు వచ్చాయి.
సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం 63 ఫిర్యాదులు వచ్చాయి. అందులో భూ సమస్యలకు సంబంధించి 27, జిల్లా సంక్షేమ శాఖ 3, జిల్లా పౌర సరఫరాల శాఖ 3, మిగిలిన 30 అర్జీలు వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్లు ఆదేశించారు. సమస్యలపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుకు తెలియజేయాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే ఎందుకు కాలేదో స్పష్టంగా చెప్పాలని సూచించారు.
కొడుకు చూస్తలేడు..
ఉన్న భూమిని తీసుకున్న కొడుకు.. తమను సరిగా చూస్తలేడని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పలువురు పేరెంట్స్ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి పలువురు పేరెంట్స్వచ్చారు. తమ పేరున ఉన్న భూమిని తీసుకొని తమ కొడుకు నిర్లక్ష్యం చేస్తున్నాడని గుండాల మండలం అనంతారం గ్రామానికి చెందిన ఆది కమలమ్మ ఫిర్యాదు చేశారు.
భువనగిరి మున్సిపాలిటీలోని 11వార్డులోని 85వ సర్వే నంబర్లో ఎస్సీల ఇండ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 118లో ఎస్సీలకు ఇచ్చిన భూమికి హద్దులు గుర్తించి, లే అవుట్ చేయించాలని కోరారు. ఈ విధంగా 68 మంది తమ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్ వాటిని డిపార్ట్మెంట్ల వారీగా ఫార్వర్డ్చేసి పరిష్కరించాలని ఆదేశించారు.