
సెంట్రల్ డెస్క్, వెలుగు : ప్రపంచంలోనే అత్యంత తేలికైన పెయింట్‌ను సైంటిస్టులు తయారు చేశారు. ఎంత తేలికంటే.. ఒక బోయింగ్ 747 విమానానికి పెయింట్ వేయాలంటే 454 కిలోల రంగు అవసరం అవుతుంది. కానీ సైంటిస్టులు తయారు చేసిన పెయింట్ అయితే 1.36 కిలోలు సరిపోతది. ఈ పెయింట్ చాలాకాలం వరకు ఉంటుందని, దీనికితోడు 13 నుంచి 16 డిగ్రీల టెంపరేచర్‌ను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
సీతాకోక చిలుక రెక్కలపై ఉండే రంగులతో ఈ పెయింట్‌ను తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రంగుకు ‘ప్లాస్మోనిక్ పెయింట్’ అని పేరు పెట్టారు. పెయింట్ తయారీలో రంగులకు బదులు పిగ్మెంట్స్ (నానోపార్టికల్స్)ను ఉపయోగించారు.
తగ్గనున్న గ్రీన్హౌస్ ఎఫెక్ట్
విమానాలకు ఈ పెయింట్ వేయడంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గుతుందని, ల్యాబ్‌లో ఈ పెయింట్ తయారు చేస్తున్నట్లు సైంటిస్టులు చెప్పారు. పెద్దమొత్తంలో తయారు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని, మరిన్ని రంగుల్లో తయారు చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించారు. అన్ని రకాల ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రం రిఫ్లెక్ట్ను తగ్గిస్తుందన్నారు.
‘ప్లాస్మోనిక్ పెయింట్’ వేస్తే టెంపరేచర్ తగ్గి ఆ ప్రాంతం చల్లగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా నానో సైంటిస్ట్ దేవశీష్ చందా తెలిపారు. అమెరికాలో ఉపయోగించే మొత్తం కరెంట్‌లో 10శాతం ఏసీల కోసమే వినియోగిస్తారని చెప్పారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు ‘ప్లాస్మోనిక్ పెయింట్’ వేస్తే కరెంట్ సేవ్ అవుతుందని వివరించారు.
ఒక్కో రంగుకు ఒక్కో పిగ్మెంట్
కమర్షియల్ పెయింట్ తయారీలో ఉపయోగించే పిగ్మెంట్ను ఆర్టిఫిషియల్ సింథసైజ్ చేసి తయారు చేస్తారు. పిగ్మెంట్‌లోని ప్రతీ కణంలో ఎలక్ట్రానిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఇది వాతావరణంలోని వేడి, కాంతిని ఎంత గ్రహిస్తుందో తెలియజేస్తుంది. అందుకే ఒక్కో రంగుకు వేర్వేరు పిగ్మెంట్లు అవసరం అవుతాయి. ఇలాంటి కణాలతో తయారైన ప్లాస్మోనిక్ పెయింట్ బరువు తేలికగా ఉంటుంది. దీని మందం 150 నానో మీటర్లే. ఈ మందంలో మాత్రమే పెయింట్ పూర్తి రంగును ఇస్తుంది.
అందుకే ‘ప్లాస్మోనిక్ పెయింట్’ ప్రపంచంలోనే అత్యంత తేలికైన పెయింట్‌గా రికార్డులోకెక్కింది. ఈ పెయింట్ తయారీకి ‘ఎలక్ట్రాన్ బీమ్ ఎవాపొరేటర్’ ఉపయోగించారు. ఇది అల్యూమినియం నానో పార్టికల్స్‌ను సరైన మార్గంలో సమీకరించే మెషిన్. అందులోని కణాలు సరిగ్గా అమర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో టెంపరేచర్, ఒత్తిడిపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడంతో పెయింట్ తేలికగా.. సాగే గుణం పొందుతుంది.