ఆసిఫాబాద్ అడవుల్లో కాలమ్నార్ బసాల్ట్ శిలలు

ఆసిఫాబాద్ అడవుల్లో కాలమ్నార్ బసాల్ట్ శిలలు
  •     మొదటి సారి దొరికిన అరుదైన శిలలు
  •     భూమి పుట్టుక తెలుసుకునే అవకాశం
  •     తిర్యాణి మండలం గిన్నేధరి అటవీ ప్రాంతంలో లభ్యం 

ఆసిఫాబాద్/తిర్యాణి, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నేధరి అటవీ ప్రాంతంలో కాలమ్నార్ బసాల్ట్ శిలలను కనుగొన్నారు. పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ, హెరిటేజ్ (ప్రిహా) కు చెందిన పరిశోధకులు కొన్ని నెలల కింద మినియేచర్​కాలమ్నార్ బసాల్ట్ శిలలను గుర్తించారు. వాటిని శాస్త్రీయంగా స్టడీ చేసి వివరాలను తెలిపారు. ఆరున్నర కోట్ల ఏండ్ల కింద భూగర్భం నుంచి బయటకు ప్రవహించిన లావా చల్లారి ఏర్పడిన శిలలను కాలమ్నార్ బసాల్ట్ శిలలని అంటారని ప్రిహా సభ్యుడు, ఫారెస్ట్​ రేంజ్ ఆఫీసర్ తోడిశెట్టి ప్రణయ్ తెలిపారు. ఈ శిలల్ని తెలంగాణలో మొదటిసారి గుర్తించినట్లు తెలిపారు. జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్ రావు ఈ శిలల గురించి మాట్లాడుతూ గతంలో  దొరికిన బసాల్ట్ శిలల ప్రాంతాలకు, ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం, ఈ శిలలు ఏర్పడిన క్రమం, పద్ధతిపై మరింత స్టడీ చేయాల్సి ఉందన్నారు. 

దక్కనులో సుమారు ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట లావా ప్రవాహం వల్ల ఈ బసాల్ట్ శిలలు ఏర్పడినట్టు భూభౌతిక శాస్త్రజ్ఞులు గుర్తించారని, ఈ రకమైన శిలలు అమెరికాలోని కొలంబియానది ప్రాంతంలో, ఐస్ ల్యాండ్, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో కూడా గుర్తించినట్లు తెలిపారు. కుజ గ్రహంపై ఉన్న బసాల్ట్ శిలలు భూమిపై ఉన్న శిలల కంటే పాతవని నాసా గుర్తించిందని చెప్పారు.భూమి ఏర్పాటు క్రమాన్ని అర్థం చేసుకోవడంలో గిన్నేధరి  మినియేచర్ శిలలు ఉపయోగపడుతాయన్నారు. ఉత్తర తెలంగాణలోని ఏడు చోట్ల కాలమ్నార్ బసాల్ట్ శిలల్ని గుర్తించారు. ప్రిహా జనరల్ సెక్రటరీ డాక్టర్​ ఎం ఏ శ్రీనివాసన్ మట్లాడారు.