ఎంఎస్పీపై కమిటీ.. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే

ఎంఎస్పీపై కమిటీ.. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే
  • ఈసీ రూల్స్​ ప్రకారం ముందుకు వెళ్తాం
  • రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి తోమర్​

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్​ తోమర్​ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్​ రూల్స్​కు తగ్గట్టుగా నడుచుకుంటామని చెప్పారు. కమిటీ వేస్తామని ఎన్నికల కమిషన్​ను కోరగా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవా, పంజాబ్​ రాష్ట్రాలకు ఎలక్షన్స్​ జరుగుతున్నందున ఆగాలని సమాధానం ఇచ్చిందని ఆయన వివరించారు. అందుకే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. కొత్త అగ్రి చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఎంఎస్పీపై కమిటీ వేస్తామని చెప్పారని, అందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కమిటీ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోవడంలేదని గురువారం సంయుక్త కిసాన్​ మోర్చా విమర్శించినందున తాజాగా మంత్రి వివరణకు ప్రాధాన్యం చోటుచేసుకుంది. 

రిపోర్టు ఆధారంగా ఎంఎస్పీకి చట్టబద్ధత 
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు తెస్తారా అని బీజేడీ ఎంపీ ప్రసన్నా ఆచార్య ప్రశ్నించగా.. ఎంఎస్పీ విషయంలో స్వామినాథన్​ కమిటీ ఇచ్చిన సిఫార్సులను 2018–19లోనే తమ ప్రభుత్వం ఆమోదించిందని, అందుకు తగ్గట్టుగానే కనీస మద్దతు ధరను  చెల్లిస్తున్నదని కేంద్ర మంత్రి తోమర్​ చెప్పారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కలిపించాలా.. వద్దా.. అనే విషయం ఎంఎస్పీపై ఏర్పాటు చేసే కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఉంటుందన్నారు. గతంతో పోలిస్తే ఎంఎస్పీ ధరను రెట్టింపు చేశామని, తాజా బడ్జెట్​లో కూడా 2.37 లక్షల కోట్లు కేటాయించామని ఆయన వివరించారు. 

గోధుమ, వరి కొనుగోళ్లు పెంచాం
ఎంఎస్పీ, ప్రొక్యూర్​మెంట్​పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్​ అడిగిన మరో ప్రశ్నకు.. రైతులు పండించిన పంటకు సరైన ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తోమర్ చెప్పారు. గోధుమ, వరి ధాన్యం కొనుగోళ్లను పెంచడమే కాకుండా పంటలను కాపాడుకునేందుకు రైతుల కోసం కేంద్రం పీఎం కిసాన్​ స్కీం వంటి పలు పథకాలను అమలు చేస్తున్నదని, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని వివరించారు.

స్వామినాథన్​ కమిటీ సిఫార్సు మేరకే ఎంఎస్పీ
స్వామినాథన్​ కమిటీ 2006లో రిపోర్టు ఇచ్చిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్​ చౌదురి చెప్పారు. దీనిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ మినిస్టీరియల్​ ప్యానెల్ 201 సిఫార్సులకు ఓకే చెప్పిందన్నారు. ఇందులో తమ ప్రభుత్వం 200 సిఫార్సులను ఆమోదించి, అమలుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.