వివాదాలకు కేరాఫ్​గా సర్కారు యూనివర్సిటీల్లోని వైస్​ చాన్స్​లర్లు

వివాదాలకు కేరాఫ్​గా సర్కారు యూనివర్సిటీల్లోని వైస్​ చాన్స్​లర్లు
  • వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్లు
  • వివాదాలకు కేరాఫ్​గా సర్కారు యూనివర్సిటీల్లోని వైస్​ చాన్స్​లర్లు
  • అంతా వాళ్ల ఇష్టారాజ్యం.. భూముల లీజులు, నియామకాల్లో గోల్​మాల్​
  • నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా, ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు
  • నాడు బీఆర్​ఎస్​కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు
  •  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల వైస్​ చాన్స్​లర్లు వివాదాలకు కేరాఫ్​గా మారిపోయారు. వీరిలో చాలా మంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం.. బీఆర్​ఎస్​ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏది చెబితే అది చేయడమే పనిగా పెట్టుకున్నారు. వర్సిటీల్లోని భూముల లీజులు, స్టాఫ్​ నియామకాలు, నిధుల ఖర్చుల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. సమస్యలపై ఆందోళనకు దిగిన స్టూడెంట్లపై పోలీసులతో లాఠీ చార్జ్​ చేయించడం, అక్రమ కేసులు పెట్టించడం, నిర్బంధాలు అమలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ వీసీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీసీల అక్రమాలపై విచారణ జరిపించాలని, వారిని పదవుల్లో నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఇట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో  ఓయూ, కేయూతోపాటు పలు వర్సిటీల వీసీలు ఉన్నారు.

గత ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. నాటి ప్రభుత్వ అండదండలతో వీసీ పోస్టుల్లోకి వచ్చినవారే కాబట్టి.. నాడు ప్రభుత్వం తమ నిరసనలను అణచివేయించిందని అంటున్నారు. 

బీఆర్​ఎస్​కు ప్రచారకులుగా మారి..!

రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో మొత్తం 11 యూనివర్సిటీలు ఉండగా.. ఈ మధ్య కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా యూనివర్సిటీగా మార్చారు. దీంతో సర్కారు వర్సిటీల సంఖ్య 12కు చేరింది. వీటిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ)కి రెగ్యులర్ వీసీని నియమించలేదు. కొత్తగా ఏర్పడినందున మహిళా యూనివర్సిటీకి కూడా పూర్తి స్థాయి వీసీ లేరు. మిగతా పది వర్సిటీల వీసీల్లో ఎక్కువ మందిపై మొదటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో వీసీల నియామకాన్ని అప్పటి బీఆర్​ఎస్​ సర్కారు చేపట్టింది. ఈ నియామకాలన్నీ నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. ఏకంగా మంత్రులే వీసీ పోస్టులను పంచుకొని.. తమకు అనుకూలమైన వారికి ఇప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇట్ల సర్కారు పెద్దల ఆశీస్సులతో వీసీలుగా బాధ్యతలు చేపట్టినవాళ్లలో పలువురు.. స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి గత సర్కారుకు, బీఆర్​ఎస్​కు అనుకూలంగా పత్రికల్లో ఆర్టికల్స్ రాయడంతో పాటు ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది. 

వీసీలు, రిజిస్ట్రార్ల నియామకాల్లో రూల్స్​ బ్రేక్​

వైస్​ చాన్స్​లర్​గా ఉండాలంటే ప్రొఫెసర్​గా కనీసం పదేండ్ల అనుభవం ఉండాలి. కానీ.. దాన్ని పక్కపెట్టి, కాకతీయ వర్సిటీకి రమేశ్​ను వీసీగా నియమించారు. మరోపక్క 70 ఏండ్ల వయస్సు దాటిన కిషన్​ రావును పొట్టి శ్రీరాములు తెలుగు  వర్సిటీ వీసీగా నియమించా రు. ఈ ఇద్దరు వీసీల నియామకంపై కోర్టులో కేసు నడుస్తున్నది. మరోపక్క పలువురు వీసీలు డబ్బులు పెట్టి పదవుల్లో చేరారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన టైమ్​లో  రవీందర్ గుప్తా పలుమార్లు తన సన్నిహితులతో పాటు ఆ వర్సిటీ సిబ్బంది ముందు తాను డబ్బులు పెట్టి పదవి తెచ్చుకున్నట్లు చెప్పడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్టయింది. వర్సిటీల్లోని రిజిస్ట్రార్ల నియామకం కూడా నాడు సర్కారు పెద్దల కనుసన్నల్లోనే జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్​ను మార్చి.. కొత్త రిజిస్ట్రార్​ను నియమించిన గంటల్లోనే పాత రిజిస్ట్రారే మళ్లీ కొనసాగుతారంటూ ఉత్తర్వులు రావడం కాంట్రవర్సీగా మారింది. 

అంతా వీసీల ఇష్టారాజ్యం

ఉస్మానియా యూనివర్సిటీ వీసీపై అనేక  ఆరోపణలు ఉన్నాయి. వీసీగా బాధ్యతలు చేపట్టగానే ఆయన సుమారు 300 మందిని సెక్యూరిటీగా నియమించుకున్నారు. ఓయూలో నిర్బంధం అమలు చేశారు. ముండ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అన్ని కోర్సుల్లో మూడు, నాలుగింతల ఫీజు పెంచారు. వర్సిటీలోకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రానివ్వలేదు. మరోపక్క ఓ కాంట్రాక్టర్ ద్వారానే నిర్మాణాలు చేయిస్తున్నారని, ఓయూ స్థలాన్ని పెట్రోల్ బంక్  కోసం నిబంధనలకు విరుద్ధంగా లీజ్​కు ఇచ్చారని, ఎస్​బీఐలోని వర్సిటీ ఎఫ్ డీలను ఓ ప్రైవేటు బ్యాంకుకు మార్చారన్న ఆరోపణలు ఓయూ వీసీపై ఉన్నాయి.  పలువురు ప్రొఫెసర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, స్టూడెంట్ యూనియన్ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని విద్యార్థులు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓయూలోని ముండ్ల కంచెలను తొలగించింది. అట్లనే.. వీసీపైనా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్​ యూనియన్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. 

–కాకతీయ వర్సిటీ వీసీ తీరు వివాదాస్పదంగా మారింది. పీహెచ్ డీ అడ్మిషన్లలో అవకతవకలు.. ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో అక్రమాలు.. రిటైర్​అయిన వ్యక్తిని రిజిస్ట్రార్ గా నియమించుకోవడం.. న్యాక్ గ్రేడ్ కోసం ఫేక్ ప్రాజెక్టులు చూపెట్టడం.. కేయూ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వర్సిటీ ఉద్యోగికి వత్తాసు పలకడం.. సీనియర్లను కాదని జూనియర్లకు పరిపాలన పదవులు అప్పగించడం... ఇలా అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మునుగోడు బై ఎలక్షన్ పోలింగ్ రోజున బీఆర్ఎస్ కు మద్దతుగా ఓ పత్రికలో ఏకంగా కేయూ వీసీ వ్యాసమే రాశారు.  పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలపై ఆందోళనకు దిగిన విద్యార్థులపై కేసులు పెట్టడం, పోలీసులు కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీని వెనుక వీసీ ఉన్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.  పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు  స్వయంగా కేయూకు వెళ్లి విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. 

      నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన టైమ్​లో రవీందర్​ గుప్తా కాంట్రవర్సీలకు కేరాఫ్​గా మారారు. ఈసీ అనుమతి లేకుండానే వర్సిటీ నిధులను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని, రూల్స్​కు వ్యతిరేకంగా ఔట్ సోర్సింగ్ ద్వారా సుమారు 200 మందిని నియమించి, వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది ప్రమోషన్లు, బెనిఫిట్స్ కోసం వాళ్ల నుంచి లక్షల్లో వసూళ్లు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. టెండర్లు లేకుండానే ఇష్టానుసారంగా కొనుగోళ్ల పేర్లతో భారీ మొత్తంలో డబ్బులు దుర్వినియోగం చేశారనే వాదనలున్నాయి. వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టునూ డబ్బులకే అమ్ముకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు కోసం కూడా వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘డబ్బులిచ్చి వచ్చా.. ఎవరేం చేస్తారు’ అంటూ  సిబ్బంది ముందు బహిరంగంగానే నాడు వీసీ రవీందర్​ గుప్తా అన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఏసీబీ కేసులో ఆయన దొరికిపోయారు.  ప్రస్తుతం తెలంగాణ వర్సిటీకి వీసీ లేరు. ఇన్​చార్జ్​ మాత్రమే కొనసాగుతున్నారు. 

హైదరాబాద్​లోని జేఎన్టీయూ వీసీపైనా ఆరోపణలున్నాయి. ఓపెన్ వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ను ఓఎస్​డీగా పెట్టుకొని, ప్రైవేటు కాలేజీల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్లు అప్పట్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో నాడు సర్కారే జోక్యం చేసుకుని ఓఎస్​డీని తొలగించింది. ఇంజినీరింగ్ ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల కోసం డబ్బులు వసూలు చేశారని, చెప్పినంత ఇవ్వకపోతే కాలేజీల సీట్లలో కోతలుపెట్టారని, డబ్బులు ఇచ్చిన వెంటనే  మళ్లీ తిరిగి సీట్లను పెంచారని జేఎన్టీయూ వీసీపై విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేస్తున్నాయి. ప్రొఫెసర్ల ప్రమోషన్లకూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.  

  శాతవాహన యూనివర్సిటీ వీసీ పాలనతీరుపై కూడా విమర్శలు ఉన్నాయి. వర్సిటీలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ నిధుల దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ వెహికల్స్ సొంతానికి వాడుకుంటున్నారే వాదనలున్నాయి. గతంలో రెగ్యులర్ కోర్సులుగా ఉన్న బోటనీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లిష్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా యూనివర్సిటీలో పరిస్థితిపై యూజీసీకి ఫిర్యాదు చేశారన్న కారణంతో ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్లను కుట్రపూరితంగా వీసీ తొలగించారని, తనకు అనుకూలంగా ఉండే కొందరు ప్రొఫెసర్లకు కాష్ ప్రమోషన్లు ఇప్పించుకున్నారని, క్యాంపస్​లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్  లేకపోయినా ఆ పేరుతో ఒకరిని నియమించుకున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.  కొత్త ప్రభుత్వం స్పందించి.. వివాదాస్పద వీసీలపై చర్యలు తీసుకోవాలని, వారి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేస్తున్నాయి. 

సెర్చ్ కమిటీల నుంచే రాజకీయం

2019 జూన్​లో పాత వీసీల కాలపరిమితి ముగియగా.. అదే ఏడాది జులైలో కొత్తవాళ్ల కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. 10 వీసీ పోస్టుల కోసం వెయ్యి దాకా అప్లికేషన్లు వచ్చాయి. అదే సెప్టెంబర్ లో సెర్చ్ కమిటీలను అప్పటి ప్రభుత్వం నియమించింది. కానీ, దాదాపు రెండున్నరేండ్ల దాకా కొత్త వీసీలను నియమించకుండా.. ఐఏఎస్​లను ఇన్​చార్జులుగా పెట్టి వర్సిటీల పాలనను నడిపించింది. స్టూడెంట్ల ఆందోళనలతో పాటు గవర్నర్ నుంచి ఒత్తిడి పెరగడంతో 2021 మేలో 10 మంది కొత్త వీసీలను నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం నియమించింది. అయితే, సెర్చ్ కమిటీ సమావేశాల్లో నాటి ప్రభుత్వం తరఫున కోఆర్డినేటరే అంతా తానై నడిపించారు. తెలంగాణ వర్సిటీకి వీసీగా ముగ్గురి పేర్లను ప్రతిపాదించగా.. అందులో రవీందర్ గుప్తా పేరుపై నాడు తెలుగు వర్సిటీ, తెలంగాణ వర్సిటీ సెర్చ్ కమిటీ మెంబర్ గా ఉన్న సీనియర్ ప్రొఫెసర్ ప్రసాద్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో ప్రొఫెసర్​ ప్రసాద్​ను తెలుగు యూనివర్సిటీ సెర్చ్ కమిటీ నుంచి తప్పించి, వేరే వారిని పెట్టారు.

పైరవీలతో వచ్చినోళ్లే ఎక్కువ

ఓయూ వీసీని హైదరాబాద్​కు చెందిన అప్పటి ఓ మంత్రి.. కాకతీయ వర్సిటీ వీసీని అప్పటి ఎమ్మెల్సీ పట్టుపట్టి నియమించుకున్నట్లు వాదనలున్నాయి. తెలంగాణ వర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీతోపాటు ఓ ఐఏఎస్​ ఆఫీసర్​ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల వీసీల పేర్లను కూడా ఇట్ల బీఆర్​ఎస్​ పెద్దలే ప్రతిపాదించినట్లు స్టూడెంట్​ యూనియన్లు మండిపడ్తున్నాయి. పాలమూరు వర్సిటీ వీసీని నాటి ఓ మంత్రి.. శాతావాహన వర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ.. జేఎన్టీయూ వీసీని అప్పటి ఓ మంత్రి.. ఎంజీ వర్సిటీ వీసీని ఓ ఎమ్మెల్యే పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి.